Friday, January 27, 2023

ప్రేమ.. ప్రేమను.. ప్రేమిస్తుంది..

కుల/మతాంతర వివాహాలు నేటికీ నిషేధిత అంశంగానే పరిగణింపబడుతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ సమాజంలో కూడా ఈ వివాహాలకు ఆదరణ లభించడంలేదు. సమాజంలో కుల/మత వ్యవస్థ లను రూపుమాపాలని చెప్పేవారే కులమతాలను విభజించి పాలించడం చూస్తున్నాం. కుల,మత అడ్డుగోడల్ని కూల్చాలంటే మనుషుల్లో,సమాజంలో మార్పు రావాలి.వెలివాడల జాడలు కనుమరుగవ్వాలంటే కులాంతర,మతాంతర వివాహాల సంఖ్య పెరిగి, హెచ్చు,తగ్గులు లేని సమసమాజం ఏర్పడాలి .అయితే స్వచ్ఛమైన ప్రేమ పునాది మీద మాత్రమే ఇటువంటి వివాహాహార్మాలు నిలబడగలిగి,పదుగురిని ఆకర్షించగలుగుతాయి.ప్రేమ,నమ్మకం,ధైర్యం,త్యాగం వంటివి ఈ వివాహాల విజయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని చెబుతున్నారీ వివాహబంధంతో ఏకమైన ప్రేమికులు…

- Advertisement -

Sailajaడాక్టర్ ఎమ్ ఎస్ వెంకట్రామయ్య, ఆర్ జి -3 ఏరియా జనరల్ మేనేజర్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. శైలజ కుమారి,మాజి ఉద్యోగిని.వీరు 80 వ దశకంలో కులాంతర వివాహంతో ఒక్కటయ్యారు.ఒకరికొకరు తోడుగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు.
ప్రశ్న- మీ పరిచయం/ ప్రేమ ఎలా ఏర్పడి,పెళ్లికి దారి తీసింది..?
జవాబు – ఇద్దరి సొంతూరు కొత్తగూడెం.అనుకోకుండా ఓ సారి ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో కలుసుకున్నాం,ఇద్దరి అభిప్రాయాలు,భావాలు కలిశాయి.పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
ప్రశ్న – వైవాహిక జీవితం ఎలా ఉంది..?
జవాబు – చాలా సంతోషంగా ఉన్నాం.ఒడిదుడుకులు వచ్చినా ఒకరినొకరం అర్థం చేసుకుంటూ,సర్దుకుపోతూంటాం.చెప్పుకోదగ్గ అభిప్రాయభేదాలు ఇంతవరకు రాలేదు,రావు కూడా.మా ప్రేమ వివాహం విజయవంతమైందనే అనుకుంటున్నాం.
ప్రశ్న – మీ ఇరువురి మధ్య ఎప్పుడైనా కుల ప్రస్తావన వచ్చిందా,వస్తే ఏ రకంగా..?
జవాబు – ఇంతవరకు ఎప్పుడూ రాలేదు.ఒకరినొకరం తెలుసుకున్నతర్వాతనే పెళ్లి చేసుకున్నాం కద ఎందుకు వస్తుందా ఆలోచన.
ప్రశ్న – కులాంతర వివాహం తర్వాత సమాజాన్ని ఎలా ఎదుర్కున్నారు..?
జవాబు – మావరకైతే సమాజం నుండి ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదు.వివాహాన్ని బంధువులు అంగీకరిస్తారా లేదా అనే అనుమానం ఉండె,కాని వారు కూడా మా నిర్ణయాన్ని స్వాగతించారు.మా నాన్నగారికి(శైలజ) కూడా మా బంధువులే నచ్చజెప్పారు.
ప్రశ్న – మీ పిల్లలు కుల/మతాంతర వివాహాలు చేసుకుంటామంటే ఒప్పుకున్నారా..?
జవాబు – పిల్లల విషయంలో వారెటువంటి నిర్ణయం తీసుకున్నా ఒప్పుకోవాలన్న ఆలోచనే ఉండేది.ప్రేమిస్తే చెప్పండని ఇద్దరు పిల్లలకూ చెప్పాం కూడా,పెద్దబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి గూర్చి వివరించి,మా అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాడు.రెండో అబ్బాయి మేం చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.వారెలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరించేవాళ్లమే,కాకుంటే అమ్మాయి కుటుంబ నేపథ్యం బాగుండాలని మాత్రం కోరుకున్నాం.
ప్రశ్న – మనిషి జీవితంలో కుల,మతాల పాత్ర ఎంత..?
జవాబు – అది చెప్పేంత గొప్పవాళ్లం కాదు కాని, సంకుచితత్వంతో కుల మతాలను వాడుకోవడం మాత్రం మంచిదికాదు.సామాజిక ఐక్యతకు కులం,మతం అవసరం,వ్యక్తిగత అవసరాలకు కులమతాలను వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తాం.

Priyankaహైదరాబాద్‌కు చెందిన కూర్మగడ్డ ప్రశాంత్,ప్రియాంక ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.కాలేజీలో చదివుతున్నప్పుడే ప్రేమించుకున్నారు,ఇరువురు పెద్దలనొప్పించి పెళ్లి చేసుకున్నారు.
ప్రశ్న- మీ పరిచయం/ ప్రేమ ఎలా ఏర్పడి,పెళ్లికి దారి తీసింది..?
జవాబు – ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు పరిచయం అయ్యింది.సెకండ్ ఇయర్‌లో ప్రశాంత్ నాకు(ప్రియాంక) ప్రపోజ్ చేశారు.నేనూ సరేనన్నాను.రెండువైపుల పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం(ఆరు సంవత్సరాలు పట్టింది).
ప్రశ్న – వైవాహిక జీవితం ఎలా ఉంది..?
జవాబు – ప్రేమించుకున్నప్పుడు కంటే పెళ్లాయ్యాకే బావుంది.అప్పుడప్పుడు ఆలోచనల్లో తేడాలు వస్తాయి.ఒక మూడు నిమిషాలపాటు మౌనంగా ఉంటాం,తర్వాత సర్దుకుపోతాం.ప్రశాంత్ చాలా సహకరిస్తారు.
ప్రశ్న – మీ ఇరువురి మధ్య ఎప్పుడైనా కుల ప్రస్తావన వచ్చిందా,వస్తే ఏ రకంగా..?
జవాబు – ఇంతవరకు అసలు రాలేదు.
ప్రశ్న – కులాంతర వివాహం తర్వాత సమాజాన్ని ఎలా ఎదుర్కున్నారు..?
జవాబు – సమాజం నుండి చాలా ప్రశ్నలు ఎదుర్కున్నాం,ముఖ్యంగా బంధువుల్లోనే రకరకాలుగా మట్లాడారు.అసలు పట్టించుకోలేదు.
ప్రశ్న – మీ పిల్లలు కుల/మతాంతర వివాహాలు చేసుకుంటామంటే ఒప్పుకుంటారా..?
జవాబు – చాలా సమయం ఉంది.వారి నిర్ణయం మంచిదైతే తప్పకుండా ఒప్పుకుంటాం.
ప్రశ్న – మనిషి జీవితంలో కుల,మతాల పాత్ర ఎంత..?
జవాబు – ప్రాక్టికల్‌గా చూస్తే చాలా తక్కువ,కాని మన ప్రాంతంలో ఈ రకంగా ఆలోచించేవారు ఎక్కువే.ఈ పద్ధతి మారాలి.

Suguna-Kumari-డాక్టర్ మారుపాక రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ సుగుణకుమారి చెలిమెల – ప్రముఖ కార్డియాక్ సర్జన్ అయిన రాజేంద్రప్రసాద్,పిడియాట్రీషియన్ అయిన సుగుణకుమారి 80 వ దశకంలో కులాంతర వివాహం చేసుకున్నారు.సుగుణకుమారి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్‌పిగా ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం ఈ జంట అబుదాబిలో వైద్యసేవలు అందిస్తున్నది.
ప్రశ్న- మీ పరిచయం/ ప్రేమ ఎలా ఏర్పడి,పెళ్లికి దారి తీసింది..?
జవాబు – ఉస్మానియా యునివర్సిటీలో మెడిసిన్ చదివే రోజుల్లో ఇద్దరం తరచూ కలుసుకునేవాళ్లం.క్రమంగా ప్రేమగా మారింది,హౌజ్ సర్జన్ చేస్తున్నప్పుడు ప్రపోజ్ చేసుకున్నాం.ఇరువైపుల పెద్దలు మొదట అంగీకరించలేదు,ముఖ్యంగా మా అమ్మా,నాన్నలు(సుగుణ కుమారి) వారిది పెద్దకులం ముందు ముందు ఇబ్బంది పడతావు వద్దని వారించారు.కాని రాజా (రాజేంద్రప్రసాద్) వారిని ఒప్పించడంతో మేం వివాహం చేసుకున్నాం.
ప్రశ్న – వైవాహిక జీవితం ఎలా ఉంది..?
జవాబు – చాలా సంతోషంగా ఉన్నాం,అలాగని తేడాలుండవని కాదు(ఇవి అన్ని వివాహబంధాల్లో ఉండేవే కద).అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఇద్దరం సర్దుకుపోతాం,మా మధ్యన ఉన్న ప్రేమ సర్దుకుపోయేలా చేస్తుంది,అంటే అపార్థం కలిగించే విషయాన్ని ప్రేమ చిన్నది చేస్తుంది.ఇద్దరం కూర్చుని చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాం.విశ్వాసం,గౌరవం రెండూ ఇరువురం ఇచ్చిపుచ్చుకుంటాం కాబట్టి సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు.మొత్తానికి వివాహబంధం వల్ల సంతోషంగా ఉన్నాం.
ప్రశ్న – మీ ఇరువురి మధ్య ఎప్పుడైనా కుల ప్రస్తావన వచ్చిందా,వస్తే ఏ రకంగా..?

జవాబు – మా ఇద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు.రాజా కుల,మతాలను పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదు.ఒక డాక్టర్‌గా పేషెంట్‌కు ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు కుల,మతాలను పట్టించుకోవడం ఉండదు కదా..? అదే స్ఫూర్తి రాజాలో ఎప్పుడూ ఉంటుంది.ఎప్పుడైనా మాట్లాడారంటే ఆ పరిస్థితులను నేనర్థం చేసుకుంటాననే నమ్మకంతోనే కుల ప్రస్తావన చేస్తారు.
ప్రశ్న – కులాంతర వివాహం తర్వాత సమాజాన్ని ఎలా ఎదుర్కున్నారు..?
జవాబు – సమాజం నుండి చాలా సవాళ్లు ఎదురయ్యాయి.బంధువుల్లోనే శూద్రురాలివని అవమానించినవారున్నారు.అయితే ఎప్పుడూ వాటిని లెక్కచేయలేదు.రాజా నాకీ విషయంలో పూర్తి సహకారం అందించేవారు,కులాలు లేవు ఏం లేవు అని ఎప్పటికప్పుడు వెన్నంటి ఉండేవారు.
ప్రశ్న – మీ పిల్లలు కుల/మతాంతర వివాహాలు చేసుకుంటామంటే ఒప్పుకున్నారా..?
జవాబు – పిల్లల వివాహ విషయంలో పూర్తి స్వేచ్ఛ వారికిచ్చాము.కుల,మత ప్రస్తావన కూడా మేం తీసుకురాలేదు ఎప్పుడు.పెద్దబ్బాయి తన క్లాస్‌మేట్‌ను వివాహం చేసుకున్నాడు.చిన్నబ్బాయికీ తను ఇష్టపడ్డ అమ్మాయితో మేమే పెళ్లి చేశాం.
ప్రశ్న – మనిషి జీవితంలో కుల,మతాల పాత్ర ఎంత..?
జవాబు – భారతదేశంలో వీటి పాత్ర చాలా ఎక్కువ.వివక్ష ప్రతి చోటా ఉన్నది.నేను దళిత ఎమ్‌పిగా,మహిళగా పార్లమెంటులో కూడా వివక్ష ఎదుర్కున్నాను.వ్యవస్థ మారాల్సిన అవసరం ఉన్నది.

Rama-Raoఖమ్మం జిల్లా నేలకొండపల్లి భైరవునిపల్లెకు చెందిన రామారావు,ఇండో,నేపాల్,టిబెటన్ బార్డర్‌లోని గ్రామమైన అల్గరా కు చెందిన అరుణ బస్నెట్ ఛత్రి ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు.వీరి ప్రేమ పెళ్లిగా మారడానికి పదేళ్ల సమయం పట్టింది.
ప్రశ్న- మీ పరిచయం/ ప్రేమ ఎలా ఏర్పడి,పెళ్లికి దారి తీసింది..?
జవాబు – నేను(రామారావు) కమ్యూనిటీ మీటింగ్ కోసం పశ్చిమ బెంగాల్‌లోని కాలింగ్ పాంగ్‌కు వెళ్లాను,అరుణ వచ్చింది,అక్కడే మా పరిచయం ఏర్పడింది.అలా దాదాపు పది సంవత్సరాలు ఫోన్లలో మాట్లాడుకోవడం,ఉత్తరాలు రాసుకోవడం చేసేవాళ్లం.ఓ సారి అరుణ ఉండే ప్రాంతంలో భూకంపం రావడంతో మాట్లాడుకోలేకపోయాం,దాంతో నేను అక్కడికి వెళ్లిపోయాను.అప్పుడు తను ప్రపోజ్ చేసింది కాని వాళ్ల అమ్మా,నాన్న దక్షిణ భారతదేశానికి చెందిన అబ్బాయికి ఇవ్వమన్నారు.ఎందుకని అడగ్గా మీకు కట్నాలు ఇవ్వలేము అని అన్నారు.దాంతో మా తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి ఒప్పించాను.మా నాన్న కూడా వర కట్నానికి వ్యతిరేకి,దాంతో వాళ్లూ ఒప్పుకున్నారు.అలా ఇరువైపుల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.
ప్రశ్న – వైవాహిక జీవితం ఎలా ఉంది..?
జవాబు – బాగుంది,ఇద్దిరి ఆహార అలవాట్లు చాలా తేడాగా ఉన్నాయి, సర్దుకుపోతున్నాం.
ప్రశ్న – మీ ఇరువురి మధ్య ఎప్పుడైనా కుల/మత ప్రస్తావన వచ్చిందా,వస్తే ఏ రకంగా..?
జవాబు – ఇంతవరకు రాలేదు.

ప్రశ్న – జాత్యంతర వివాహం తర్వాత సమాజాన్ని ఎలా ఎదుర్కున్నారు..?
జవాబు – చాలా రకాలుగా అనేవాళ్లున్నారు,అంటున్నారు కాని పట్టించుకోవడం లేదు.వేరే వాళ్లనుకున్నట్లుగా మన జీవితం ఉండదు కద.
ప్రశ్న – మీ పిల్లలు కుల/మతాంతర వివాహాలు చేసుకుంటామంటే ఒప్పుకుంటారా..?
జవాబు – తప్పకుండా ఒప్పుకుంటాం.
ప్రశ్న – మనిషి జీవితంలో కులమతాల పాత్ర ఎంత..?
జవాబు – ఈ కులం,మతం వంటివి మనుషులు ఏర్పాటుచేసుకున్నవే తప్ప సృష్టిలో ఉన్నవి కాదు.ఐనా మన దేశంలో వీటి పాత్ర ఎక్కువే,ఈ పద్ధతి మారాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles