Home Default ప్రేమ, సహనంతో ఏమైనా సాధించొచ్చు

ప్రేమ, సహనంతో ఏమైనా సాధించొచ్చు

MRS India Telangana Suman Saraf

 

కష్టాలను తల్చుకుని కుంగిపోయేవారు కొందరైతే…ఆ కష్టాలనే వారి విజయానికి మార్గాలుగా చేసుకునేవారు మరికొందరు. బాధలను తల్చుకుంటూ ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కన్నా, ఆ బాధల్ని సవాల్‌గా స్వీకరించి సమాజానికి ఉపయోగపడే వారుంటారు. అటువంటివారిలో డాక్టర్. సుమన్ సరఫ్ ఒకరు. చిన్నతనంలో తన కుమారుడు ఆటిజం బారిన పడితే, కుంగిపోకుండా తానే వైద్యురాలిగా మారి అతడిని ఒక మామూలు వ్యక్తిగా మార్చింది. సమాజ సేవను బాధ్యతగా స్వీకరించింది. ఆటిజం బారిన పడిన పిల్లల తల్లిదండ్రుల మానసిక పరిస్థితి తాను అనుభవించింది కాబట్టి, వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది. అనేక అవార్డులను పొందింది. అదేవిధంగా మిసెస్ ఇండియా తెలంగాణ పోటీలో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా గెలిచింది. అందం అభినయంతోపాటు మంచి మనసున్న మనిషిగా, వైద్యురాలిగా పదిమందిచేత ప్రశంసలు అందుకుంటున్న సుమన్ సరఫ్‌తో సకుటుంబం మాటాముచ్చట..

చిన్నప్పటి నుంచి నాకు సోషల్ సర్వీస్ చేయడం ఇష్టం. బీహార్‌లో పుట్టాను. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేదాన్ని. డాక్టర్ కావాలన్నది నా కల. ఈలోగా పెళ్లయింది. మా అబ్బాయి మాధవ్ తొమ్మిది నెలల వయసప్పుడు తలకి దెబ్బ తగిలింది. వైద్యుల ద్వారా మాధవ్‌కి మూర్ఛ, ఆటిజంలాంటివి ఉన్నట్లు తెలిసింది. ఎంతో మంది వైద్యులకు చూపించాం. కానీ ఫలితం కనిపించలేదు. మందుల సైడ్‌ఎఫెక్ట్ కూడా ఉండేది. దాంతో బాబు చాలా బాధపడ్డాడు. హైపర్‌యాక్టివ్‌గా మారాడు. ఈ సమస్యను నేను మాత్రమే పరిష్కరించగలనని అనిపించింది. దీంతో ఆగిపోయిన నా చదువును కొనసాగించాను. వెంటనే ఫిజియోథెరపీలో కోర్సు చేశాను. మెడికల్ ఎంట్రన్స్ కూడా రాశాను. తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్, బిహేవియర్ థెరపీ, ఒకేషనల్ ట్రెయినింగ్ లాంటి కోర్సులను చేశాను. హీలింగ్స్ నేర్చుకున్నాను. ఎమ్‌ఆర్ పిల్లలకు సంబంధించిన ప్రత్యేక విద్యను అభ్యసించాను. ISSA (ఇండియన్ స్కేల్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం) బీమెర్ థెరపి చేశాను. క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాను.

ఇంకా రీకీ, డౌనింగ్, ధ్యానం, క్రిస్టల్ వైద్యంలో శిక్షణ పొందాను. వీటన్నింటితో నా కొడుకుని మామూలు మనిషిని చేయగలిగాను. ఆటిస్టిక్ పిల్లల కోసం, వారి సంక్షేమం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ఆ లక్షంతోనే సుమన్ ఆటిజం సెంటర్‌ను నడుపుతున్నాను. ఇక్కడ బుద్ధిమాంద్యం పిల్లలకు శిక్షణతోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాను. ప్రస్తుతం పాఠశాలలో 40 మంది విద్యార్థులు, 4గురు ప్రత్యేక బోధకులు ఉన్నారు. ఆటిజం అ నేది జబ్బు కాదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు సమస్యను పరిష్కరించొచ్చు.

నా సేవను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 5, 2018న “బెస్ట్ ఇండివిడ్యుయల్ వర్కింగ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డిసెబిలిటీ అవార్డు”ను ఇచ్చి సత్కరించింది. అదేవిధంగా “బిమర్ స్టార్ అవార్డు” అదే ఏడాది అందుకున్నాను. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయురాల్ని నేనే.

బుద్ధిమాంద్యంగల పిల్లలు సాధారణ పిల్లల కంటే భిన్నమైన భావోద్వేగాలను కలిగిఉంటారు. తొందరగా కొత్త ప్రదేశంలో, కొత్తవారితో కలవలేరు. వారికి చాలా ప్రేమ కావాల్సి ఉంటుంది. మందులతో చికిత్స చేయలేం. ప్రేమ, సహనాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు.

తల్లిదండ్రులు ఎప్పుడూ మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అనుకూల భావాలు కలిగి పిల్లల కోసం ప్లాన్ చేయాలి.పిల్లల్ని కనే తల్లులు కాలుష్యరహిత వాతావరణంలో జీవించాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. సేంద్రియ ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇవన్నీ పాటిస్తే మంచి బిడ్డను పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకోవడానికి పేరెంట్స్‌కి చాలా ఓర్పు అవసరం. ప్రేమతో ఏమైనా సాధించగలం. నా విజయానికి సూత్రం ఇదే. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా ఆటిజం బిడ్డలను కలిగి ఉన్న తల్లిదండ్రులు నన్ను తప్పకుండా కలవొచ్చు. వారికి ఆ బిడ్డలతో ఎలా మెసలుకోవాలో అవగాహన కల్పించి, వారికి మనోధైర్యాన్ని అందిస్తాను. sumansaraf76@gmail.comలో నన్ను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని ఎక్కువ శాతం మంది ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.

మిసెస్ ఇండియా తెలంగాణ పోటీలో నా మిత్రుల ప్రోత్సాహంతో పాల్గొన్నాను. దీంట్లో క్లాసిక్ కేటగిరీలో గెలిచాను. నా థీమ్ ఆటిజమ్ గురించి. తల్లిదండ్రులతోపాటు సమాజానికి అవగాహన కల్పించడం నా లక్షంగా చెప్పాను. పోటీ కోసం మూడు నెలలు కష్టపడ్డాను. జిమ్‌కి వెళ్లాను. డైట్ పాటించాను. అందం మాత్రమే కాకుండా సమాజం కోసం, కుటుంబం కోసం కష్టపడుతున్నవారిని ఎంపిక చేశారు. దాదాపు 53 మందికిపైగా మహిళలు పాల్గొన్న మిసెస్ ఇండియా తెలంగాణ పోటీలో సెకండ్ రన్నరప్‌గా గెలవడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో మమతా త్రివేదీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగింది. ఇందులో వ్యాపారవేత్తలు, సామాజిక వేత్తలు, గృహిణులు, వైద్యులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ నెల 2న జరిగిన మిసెస్ ఇండియా తెలంగాణ 2019 గ్రాండ్ ఫినాలే పోటీని లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు.

ఈ పోటీలో జడ్జిలు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫుట్‌బాల్ టీం కెప్టెన్ లేదా పిఎమ్ వీటిలో ఏది కావాలనుకుంటున్నారు అని అడిగాను. నేనైతే పిఎమ్ కావాలని సమాధానమిచ్చాను. ఎందుకంటే ఆ స్థానంలో ఎన్నో మంచి పనులు చేయొచ్చని చెప్పాను. ముఖ్యంగా బుద్ధిమాంద్యంగల పిల్లల కోసం మరింత పాటుపడవచ్చని నా ఆశ.

                                                                                                                             – మల్లీశ్వరి వారణాసి
special interview with MRS India Telangana Suman Saraf