Home తాజా వార్తలు ఆత్మసౌందర్యానికి మించిన అందం లేదు

ఆత్మసౌందర్యానికి మించిన అందం లేదు

Special article about Beauty

 

“ఎంత బాగా రాస్తుంది ఆమె. నా దృష్టిలో ఆమె అద్భుతమైన అందమైన స్త్రీ” “నాకయితే హెలెన్ కిల్లర్ ఈ సృష్టిలోనే అద్భుతమైన మనిషి అనుకుంటాను. చిన్న పిల్లలకోసం. ముఖ్యంగా ఎయిడ్స్ ఉన్న పిల్లల కోసం హోమ్ నడుపుతారు ఆమె. మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ది వరల్డ్‌”  “మా ఊళ్లో చల్లాయమ్మ గారున్నారోయ్. ఊళ్లో ఎవరి పెండ్లయినా సరే ఆమెనే వంట దగ్గర ఉంటారు. పెళ్లి సక్సెస్‌ఫుల్‌గా అయిపోతుంది. ఆమె నాకళ్లకి దేవతే”

ఇవన్నీ అందంగా ఉన్నవాళ్ల గురించి వచ్చిన ప్రశంసలు కాదు. వాళ్ల ప్రవర్తన, వాళ్ల వ్యక్తిత్వం, సంస్కారానికి వచ్చిన పొగడ్తలు. ప్రపంచంలో ఎందరో విజేతలు మన కళ్లకు అందంగా కనిపిస్తారని మానసిక శాస్త్ర పరిశోధకులు అంటారు. ఒక్కో రంగంలో వాళ్లు సాధించిన విజయాలు వాళ్లలో అందమై కనబడుతోంది. ప్రపంచంలో ఎన్నో రంగాలలో అందానికి సంబంధం లేకుండా ఎందరో విజేతలు కన్పిస్తారు. అందం వైపు నుంచి చూస్తే ఎంతోమంది క్రీడాకారులు, పరిశోధకులు, రచయితలకు పాస్ మార్కులు కూడా రావు. శారీరక అందం ఆకర్షణల పైన చేసిన ఒక పరిశోధనలో జీవితంలో ఒక దశ వరకే అందానికి ప్రాధాన్యత ఉందని, ఆ తరువాత వ్యక్తుల్లోని ప్రశాంతత, తృప్తి వాళ్లవల్ల సమాజానికి మానసిక ఆనందం, వాళ్ల తెలివితేటల విలువ పెరుగుతూ అందానికి సున్నా మార్కులు కూడా దక్కకుండా పోతాయని తేలింది.

అసలు అందం అంటే: ఇవ్వాల్టి రోజుల్లో అందానికున్న అర్థం తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉండటం మాత్రమే. ఇది కేవలం వ్యాపార ప్రకటనలకు, సినిమారంగం వారికి మాత్రమే వర్తిస్తుంది. అందానికి ఉద్యోగాలకు సంబంధం ఏర్పరిచింది. ఒక వస్తువును మార్కెట్ చేసేందుకు దానిలో ఉత్తమ గుణాలు ఉపయోగాలు ఉన్నాయని ప్రచారం చేసేందుకు అందం ఒక కొలమానంగా తీసుకుంటారు. అంట్లుతోమే పౌడర్, సోప్ వంటివి మార్కెట్‌లో అమ్ముడుపోవాలంటే దాన్ని ఏ విద్యాబాలన్ తెరపైన కనిపించి దాన్ని ఎలా వాడోలో, వాడితే గిన్నెలు ఎలా మెరిసిపోతాయో చెప్పాలి.

ఇందులో ఇంకో రహస్యం, వాళ్లు చక్కని నటులు కావటం తమ అమోఘమైన నటనాశక్తితో, అందంతో ఆ వస్తువు ఉపయోగం వినియోగదారుడి రక్తంలోకి ఎక్కేలా చెప్పగలుగుతారు. అందుకే ప్రతి వ్యాపార ప్రకటనలో, అది లిక్విడ్ సోప్ అయినా గడ్డం గీసుకునే బ్లేడ్ అయినా గజ్జి, తామర, దురదలకు వాడే ఆయింట్‌మెంట్ అయినా వెండితెరపైన పరిచయం అయిన తారలనే వాడుతుంటారు. ఇక పిల్లల ఉత్పత్తులైన చాక్‌లెట్స్, ఆటవస్తువులు అంశాలలో కూడా అందమైన పిల్లలే అయి ఉండాలి.

బ్యూటీ మోడల్స్: అందంపైనే ఆధారపడి జరిగే వ్యాపారంలో అందమైన మోడళ్లకే ప్రాధాన్యత. ప్రపంచంలో అత్యంత విలువైన వ్యాపారాలు దుస్తులు, కాస్మొటిక్స్, నగలు ఇతర బ్యూటీ ఉత్పత్తులవే. కోట్ల కొద్దీ లాభాలు తెచ్చిపెట్టే ఈ పరిశ్రమలకు ముఖ్యంగా ప్రచారం ఇలా అందంపైనే ఆధారపడి ఉంటుంది. సౌందర్యం అంటే ఈ కొలతల్లో ఆకర్షణీయంగా ఉంటుందనే దృక్పథం మొదలైంది. ఇదే కార్పొరేట్ రంగానికీ పాకి పోయింది. సినీరంగంలో, మోడలింగ్ రంగంలో అందం ప్రధాన విషయంగా ఉన్న అంశం ఇప్పుడు ప్రతి ఉద్యోగానికీ వర్తిస్తోంది. కంటికి నలుసుగా కనిపించే వాళ్లే రిసెప్షన్, పి.ఆర్ ఉండాలనుకుంటున్నారు. అందంపైనే ఆధారపడి మా ఎంపిక ఉండదని చెపుతూనే అందం ఉన్న వాళ్లకే ఉద్యోగాలు సులభంగా దొరుకుతున్నాయి.

ఉద్యోగాల్లో త్వరగా ఎదిగేందుకు మాటతీరు, అందం మాత్రమే ఉపయోగపడుతుందని సర్వత్రా అంగీకరిస్తున్న సత్యం. కొన్ని పరిశోధనలు అందమైన వాళ్లకే అధిక జీతాలు ఉన్నట్లు తేల్చాయి. పెట్టుబడులు ఆకట్టుకునేందుకు ప్రచారసారధిగా ఎంచుకున్న వ్యక్తులు అందంగా ఉంటే ఆ కంపెనీకి ఎక్కువ పెట్టుబడులు వస్తాయని నమ్ముతున్నారు. యద్దనపూడి సులోచనారాణి నవలా నాయకులు మళ్లీ మొదటిస్థానంలోకి వచ్చి నిలబడ్డారు. అందంగా ఉన్న వాళ్లను అందరూ భరిస్తారని వారి మాటలకు చేతలకు అవసరానికి మించి విలువ ఇస్తారని కార్పొరేట్ రంగంలో జరిగిన పరిశోధనలు స్పష్టం చేశాయి.

పెళ్లికీ అందమే: యవ్వన దశలో శారీరక ఆకర్షణకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమ వివాహాల్లోనూ అందం ఆకర్షణలే కీలకంగా ఉంటున్నాయి. కానీ కేవలం శారీరక ఆకర్షణతోనే సంసారాలు ఒడిదుడుకులు లేకుండా నడుస్తాయా అంటే అనుమానమే. కాకపోతే మొదటిసారి పరిచయంలో ఒక అభిప్రాయం ఏర్పడేది భౌతిక లక్షణాలతోనే. కన్ను, ముక్కు తీరు, చర్మం రంగు, వేసుకున్న దుస్తులు, నగలు, నడక, నడత వంటివే బలమైన ముద్ర వేస్తాయి. కానీ వ్యక్తులతో పరిచయం అయిన కొద్దీ ఈ లక్షణాలు వెనక్కుపోతాయి.

ప్రవర్తన, ఇష్టాలు, సంస్కారం, తెలివితేటలు ప్రాధాన్యంలోకి వస్తాయి. ఒకే ఇష్టాలు, అయిష్టాలు, సంస్కారం, మనుష్యుల్ని దగ్గర చేస్తాయి. అక్కడ సౌందర్యం అన్న ప్రశ్నే లేదు. సౌందర్యం అంటే రంగు, రూపం, జుట్టు పొడుగు, శరీరం తీరు కాదని అప్పుడు అర్థం అవుతుంది. నిజానికి ఈ కొలతల్లో సౌందర్యం లేదు. ఈ ప్రపంచంలో ఎన్నో రంగాల్లో పేరు గణించిన వారికి ఈ కొలతలు లేవు. వాళ్లపైన ఈ రకమైన అంచనాలు ఉండవు. ప్రపంచాన్ని ముందుకు తీసుకుని పోయే సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో పనిచేసే వాళ్ల కొలతలు, రూపు రేఖలతో ప్రపంచానికి సంబంధం లేదు.

ఒక్క సినిమా రంగం మాత్రమే: సినిమా రంగం పూర్తిగా వ్యాపారరంగం. సినిమాను మించిన కాలక్షేపం ఇవ్వాళ ఇంకోటి లేదు. గంటకొద్దీ, వేగవంతమైన జీవితంతో ఉద్యోగాలతో ఒత్తిడితో నలిగేవాళ్లు ఏ వయసువాళ్లయినా కాస్సేపు అవన్నీ మరచిపోయి సినిమా చూడాలనుకుంటారు. మనిషి జీవితంలో ఎదురయ్యే అనేకానేక ఒత్తిడులు, ఇబ్బందులు మరచిపోయి రెండుగంటలు పూర్తిగా లీనమయ్యే సినిమాకి ఆ తెరపైన అందంగా కనిపించే వేల్పులు కావాలి. అక్కడ నటించే మనుషులు చూడచక్కగా ఉంటే ఆ వ్యాపారం బాగా నడుస్తుంది. అది కేవలం నటన. జీవితం, నటన రెండూ వేర్వేరు.

జీవితంలో మనుషులు స్థిమితంగా ఉండాలి. ఎదిగేందుకు టార్గెట్స్ పెట్టుకోవాలి. చదువు, ఉద్యోగం, వ్యాపారం, జీవితం ఇవన్నీ వరస క్రమంలో నడవాలి. ఈ నడకలో చేయూతగా ఉండే మనుషుల వరసలో తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, మనతో పనిచేసే వ్యక్తులు ఉంటారు. వీళ్లలో మనం ఎప్పుడూ అందాన్ని వెతకలేం. ఎదిగే వయసులో పసివాడికి తల్లి అందంతో సంబంధం లేదు. కుటుంబాన్ని నిరంతరం కనిపెట్టుకుని ఉండే భార్యలో ప్రేమాదరణలు తప్ప అందం చూడలేడు భర్త. స్ఫూర్తిదాతలుగా ఎంచుకున్న మనుష్యులలో అందం కనిపించదు. ప్రపంచంలో ఎందరో విజేతలు మన కళ్లకు అందంగా కనిపిస్తారు. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలే వాళ్లలో సౌందర్యం. ఒక విజేతను పదిసార్లు చూశారు అంటే ఆ మనిషిలో ఉండే విజేతను మాత్రమే. అందాన్ని కాదు. అందం అంటే శరీర కొలతలు కాదు. మనసులో ఉండే ప్రేమ మనిషిలో సంస్కారం, తెలివి, సమాజాన్ని ప్రేమించే గుణం. ఇవే అందానికి మించిన అందాలు.

Special article about Beauty