Home ఎడిటోరియల్ దళిత సంక్షేమానికి దిక్సూచి..

దళిత సంక్షేమానికి దిక్సూచి..

Special article about scheduled caste welfare in india

 

భారతీయ సమాజంలో ‘కులం’ అనేది కాదనలేని, తీసివేయలేని చారిత్రక సత్యం. వ్యవసాయం చుట్టూ ఉత్పత్తి సంబంధాలు గూడల్లుకున్న వృత్తుల సమాజం క్రమక్రమంగా కుల సమాజంగా రూపుదిద్దుకున్నది. గూడు కొట్టి నీటిని పారించే ప్రాథమిక దశ నుంచి మోట బొక్కెనకు తొండం’ అమర్చడం ద్వారా వ్యవసాయం, సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకున్నది. ఈ దేశంలో వేల సంవత్సరాలు మనిషిని మించి పశువు వ్యవసాయం చేసింది. అన్ని సంపదలను మించి పశు సంపదే విలువయినదిగా పరిణించబడింది. మనిషితో పాటు పశువుల పుట్టుకకు మాత్రమే సభ్య సమాజం బాధ్యత వహించింది. పుట్టుక, పురుడు సంస్కారానికే బాధ్యత వహించిన సభ్యసమాజం, చావు దహన సంస్కారాన్ని మాత్రం దళిత సమాజానికే అప్పగించింది. ‘తాను నిప్పులో నిప్పయ్యి… బూడిదలో బూడిదయ్యి, మట్టిలో మట్టి గా మారి’.. ఇటు మనిషిని, అటు పశువుల దహనసంస్కార బాధ్యతలను మోస్తూ సమాజాన్ని నిరంతరం పరిశుభ్రంగా వుంచుతూ, మానవ జాతికి పరిశుభ్రత నేర్పింది, దళితజాతిగా పిలువబడుతున్న వొక త్యాగాల మానవసమాజం వేల సంవత్సరాలుగా అంటరాని పేరుతోని వూరుకు దూరంగా వుంచడం దారుణం.

ఇదే విషయాన్ని ‘ఎవరు పెట్టిండ్రో ఏ పుణ్మాత్ముడు పెట్టిండో గాని మనలోనే వొక సమాజాన్ని అంటరానివారని దళితులని ఊరుకు దూరం గా పెట్టడం దుర్మార్గం. ఎస్‌సి కులాలపై దారుణమైన వివక్ష అమలు పరచబడుతుండటం సిగ్గుపడాల్సిన విషయం. ఈ రకమైన చారిత్రక తప్పిదాన్ని ఇకనైనా సవరించాలని” ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనేక సార్లు స్పష్టం చేశారు. ‘వాని సేవకు భరతావని అప్పుపడ్డది’ అంటారు మహాకవి గుర్రం జాషువా. తాము సమిధలై మానవ సమాజ పురోగతికి పునాదిరాల్లైన దళితజాతి బిడ్డలకు ఎంత చేసినా తక్కువే..ననే భావనతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు అనేక పథకాలను దళితజనోద్ధ్దరణ కోసం అమలు చేస్తున్నది. ఇతర సమాజానికి కేవలం ఆర్థిక వివక్ష మాత్రమే వున్నది.. కానీ దళిత సమాజానికి ఆర్థిక వివక్షతో పాటు సామాజిక వివక్ష అదనంగా వున్నద”నే ఎరుకతో దార్శనిక ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధువుగా మారిండు. ఈ క్రమంలో ఎస్‌సి కులాల అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, విడుదల చేస్తున్న నిధుల విషయాన్ని పరిశీలిస్తే… దళిత సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పవచ్చు.

ఎస్‌సిల విద్యాభ్యున్నతికై..
ఎస్‌సి స్పెషల్ డెవెలప్‌మెంట్ ఫండ్ చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం చేసే పద్దులో 15.45 శాతం నిధులను ఎస్‌సిలకు కేటాయించింది. 2014-15 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 56,110.77 కోట్లు ఖర్చు చేసింది. బిఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో చదివే ఎస్‌సి విద్యార్థులకు తొలుత రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించింది. ప్రస్తుతం ఈ ఆర్ధిక సాయాన్ని రూ.20 లక్షల వరకు పెంచింది. ఓవర్సీస్ స్కాలర్ షిప్ పొందడానికి వార్షికాదాయ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. 2014-15 నుంచి 735 మంది ఎస్‌సి విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశంపొందారు. వీరి కోసం ప్రభుత్వం రూ.113. 93 కోట్లు ఖర్చు చేసింది. నాడు ఎస్‌సి గురుకులాలు 134 మాత్రమే ఉండగా, నేడు 268కి ప్రభుత్వం పెంచింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఎస్‌సి మహిళల కోసం 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు స్థాపించింది. వీటిలో 17,014 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఎస్‌సి గురుకుల విద్యాలయాల కోసం ప్రభుత్వం రూ. 4,884 కోట్లు ఖర్చు చేసి, గత ఏడేండ్లలో 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు 17,58,250 మంది ఎస్‌సి విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ప్రభుత్వం రూ. 3,075.91 కోట్లు ఖర్చు చేసింది. పాఠశాలల్లో డ్రాపౌట్స్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి మొత్తం 4,85,603 మంది విద్యార్థులకు ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద రూ. 280.52 కోట్లు ఖర్చు చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో స్కాలర్‌షిప్ గ్రాంటును ప్రభుత్వం రూ. 20 వేల నుంచి రూ.30 వేలకు పెంచింది. రాష్ట్రంలోని ఎస్‌సి విద్యార్థుల కోసం ప్రభుత్వం 669 ప్రి మెట్రిక్, 204 పోస్ట్ మెట్రిక్… మొత్తంగా 873 వసతి గృహాలను నిర్వహిస్తూ ఎస్‌సిల విద్యాభివృద్ధికై కృషి చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 5,05,587 మంది విద్యార్థులు ప్రభుత్వవసతి గృహాల్లో ఆశ్రయం పొందారు. వీరి కోసం రూ.1751.04 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. వివిధ దశల్లో డైట్ చార్జీలను గణనీయంగా పెంచడం జరిగింది. అన్ని ఎస్‌సి వసతి గృహాల్లో, గురుకులాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు కేవలం ఒకటే ఎస్‌సి స్టడీసర్కిల్ ఉండేది. స్వరాష్ట్రంలో ప్రభుత్వం స్టడీ సర్కిళ్ల సంఖ్యను 11 వరకు పెంచింది. ఎస్‌సి స్టడీ సర్కిళ్ల ద్వారా 12 మంది సివిల్ సర్వీసులకు, 1,196 మంది వివిధ పోటీ పరీక్షల్లో ఎంపికయ్యారు.

ఎస్‌సిల ఆర్థిక స్వావలంబనకై..
ఎస్‌సిల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారు. 2014 నుంచి నేటి వరకు ప్రభుత్వం రూ.760.22 కోట్లు ఖర్చు చేసి, 6,929 ఎసిస్ కుటుంబాలకు 16,972.35 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చింది. రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 101 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు 16.36 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వం రూ. 247.90 కోట్లు ఖర్చు చేసింది. ఎకనామిక్ సపోర్ట్ స్కీం కింద రూ. లక్ష నుంచి రూ.12 లక్షల వరకు వివిధ రంగాల్లో 1,56,100 మంది ఎస్‌సిలకు ప్రభుత్వం ఆర్ధిక చేయూతను అందించింది. దీనికై 2014-15 నుంచి 2020-21 వరకు ప్రభుత్వం రూ. 1947.03 కోట్లు ఖర్చు చేసింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్ల పెళ్లికి రూ.1,00,116/- చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. 2014 నుంచి నేటి వరకు 1,85,002 ఎస్‌సి కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ రూ. 1443.35 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

‘దళిత బంధు’ పథకం..
దళిత బంధు పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించే ప్రక్రియను ప్రారంభించింది. తొలిదశలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, రాష్ట్రంలోని 4 ఇతర మండలాల్లో సంతృప్తస్థాయిలో దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నది. దళిత బంధు పథకం కోసం 2021-22 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,000 కోట్లు నిధులు కేటాయించగా, 2021 సెప్టెంబర్ వరకు రూ. 2,007.60 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. సమాజం ఒక గుణాత్మక పరివర్తనలోకి పురోగమించేందుకు కావాల్సిన సామాజిక చైతన్యాన్ని ‘దళిత బంధు’ రగిలించాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. దళిత బంధు పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దళిత బంధు కమిటీలు ఏర్పాటు చేయనున్నది. ఈ కమిటీలు లబ్ధిదారులకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి నడుమ వారధిగా పనిచేస్తూ, ఎప్పటికప్పుడు తగు సూచనలిస్తూ పథకం విజయవంతంగా అమలు కావడానికి దోహదపడుతాయి.

సిఎం కెసిఆర్ ప్రభుత్వం అంకితభావంతో, చిత్తశుద్ధితో ఎస్‌సి కులాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను అనుభవజ్జులైన, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు రాజకీయాలకతీతంగా సామాన్యుల చెంతకు చేరేందుకు మరింతగా తోడ్పాటును అందించవలసిన సమయమిది. లబ్ధిదారుల్లో తగిన అవగాహనను కల్పిస్తూ, ఆర్థికంగా స్థిరపడాలనే పట్టుదలను వారిలో పెంపొందింప చేసే కర్తవ్య బాధ్యతను బుద్ధిజీవులు కలిగి ఉండాలి. పథకాల అమలు తీరును, సాధిస్తున్న విజయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ సిఎం కెసిఆర్ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. క్షేత్రస్థాయి అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటూ, నూతన పద్ధతులను స్వీకరిస్తూ సిఎం కెసిఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సృజనాత్మక పథకాలను దేశవ్యాప్తమై కేంద్రం, ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తుండటం తెలంగాణకే కాదు దేశానికే గర్వకారణం.

Special article about scheduled caste welfare in india