Home జాతీయ వార్తలు ఇక అక్కడ కేంద్రానిదే పెత్తనమంతా!

ఇక అక్కడ కేంద్రానిదే పెత్తనమంతా!

Jammu and Kashmirన్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులో రాజ్యాంగంలోని 370వ అధికరణను, 35ఎ అధికరణను రద్దు చేయడం వల్ల జరగబోయే పరిణామాలు ఇవే…
*సంబంధిత బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత జమ్మూ కశ్మీరు అసెంబ్లీ గల కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవిస్తుంది. ఇది ఢిల్లీ, పుదుచ్చేరి ప్రభుత్వాల తరహాలో పాలనను అందచేస్తుంది.
*జమ్మూ కశ్మీరులో ప్రస్తుతం అంతర్భాగంగా ఉన్న లడఖ్ కూడా మరో కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరిస్తుంది. దీనికి శాసనసభ ఉండదు.
*యూటీగా అవతరించనున్న జమ్మూ కశ్మీరుకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రధాన పాలనాధికారిగా వ్యవహరిస్తారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఆయన పనిచేస్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై లెఫ్టినెంట్ గవర్నర్ పెత్తనం అధికంగా ఉండగలదు.
*జమ్మూ కశ్మీరులో ఏర్పడే ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వ తరహాలో భూమి లేదా పోలీసులపై ఎటువంటి అధికారాలు ఉండవు.
*జమ్మూ కశ్మీరు, లడఖ్‌లో ఇక స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, హక్కు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు లభిస్తుంది.
*ఇప్పటి వరకు జమ్మూ కశ్మీరులోని శాశ్వత నివాసులకు మాత్రమే స్థిరాస్తులను కొనుగోలు చేసే హక్కు ఉంది. శాశ్వత నివాసులు ఎవరన్నది నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అయితే సోమవారం రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 35ఎ రద్దు కావడంతో ఈ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది.
*లడక్‌లో ఇక అసెంబ్లీ ఎన్నికలు జరగవు. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే అక్కడి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలరు.
*లడఖ్‌కు ఇక జమ్మూ కశ్మీరుతో ఎటువంటి సంబంధాలు ఉండవు. దాని అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటుంది.
*లడఖ్‌లోని రెండు జిల్లాలు లేహ్, కార్గిల్ ప్రస్తుతం అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిళ్ల అధీనంలో స్వతంత్ర పాలనను కొనసాగిస్తున్నాయి. వీటిని వాటి అధీనంలోనే ఉంచే అవకాశం ఉంది.

 Special Status gone to Jammu and Kashmir