Home ఎడిటోరియల్ కామధేనువు కాళేశ్వరం

కామధేనువు కాళేశ్వరం

kaleshwaram project

 

ఆధునిక దేవాలయం లాంటి ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల జీవితాల్లో సంపద్వంతమైన వెలుగులను నింపబోతున్నది. పార్వతీ మాత మట్టి ముద్దను బొమ్మగా మలిచి ప్రాణం పోసి గణేషుడిని తయారు చేసినంత ఇష్టంగా, ప్రేమగా తన మేధస్సును రంగరించి ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు తెలంగాణ ప్రగతి రథసారథి, ముఖ్యమంత్రి కెసిఆర్. తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఇక్కడి రైతుల సాగు నీటి అవసరాల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఏకైక నాయకుడు సిఎం కెసిఆర్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని వేల గంటలు సాగు నీటి ప్రాజెక్టుల మీద ఆయన సమీక్షలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు అధికారులతో సమీక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నయి.

40 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేని పనిని ఆయన కొన్ని మాసాల్లోనే చేసి చూపించి తన మంచితనంతో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని మూడేళ్ళలోనే ప్రాజెక్టును ప్రారంభించి చరిత్ర సృష్టించారు గులాబీ ప్రభుత్వ రథసారథి కెసిఆర్. ఒక సాగు నీటి ప్రాజెక్టు కట్టడమంటే 10-20 ఏళ్ళు సమయం తీసుకోవడం గత పాలకుల చరిత్ర. అయితే సంకల్ప బలం ఉంటే కాళేశ్వరం లాంటి భారీ సాగు నీటి ప్రాజెక్టును అద్భుతంగా, వేగంగా నిర్మించవచ్చని నిరూపించారు సిఎం కెసిఆర్. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కనీస అవగాహన లేని వాళ్ళు చేస్తున్న విమర్శలను చూస్తే కాస్త జాలి కలుగుతున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ చరిత్ర కెసిఆర్‌కు ముందు, కెసిఆర్ తర్వాత అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో ఆయన ప్రాణం పోసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకుంటాము.

45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం సహా 80 శాతం తెలంగాణ ప్రజలకు తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడే నీటిని అందించే విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడబోతున్నది. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా రైతుల జీవితాల్లో వెలుతురు నింపబోతున్నది ఈ ప్రాజెక్టు. కొన్ని వేల కోట్ల విలువైన పంట పండించబోతున్నది. వివిధ రకాల ఆహార, వాణిజ్య పంటల సాగుతో రైతుల కష్టాలు తీర్చడమే కాకుండా వాళ్ళ జీవితాల్లో సంతోషం నింపనున్నది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సుమారు కోటి కుటుంబాలు ఉంటే అందులో 58 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నయి. మెజారిటీ కుటుంబాలు సాగు నీటి సౌకర్యంతో ఒడ్డున పడనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో విభిన్న రకాల వాణిజ్య పంటలను సాగు చేయడంపై రైతులు దృష్టి పెడితే అప్పుల కష్టాలు పోగా ముఖ్యమంత్రి కెసిఆర్ తరచూ ఆకాంక్షిస్తున్నట్లుగా రైతుల జేబుల్లో ఒకటో రెండో లక్షలు ఉంచుకొని ధైర్యంగా తిరిగే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నయి. సాగు నీటి ప్రాజెక్టుల వల్ల 58 లక్షల రైతు కుటుంబాల తో పాటు పరోక్షంగా మరో 10 – 15 లక్షల మంది వ్యవసాయాధారిత కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.

ఒక పది ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ట్రాక్టర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నరు. తెలంగాణలో కోటి ఎకరాల సాగులక్ష్యం పూర్తయితే రైతులకు కొన్నిలక్షల ట్రాక్టర్లు , వరి కోత యంత్రాలు అవసరమవుతాయి. వాటి ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతయి. సుమారు 75 లక్షల కుటుంబాలు ధైర్యంగా బతకగలుగుతయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయంలోనూ గణనీయమైన పురోగతి ఉంటుంది. ఇప్పటికే రెండు లక్షల కోట్ల పైనే ఉన్న రాష్ట్ర బడ్జెట్ కాళేశ్వరం లాంటి సాగు నీటి ప్రాజెక్టులతో కొన్ని వేల కోట్ల పంటల వల్ల ఇంకా భారీగా పెరుగుతుంది. అప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కరెంటు బిల్లులు ఓ 15 – 20 వేల కోట్లు చెల్లించడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి నుండి చెబుతూనే ఉన్నరు. రైతులకు సాగు నీరు అందించడం కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని. ప్రభుత్వాలు తమ ప్రజల అవసరాల కనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తాయి. ఉదాహరణకు దుబాయి ప్రభుత్వం తాగు నీటి కోసం సుమారు లక్ష కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. మన తెలంగాణ ప్రాధాన్యత వ్యవసాయ రంగం. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. బహుశా దేశ చరిత్రలో రైతుల గురించి ఇంతగా తపన పడుతున్న నాయకుడు ఎక్కడా కనిపించడం లేదు. సాగు నీటి ప్రాజెక్టులు, రైతు బంధు , రైతు బీమా, ఉచిత విద్యుత్తు , అధిక సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, డ్రిప్, పాలీ హౌజ్ సాగు వంటి సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సాగు నీటితో కొన్ని వేల కోట్ల పంట పండడం ఒకటైతే గ్రామాల్లో ఇప్పటికే వ్యవసాయ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

2014 కు ముందు ఒక ఎకరం ధర రూ . 3 నుండి 5 లక్షలకు మించి లేదు. ఇప్పుడు ఎంత మారుమూల గ్రామంలోనైనా రూ . 10 – 15 లక్షలకు తక్కువ లేదు. ఇంకా పూర్తి స్థాయి లో నీరు అందితే ఎకరం ధర మార్కెట్లో రూ 25 – 30 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన తెలంగాణలో కాళేశ్వరం సహా మిగతా ప్రాజెక్టులు పూర్తయ్యి కోటి ఎకరాలు సాగులోకి వస్తే తెలంగాణ భూ సంపద విలువ రూ. 25 లక్షల కోట్ల పైనే పెరిగే అవకాశం ఉంది. సాగు నీటి వసతి ఏర్పడి పంటలు పుష్కలంగా పండితే వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు లక్షల్లో రుణాలు అందిస్తాయి. దాంతో రైతులు వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఇప్పుడు దేశంలో చెన్నై, సిమ్లా వంటి నగరాలు తాగు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నయి.

గత ఏడాది మహారాష్ట్రలోని లాథోర్ పట్టణానికి కూడా రైళ్లలో తాగు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చెన్నై లాంటి నగరానికి రైళ్లలో తాగు నీటిని తరలించే పరిస్థితి. సిమ్లా వంటి టూరిజం కేంద్రానికి రావద్దని అక్కడి ప్రభుత్వం గత ఏడాది పర్యాటకులకు విజ్ఞప్తి చేయడాన్ని గమనించాలి. అలాంటి పరిస్థితి ఎదురు కావొద్దనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ సుమారు కోటి కుటుంబాలకు ఇంటింటికి నల్లా ద్వారా తాగు నీటిని అందించడం కోసమే మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు ప్రజలకు తాగు నీటిని అందించడంలో విజయం సాధించారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణలో ఎలాం టి తాగు నీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నరు.

ఇక పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి కేటాయింపులు జరిపి తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి ముందు చూపుతో వ్యవహరించారు. 24 గంటల విద్యుత్తు , నీటి సరఫరాతో పాటు టిఎస్ ఐ పాస్‌తో వెంటనే అనుమతులు ఇస్తుండడంతో తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం వంటి సాగు నీటి ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నయి. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పునకు కాళేశ్వరం సహా ఇతర సాగు నీటి ప్రాజెక్టులు దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నయి.

special story about kaleshwaram project