Home కలం కాంచనపల్లి వాస్తవిక కవితావల్లి

కాంచనపల్లి వాస్తవిక కవితావల్లి

Special article about Kanchanapally poetry

 

శాస్త్రబద్ధత సృజనశీలత మానవీయత కలిసి పుష్పిస్తే ఎలా ఉంటుందో, కాంచనపల్లి కవిత అలా ఉంటుంది. కాంచనపల్లి లోక బాధను తన బాధగా పరితపించి ఇంకా ఎట్లయితే బాగుంటదనే వెతుకులాటలో కవిత్వం రాస్తాడు. కల ఇంకా మిగిలే ఉందిలో కవి జీరాడుతున్నది అదే. తెలంగాణ మీద పరచుకున్న అలజడులను బతుకు ఆగమవుతున్న బాధలను మొత్తంగా మనిషికి గల అనేక సంక్షోభాలను,గుండెకోతను కళ్ళకుకట్టాడు, తాత్కాలిక సంతోషం శాశ్వతం కాదని కవితా సంపుటి ద్వారా తెలియ చెప్పాడు. ‘కవిత్వం మనిషిని చేరుకోవడానికి కవి సాధనే గీటురాయి. గొప్ప సాధకునికి సహృదయులైన పాఠక విమర్శకులు అవసరం.అలా సుదీర్ఘకాలంగా కవిత్వం రాస్తున్న కాంచనపల్లి కల ఇంకా మిగిలే ఉంది అని చెప్పటానికి కలలు కనే మిత్రుల సావాసం ఉన్నది. మంచి చెడులను కష్ట నష్టాలను విశ్లేషించగల సందర్భం ఉన్నది. సుమారు 70 సంవత్సరాల తరబడి గాయాల దోనెలను తడమగల జ్ఞాపకాల నేపథ్యం ఈ కవితా సంకలనానికి ఉంది.కవి ’మళ్లీ వేటగాళ్ల కు చిక్కకుండా’కాపాడుకోవాలనే హెచ్చరికను సైతం జారీ చేసాడు. తెలంగాణలో ఇప్పుడు బాగా రాస్తున్న కవులలో అంతర్ముఖీన స్వభావం ఉన్నది.

ఇందుకు నేపథ్యం తెలంగాణ పట్ల చిన్న చూపు, మనుషులను మనుషులుగా గుర్తించకపోవటం, అణచివేత దోపిడీ పీడనలు.తరాల నుండి మలిదశ ఉద్యమ పర్యంతం నిద్ర పోనీయని ఈ భావాత్మక సంవేదనం చైతన్య కారకమైంది.ఇక్కడి కవులకు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిశీలనలు ఉన్నాయి. సాహిత్యంలో వస్తున్న క్రమ మార్పుల పట్ల బాధ్యతాయుతమైన అధ్యయనం ఉన్నది.కనుకనే అనుభవ ప్రాధాన్యత గల భావోద్వేగం పొందిన అనివార్య శైలితో కవులు బలమైన కవిత్వం రాయగలుగుతున్నారు.రచనలలోమానవీయత తోపాటు తాత్వికత ప్రధానంగా ఉంటున్నది.స్వతంత్ర వైఖరితో కవిత్వం రాస్తున్నారు. మధ్యతరగతి దుఃఖం అనుభవించిన వారుగా బడుగు వర్గాల గోస తెలిసినవారుగా ప్రవర్తించే గుణం ఉన్నది. అమ్మ తన కడుపులోని బిడ్డకు పేగుబంధంమై ఆహారం అందించినట్టు ఇక్కడి కవి ఉద్యమానికి ఆరాటాలను అనుసంధానం చేశాడు. అట్లా కాంచనపల్లి కవిత్వం ప్రయోగశీలమైంది.వాస్తవికతను దృశ్యమానం చేశాడు. ‘యుద్ధం ఇంకా మొదలు కాలేదు”అనటంలో ఆంతర్యం స్తబ్దత ఆవరించిందని అనుకుంటే పొరపాటే. యుద్ధం క్రమంగా మొదలవుతున్నదని అర్థం. యుద్ధమన్నాక ఇరుపక్షాలు స్పురిస్తాయి కానీ, ఒక సామాన్యుడు తన చుట్టూ గల అనేక వ్యతిరేక పరిస్థితులలో ఏక కాలంలో యుద్ధం చేస్తున్నాడు.

ఆ స్థితిని ఎవరు కల్పించారు?సరిగ్గా అక్కడనే యుద్ధం ప్రారంభమవుతుంది.యుద్ధం ప్రారంభం అవుతుందని చెప్పటానికి అంత మార్మికత ఉన్నది. మరొకరు ఇలా రాయలేక పోతున్నారంటే వారికి ఇంత హృదయ సంఘర్షణ లేక పోవటమే కారణమవుతుంది. అర్థం కానివి, విడమరచి లోతుపాతులు తెలుసుకునేవి, స్పష్టాస్పష్టంగా ఉన్న అనేక సమస్యలను కవిత్వం సృజన శీలంగా అభివ్యక్తి చేస్తుంది. ఈ సంకలనంలో కాంచనపల్లి శిల్పం కోసం పాకులాడుతూ భావాన్ని నష్టపరుచుకో లేదు.భాష కోసం వెతుక్కో లేదు. ఏవో అక్షరాల సమూహాన్ని అతికించే ప్రయత్నం చేయలేదు.శిల్పానికి అవసరమైన పదజాల మంతా సహజంగా అమరి పోయింది .చదవటానికి ఇబ్బంది కరంగా లేదు.కవిత్వాన్ని ప్రారంభించటం,వస్తువు లోకి ప్రవేశించటం,వేగం పుంజు కోవటంలో,ముగింపులో కాంచనపల్లి కవి అస్తిత్వమే కనిపిస్తుంది. ’అకాల దుఃఖ దిగంతాలు ’లోపలికి మింగి వాటిని ద్రవింప జేసి ఎంతో సుతారంగా వ్యక్తీకరించాడు. వినూత్న దృశ్య కోణాలను అన్వేషించాడు.ఆ భావోద్వేగం ఒక్కసారి కవి పరిధులు దాటిపోయి బిగించిన పిడికిలి కాక తప్పటం లేదు. దాశరథి అగ్నిధార కురిపించినట్టు కాంచనపల్లి అగ్ని యుద్ధం అన్నాడు.మరో పార్శ్వంలో తనను లాలించే ప్రయత్నం చేసేది కవిత్వం ఒక్కటే అన్నాడు.

ఈ కవితా సంపుటిలో గుర్తుంచుకోవడానికి వీలుగా ఉన్న ఏకపాద కావ్యాలు అనదగిన పాదాలు ఉన్నాయి అవి కల ఇంకా మిగిలే ఉంది,ఒక తలుపు తెరిచే ఉంది,ఒక కదలలేని నది, ప్రవహించే పద్యం, అర్థం కాని పద్యం, వాన కురిసిన రాత్రి మొదలైనవి. ఈ కవితా సంపుటిలో అన్ని కవితలలో ఒక ప్రవాహం చదివింప చేసే లక్షణాన్ని కలిగి ఉంది. కాంచనపల్లి కవిత్వంలో ఒక సౌకుమార్యం,మృదుల స్వభావం,సున్నితత్వం,లాలన పాలన,పలుకరింపు,ఒడుపుగా చేతిలోకి తీసుకొని అభ్యర్థించడం మాట్లాడు కునేంత సహజంగా బదిగిపోయాయి.కవి చిన్న పిల్లవాడయిపోతాడు.ఆకుపచ్చని జాబిలి అవుతాడు సజీవమైన అమ్మ -,తీరని దుఃఖమైన అమ్మ ,దిగులు సెగను చేసిన అమ్మ – అమ్మ మరణించలేదు అని చెప్పినప్పుడు, చిరాకును బతిమాలుతున్నప్పుడు, ’అర్ధరాత్రి తీగకు వేలాడుతూ బడొద్దని కలవరించినప్పుడు,ట్యూషన్ వద్దన్నప్పుడు,నవ్వుల బతుకమ్మగా నాయనమ్మ ని గుర్తు చేసుకుంటున్నప్పుడు, ’ఎక్కడికి రమ్మన్నా వస్తా /ఆ నవ్వు కోసం ’పరితపించే కవితలు హృదయాన్ని పట్టిస్తాయి.అక్షరాన్ని ప్రేమించిన వాళ్లే రాస్తారు. కాంచనపల్లి కుటుంబాన్ని,సమాజాన్ని అమితంగా ప్రేమించాడు కవిత్వాన్ని కవిత్వంగా ఇష్టపడ్డాడు.ప్రేమ దృష్టి కలిగి ఉన్నాడు కనుక రాయగలిగాడు.

కవి నిద్రాణ స్థితి నుంచి సమాజం మేల్కోవాలని కలలుకన్నాడు.మానవ పురోగతికి చిహ్నం మేల్కోనడమే కాని దౌర్భాగ్య పరిస్థితులను తలుచుకుంటూ సానుభూతిని వ్యక్తపరచటం కాదు.కాంచనపల్లి తెలంగాణ ఉద్యమ కాల సందర్భాలు తెలిసినవాడు.ఉద్యమంలో ఉన్నాడు.తెలంగాణ రోషం కలిగి పుస్తక ప్రచురణలు చేశాడు.సాహిత్య దృక్పథాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆయన అమరులను తలుచుకున్నా,రేపటి తెలంగాణ కోసం ఆరాటపడ్డా కవిత్వం ద్వారా కదిలించే తత్వాన్ని అందించాడు.తెలంగాణ స్థానీయ మూలాల నుంచి మొదలైన కవి, ఇక్కడి బాల్య జ్ఞాపకాల తడి అలలలో తేలి ఆడిన కవి తెలంగాణను ఎట్లా వదులు కుంటాడు? ఆనాడే స్వరాష్ట్రంగా నిలబడే వరకు ఈ కల చెదిరిపోదని నిరంకుశ శాసనాన్ని రాశాడు. తెలంగాణ కోసం సాహిత్యోద్యమం నడిపిన డా. నందిని సిధారెడ్డి ( తొలి సాహిత్య అకాడమీ అధ్యక్షులు) గారికి కవితా సంపుటి ని అంకిత మీయటం ఒక విశేషమైన నిబద్ధత కూడా కిటికీ వంటి కవితలు భావుకతతో ప్రారంభమై వాస్తవికతను మేళవించుకుంటాయి.ఆడపిల్ల పెళ్లి అయిన తర్వాత ఏ విధంగా మరో తీరానికి చేరి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నదో,స్త్రీ హృదయం కలిగి రాసిన కవిత ’ మరో తీరానికి…. ’తన ప్రమేయం లేకుండానే సంప్రదాయ అలలమీద విసిరిన పెళ్లి వేదిక పై తన రెండో అంకంలో చిరునవ్వునే కలిగి ఉంటుంది.లోపలి వేదనలన్నీదాచుకున్న విచిత్ర పరిస్థితులు కవి చెప్పకనే చెప్పాడు. కవిత్వానికి ఉన్న ఆ గుణం ఆలోచనలను రేకెత్తిస్తుంది.

గతకాలపు పద్యం నడకకన్నా భిన్నంగా,ఆధునిక కవిత్వంలో ఆలోచనాత్మక కవితా గమనం ఉంటున్నది.నిత్య పాఠకులు అయిన కవులు మాత్రమే కొత్తగా వస్తున్న మార్పులను టెక్నిక్స్ను ప్రయోగించగలరు .కాంచన పల్లి లో అటువంటి నవ్యత ఉన్నది.నల్ల పక్షి కవితలో ’పట్నం మనిషి తల మీద /ఎగరడమే లేదు ,అన్నాడు.ఎందుకు ఎగరటం లేదు ?నల్ల పక్షి దేనికి ప్రతీక ?ఆకాశం కురుస్తున్న సూదులకు తన రెక్కలను ఏ విధంగా పరచుకున్నది ?నల్ల పక్షి ఒంటికాలి తోఎందుకు ఉన్నది వంటి అనేక ప్రశ్నలకు పాఠకుడు సమాధానాలను చెప్పుకొవలసి వస్తుంది.ఇవన్నీ సమకాలపు పరిస్థితులతో నడుస్తూ ఉన్న పట్టింపు గలవారి ఆలోచనలకు అందుతాయి. పర్యావరణ విధ్వంసం జీవవైవిధ్యానికి మానవ మనుగడకు ఎలా విధ్వంసక కారణభూతం అవుతుందోసామాన్యులకు అర్థమైన అంతగా సంపన్నులు అర్థం కాదు. అర్ధమైనా కానట్టు గానే వ్యవహరిస్తారు.సామాన్యుడు పర్యావరణ పరిరక్షణ చేస్తాడు. పరానమరణానికి ఏ హానీ చేయడు.కవిత చదివిన తర్వాత రేపటి రోజులు కళ్ళ ముందర ఆడుతాయి.మనిషి నిర్లక్ష్యం ఎంత విషపూరితం అవుతుందో అర్థమవుతుంది .అందుకే కవి మనిషి మరుపులో నిదురపోయింది ’అని నల్ల పక్షి పై గల సానుభూతితో కదిలింప చేసాడు. ఇట్లా చూస్తూ పోతే కాంచనపల్లి వస్తువును సమగ్ర దర్శనం చేయందే ఏ కవితను రాయలేదు.వస్తువు యొక్క గుణ తత్వాలు స్వభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే భావనాత్మక దృష్టితో కవిత్వం రాశాడు అని స్పష్టమవుతుంది.

కవి తెలంగాణ పట్ల అనేక రకాలుగా మమకారం పెంచుకుని ఉన్నాడు.అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు.రేపటి ఆశల కోసం కన్నులలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు.కవితా శిల్పంలో కాంచనపల్లి తెలంగాణ సుందరి అన్నాడు.రాష్ట్ర సుందరి అన్నాడు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొత్త సంతకంగా పేర్కొన్నాడు.రేపటి ప్రజల స్వప్నంగా చెప్పాడు.దాశరధినీ కాళోజిని వేణుగోపాల్ శ్రీకాంత్ చారి యాదగిరి లను తలుచుకున్నాడు.తెలంగాణలో జరిగినవి ఆత్మహత్యలు కావు అవన్నీ శత్రు హత్యలే అని ఆక్రోశించాడు.బతుకు వీణ తీగ తెగిపోయి రెండు కొండలు దిక్కులేని పిట్టల్లా బిక్కుమన్న సుదీర్ఘ ముళ్ళ ప్రయాణం మజిలీలను కవితాత్మ చేశాడు.బతుకమ్మ ఆడితే బోనాల ఎత్తితే అనాగరికమని ఆత్మన్యూనతకు గురిచేసిన వలస పెత్తందార్ల అపహాస్యాన్ని కవి కలకు ఆటంకంగా పరిగణ మించిన అవరోధాలను అడుగడుగునా అచ్చు కట్టాడు.ఆ దశ ఆత్మగౌరవ పతాకాన్ని ఎత్తుకొని పరిపరివిధాల కలవరించాడు.బతుకమ్మను శాశ్వతంగా మా లో బతుకమ్మ అని వేడుకున్నాడు.కలలు కంటూ ఆలోచనలు చేస్తూ నిర్విరామ మైన కవితా చింతన చేస్తూ ఆ ధారా ప్రవాహం లో కవితఅంతః చేతనను వెల్లడించాడు.

వ్యవస్థ అసమానతలు అభివృద్ధికి ఆటంకాలుగా వాటిని ధిక్కార స్వరంతో ఎదుర్కొన్నాడు కవిత్వం నిత్య చైతన్య వంతమైనది. నిత్య నూతనమైంది.అట్లా కొత్తదనాన్ని అందించే రచనలు మాత్రమే పదికాలాలపాటు నిలుస్తాయి. కాంచనపల్లి గోవర్ధన రాజు రాసిన ఈ కవితా సంపుటిలో గల తెలంగాణ చారిత్రక పరిణామాలు ప్రజల హృదయ స్పందనలు – సమాజం ఆత్మిక బంధాలు చెదిరిపోని సంతకాలు. అస్తిత్వ చైతన్యంగా ప్రారంభమైనా తెలంగాణ ఉద్యమం గొప్ప సత్యాలను ఆవిష్కరించింది.ఆధునిక కవిత్వానికి ఉద్యమాలకు కొత్త అర్థ నిర్వచనాలను ఇచ్చింది.వ్యవస్థను బట్టి చైతన్యం అనివార్యమవుతుంది.చైతన్యవంతమైన సమాజం శక్తివంతమైంది.అది వ్యవస్థ తీరుతెన్నులను ప్రశ్నిస్తుంది.వ్యవస్థలను మార్చేస్తుంది.వ్యవస్థ మార్పుకు కవులు రచయితలు కళాకారులు మూలస్తంభాలు వంటి వారు.తెలంగాణ ఉద్యమంలో కలం మిత్రుల పాత్ర గొప్పది.అటువంటి కీలక దశలో ఎందరో కవులు రచయితలు కళాకారులు పనిచేశారు.ఆ క్రమంలో రాసిన కవితలు రాష్ట్ర సాధన అనంతరం రాసిన కవితలు అన్నీ కలిపిన ఆరాటం ‘కల ఇంకా మిగిలే ఉంది’. విభిన్నమైన వ్యక్తీకరణ కవి హృదయం కోసం చదివి తీరవలసిన కవితలు.

(అక్టోబర్ 29 న కాంచనపల్లి గోవర్ధన రాజు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని స్వేకరిస్తున్న సందర్భంగా)

Special article about Kanchanapally poetry