Home తాజా వార్తలు అదొక చీకటి నీడ

అదొక చీకటి నీడ

Loneliness

 

“ఇదేంటి పద్మా ఇలాగైపోయావు? ఇంత సన్నగా నీరసంగా, ఒంట్లో బావుందా?”
“ బావుంది… అందరూ ఇదే అంటుంటే చెకప్‌కు కూడా వెళ్లాను. ఎక్కడా ప్రాబ్లమ్ లేదు.”
“ మరెందుకిలా? ఏవైనా తింటున్నావా? పిల్లలెలా ఉన్నారు. బాగా సెటిలయ్యారటనా?”
“ఆ ఇద్దరూ హాయిగా ఉన్నారు. పెద్దవాడు ఢిల్లీలో జాబ్. చిన్నది యూ.ఎస్.లో అక్కడే జాబ్ కూడా వచ్చేస్తుంది. ఇంటర్వూలు పూర్తి అయ్యాయి. ”

‘నీ తిండి’
“ ఆ ఏం తిండిలే’ తినాలనిపించదు. ఎవరికోసం వండాలి? ఆయనకు ఆఫీసులోనే ఫుడ్ అంతా ఇచ్చేస్తారు. ఇంట్లో టిఫెన్ కూడా అక్కర్లేదు నా ఒక్కదాని కోసం ఏం చేసుకోవాలి.”
“ ఇదేం చీరె… ఏం బాగాలేదు. ఎంత ఫ్యాషన్‌గా ఉండేదానివి. మాచింగ్ లేకపోతే కట్టేదానివి కాదు…”
“ ఏమోలే ..అయిపోయిందిగా… ఏదైనా చెప్పువింటాను. నాదేముంది అంతా పూర్తిచేశాను. ఎవరి పాటికి వాళ్లు సెటిలయ్యారు.

నా అవసరం ఇప్పుడు ఎవరికీ ఏమీ లేదు”
‘ ఏంటీ పూర్తిగా మంచం ఎక్కారు.. ఏంటి అనారోగ్యం?
ఏమీ లేదురా బాబూ… ఒక్కడ్నే కదా! మీ పిన్ని అమెరికాలో. నేను అక్కడ ఉండలేను. ఇక్కడా ఉండలేను. చేసే పనులు ఏవీ లేవు. ఏదో నడిచి పోతుంది’
‘సరిగ్గా తింటల్లేదా?, ఏం తిండి లేదా బాబూ’
“వంటామె వండి పోతుంది అన్నీ. నాకే తినాలనిపించదు. ఎవ్వళ్లు మాట్లాడేందుకు లేక విసుగు”

“మా జానూ గురించి చాలా దిగులుగా ఉందోయ్. ఏంటో మూడీగా ఉంటుంది. ఇంట్లో గొడవలు తెలుసుగా. నాకూ మూర్తికీ పడదు. పెళ్లి చేసుకున్నాం కనుక కలిసి ఉంటాం. పిల్లలున్నారు కనుక భరిస్తున్నాం. కానీ మా మధ్య సయోధ్య ఏముందీ. ఈ జానూ ఇవన్నీ పట్టించుకుంటుందోయ్. నీకెందుకు అంటే వినదు. ఫ్రెండ్స్‌తో కలవదు. ఒక సినిమా, షికారు లేదు. ఎప్పుడూ లోన్లీగా ఉంటుంది.
ఏ అనారోగ్యమో చేస్తుందని భయంగా ఉంది.”

ఇలాంటి వందల విషయాలు వింటూ ఉన్నాం. ఇరవైల్లో ఉన్నా, అరవై దాటినా, ఎంతో బాధ్యతగా కుటుంబాలు నడిపినా చాలా మందికి ఒంటరి తనమే పెద్ద శిక్ష. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. కొన్ని శారీరకమైన నొప్పులకు కారణం కూడా ఒంటరితనం వల్ల మనసుకి కలిగే ఇబ్బందితో వచ్చే అనారోగ్యాలు మాత్రమే. సమస్య శరీరానిది కాదు మనస్సుది. ఎంతోమందికి వైద్య పరీక్షల్లో ఎక్కడా అనారోగ్యం కనిపించదు. వైద్యానికి అందని సమస్య మనస్సులో ఉంటుంది. నూటికి 50 మందిని వేధించే సమస్య కేవలం ఒంటరితనం.

అందరి సమస్య:
ఈతరం యువతకు అందిన వరం, శాపం కూడా ఫోన్లు. సోషల్ మీడియా వాట్సప్, ఫేస్‌బుక్‌లు ప్రతివాళ్లకు ఒక ప్రత్యేకమైన లోకం. అందులో మాటలకు చోటులేదు. కొత్తవాళ్లు, బంధువులు, స్నేహితులు ఉండరు. ఎవరికి వారుగా సృష్టించుకున్న లోకంలో పెరిగి పెద్దయి, ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినా వెంటాడే మానసికవేదన ఒంటరితనం. మనుషుల స్పర్శ, మాట, స్నేహం లేకపోవటం మనల్ని మనం ప్రపంచానికి దూరం చేసుకోవటం వల్ల తెచ్చిపెట్టుకున్న కష్టం. అలాగే వయస్సు మళ్లిన వాళ్లలో బాధతలు తీరిపోయాక, పిల్లలు ఎవరి జీవితం వాళ్లు అమర్చుకున్నాక, ప్రాప్తించే ఒంటరితనానికి ముందుగా తయారుగా లేకపోవడం మొదటి చివరి సమస్య. కొంతమందికి స్నేహం చేసుకోవడం రాదు. ప్రతివాళ్లలో బలహీనతలుంటాయి. ఇవన్నీ పక్కనబెట్టి స్నేహంగా ఉండాలని తేల్చుకోకపోవటం ఇబ్బంది. ఇక స్త్రీలలో అయితే పెళ్లయిన దగ్గర నుంచి, పిల్లలు, వాళ్ల పెంపకంలోనే జీవితాన్ని ముడిపెట్టుకుని, వాళ్లకంటూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన జీవితం లేకపోవటం ముఖ్య సమస్య. పిల్లలు ఎవరి జీవితంలో వాళ్లు స్థిరపడ్డాక అప్పుడు మెల్లగా కమ్ముకుంటుంది ఒంటరితనం.

అనారోగ్య హేతువు: ఒంటరితనం శారీరక మానసిక సమస్యలకు కారణం అవుతోంది. శరీరంలో కలిగే ఒత్తిడి ప్రమాకరమైన హార్మోన్‌లను విడుదల చేస్తుంది. ఫలితంగా నిద్రపట్టక పోవడం, ఆకలిలేకపోవటం, మనసులో నెగిటివ్ ఆలోచనలు, డిప్రెషన్ మొదలవుతోంది. కాకపోతే ఇదేమీ పరిష్కరించుకోలేని సమస్య మాత్రం కాదు. నేను ఇందులోంచి బయటపడాలని కోరికతో మానసిక దృఢత్వం తెచ్చుకోవాలి. ముందుగా ఆత్మవిమర్శ కావాలి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? నేనెందుకిలా అయిపోతున్నాను? ఎందుకు భోజనం చేయను? ఎందుకు నిద్రపోను? ఎందుకు నాపట్ల నేను నిర్లక్షంగా ఉన్నాను. నా చుట్టూ ఇన్ని గొడవలో ఎందుకు ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు, బంధువులు ఎందుకు దూరంగా ఉన్నారు? నా వల్ల పొరపాటు జరిగిందా? వాళ్లే అనవసరంగా దూరంగా ఉన్నారా? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కొద్ది ప్రశ్నలకు సమాధానం వెతికితే సమస్య మూలాలు తెలుస్తాయి.

మారాల్సింది మనమే: ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికితే మనకు తెలిసిపోతుంది. తప్పు మనదే. స్నేహాలు, బంధుత్వాలు పక్కన పెట్టాం. కుటుంబం కోసం 24 గంటలు శ్రమపడుతూ మన గురించి మనం మరచి పోయాం. ఇంట్లో సభ్యులందరికీ ఎవరి జీవితం వాళ్లకుంది. ఎవరి లక్ష్యాలు, ఆశలు ఆశయాలు వాళ్లవే. మరి మన లక్షం ఏమిటి? బాధ్యతలు పూర్తి చేసుకున్నాక ఒక్క పని పూర్తయ్యాక ఏర్పడే ఖాళీని పూర్తి చేసేందుకు మనం ఎంచుకున్న జీవిత విధానం ఏమిటి? ఎప్పటిలాగా ఇల్లు, శుభ్రతా, నాలుగు పూల మొక్కలు, పెట్స్, కుటుంబ సభ్యలు, పెద్దవాళ్లు వీళ్లందరూ సరే…

ఆ పనులతో పాటు మన మనసుకి సంతోషం కలిగించే విషయాలను తెలుసుకోవాలి. మనకు నచ్చే పనికోసం ఒక గంట కేటాయించుకోవాలి. పుస్తకాలు, స్నేహితులు, సంఘసేవ, దైవారాధన ఏదైనా మనసుకి తృప్తి కలిగించే ఒక పని కావాలి. దృఢమైన మనస్సుతో ఆలోచించాలి. శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్‌లు, ముఖ్యంగా సెరటోనిక్ అనే హార్మోన్ శరీరంలో తగినట్లుగా ఉంటే ఆనందంగా ఉంటాం.

చక్కగా సూర్య కాంతిలో పచ్చని ప్రకృతిలో కాసేపు గడపాలి. మంచి సంగీతం వినాలి. ఇష్టం వచ్చిన పనులు చేయాలి. జీవితం పూర్తిగా మనది. మనల్ని మనం సంతోష పెట్టుకోకపోతే ఇంకెవరూ ఆ పని చేయలేదు. సంతోషం కూడా మనసుకి సంబంధించింది. ఒంటరితనం ఒక చీకటి నీడ. దాన్లోంచి ఒక్క అడుగు వేసి వెలుగులోకి రావడటం చేస్తే చాలు చుట్టూ మనుషులు, ప్రేమ, సంతోషం… మనం సృష్టించు కోవలసిన ప్రపంచం ఎదురుగ్గానే ఉంది.

Special Article about Loneliness