Home తాజా వార్తలు కిడ్నాపైన పసికందును కాపాడిన ఎస్‌పి…

కిడ్నాపైన పసికందును కాపాడిన ఎస్‌పి…

Kidnapping

 

నాలుగు రోజుల్లోనే నిందితుల పట్టివేత
సురక్షితంగా పసికందును తల్లిదండ్రులకు అప్పగింత
రూ. 10 వేలకు అమ్ముకునే ప్రయత్నం

మహబూబ్‌నగర్  : పసికందును కిడ్నాప్ చేసిన నిందితులను నాలుగురోజుల్లోనే పట్టుకొని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరీ కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఎస్పీ ఛేదించి కిడ్నాప్‌కు గురైన పసికందును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరీ విలేకరుల సమావేశంలో కిడ్నాప్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13న జిల్లా కేంద్రంలోని వల్లబ్‌నగర్ ఎర్రగుట్ట ప్రాంతానికి చెందిన హద్దులమ్మ, యాదయ్య అనే దంపతులు గాఢనిద్రలో ఉన్నారు.

ఈ సమయంలో వీరన్నపేటలోని లింగం హోటల్ సమీపంలో ఉన్న నిందితులు ఆటో డ్రైవర్ మహ్మద్ సలీమ్, తస్లీమ్, సమీన, సతిజాబేగం భర్త మహిమూద్ అబ్దుర్ అహ్మద్‌లు కలిసి పసి బిడ్డను కిడ్నాప్ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అనుకున్నదే తడువుగా గాఢ నిద్రలో ఉన్న తల్లిదండ్రులను గమనించి ఎవరికి అనుమానం రాకుండా రెండు నెలల పసికందును (ఆడ శిశువు) కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉదయం లేచిన పసికందు తల్లిదండ్రులు తమ పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టు పక్కల అడిగినప్పటికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.

ఈ సంఘటనపై సీఐ రాజేష్ చాకచక్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు కేసును ఛేదించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎస్పీ రెమో రాజేశ్వరీ అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు దగ్గర స్పెషల్ టీంలను నియమించారు. అంతేకాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్‌లలో టాస్క్‌ఫోర్స్ బృందాలను పంపింది. అయితే ఇదిలా ఉండగా వన్‌టౌన్ సీఐ రాజేష్ తల్లిదండ్రుల నుంచి పాప పూర్తి వివరాలను సేకరించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఆటోలతో సహా తనిఖీలు నిర్వహించారు. వీరన్నపేటలో ఎక్కువగా పోలీస్‌లను మప్టీలో ఉంచారు. ఈ నేపథ్యంలో వీరన్నపేటలోనే లింగం హోటల్ దగ్గర ఉన్న నిందితుల సమీపంలో పాప ఉన్న సంగతిని స్థానికులు పోలీసులకు చేరవేశారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించగా కిడ్నాప్ చేసింది తామేనని ఒప్పుకున్నారు. సంతానం లేని తల్లిదండ్రులకు పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నట్లు పోలీసుల ముందు అంగీకరించారు. ఈ నిందితులు తల్లిదండ్రులను ముందుగా మభ్యపెట్టి మాటల్లోకి దింపి చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాగా పోలీసులు వెల్లడించారు. నిందితులు ఈ కిడ్నాప్‌తో పాటు ఇంకా ఏమైన పసిపిల్లలను కిడ్నాప్ చేశారా లేదా అన్న కోణంలో కూడా విచారించారు.

అనంతరం నిందితులను శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రెమా రాజేశ్వరీ మీడియా ముందు ప్రవేశపెట్టి పసికందును తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. కిడ్నాప్ చేసిన ఆటో నంబర్ ఏపి 22 ఎక్స్ 8860 ఆటోతో పాటు రూ. 700 నగదును స్వాదీనం చేసుకున్నారు. కిడ్నాప్ చేసిన నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పసికందును కాపాడాడిన సీఐ రాజేష్, టాస్క్‌పోర్స్ పోలీస్ బృందాలను, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. తమ కూతురుని సురక్షితంగా నాలుగు రోజుల్లోనే కిడ్నాపర్ల చెర నుంచి కాపాడినందుకు ఎస్పీకి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, డిఎస్బీలు బి. భాస్కర్, ఇన్‌స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు.

SP who Rescued Baby from Kidnapping