Home తాజా వార్తలు పల్లా దుర్గయ్య ఇల్లే వారి సాహిత్య పాఠశాల

పల్లా దుర్గయ్య ఇల్లే వారి సాహిత్య పాఠశాల

Special Story about PV friend Palla Durgaiah

 

వానమామలై, నేరెళ్లను విధానమండలికి పంపిన పివి
కాళోజి, పివిలతో రామశాస్త్రి జ్ఞాపకాలు

‘అచట పుట్టిన చిగురు

కొమ్మయిన చేవ‘ అంటాడు తను రాసిన మనుచరిత్ర కావ్యంలో ప్రవరాఖ్యుని పుట్టిన ఊరు గురించి చెబుతూ అల్లసాని పెద్దన, అలాగే వరంగల్, హనుమకొండ, కాజీపేట ‘త్రీనగరి‘ని ఆనుకొని ఉన్న మడికొండ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. మడికొండ గ్రామం విద్వత్ కవులకు పెనుగొండగా భాసిల్లింది. మరో రకంగా చెప్పాలంటే ఎంతోమంది సాహిత్య కారులకు పండితులకు అది పుట్టినిల్లుగా విరాజిల్లింది. ప్రజాకవి కాళోజీ భాషలో చెప్పాలంటే ‘బ్రతికి ఉన్న వాడు ఎవడైనా ఒక్కసారైనా బక్కయ్య శాస్త్రి పురాణం‘ వినాలి అని అనేవారట. ఎందుకంటే ఆయన పురాణం చెప్తే మడికొండకి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కాజీపేట వరకు వినిపించేదని చెప్పుకునేవారు. అంటే తన కంచు కంఠంతో అంత గట్టిగా బిగ్గరగా చెప్పేవారు అని అర్థం.

వానమామలై బక్కయ్య శాస్త్రి సొంత ఊరు మడికొండ. ఆయనకు నలుగురు కొడుకులు విత్తు ఒకటి పెడితే చెట్టు మరొకటి వస్తుందా. అందుకే అందరూ సాహిత్యకారులే. వరుసగా వెంకటాచారి, లక్ష్మణాచారి, జగన్నాథచారి, సాహిత్య పిపాస ఉన్న ఎవరికైనా సుపరిచితమైన పేరు వానమామలై వరదాచారి. ఈయ న నాలుగో వాడు . వీరే కాదు బిరుదు రామరాజు కాళోజీ సోదరులైన కాళోజీ రామేశ్వరరావు, కాళోజీ నారాయణ రావు, పల్లా దుర్గయ్య, అనుముల కృష్ణమూర్తి వీరందరూ మడికొండ మట్టిలో పుట్టిన మణిమాణిక్యాలే. అంతెందుకు దాశరధి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్యులు వరంగల్ జిల్లా మానుకోట దగ్గర్లోని గూడూరు మట్టి మనుషులే కదా!

పల్లా దుర్గయ్య ఇల్లే కదా! సాహిత్య పాఠశాల, సుమధుర సాహిత్య ‘పాకశాల‘
పల్లా దుర్గయ్య హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేసేవారు. అప్పుడు ఆయన ఇల్లు నారాయణగూడలో ఉండేది. ఆ ఇల్లే పైన నేను చెప్పిన ఉద్దండ సాహితీవేత్తల సమావేశ మందిరంగా ఉపయోగించుకునేవారు. వారితో పాటు మరొక సాహితీ శిఖరం మన పాములపర్తి వెంకట నరసింహారావు కూడా వీరందరికీ మంచి సాహితి మిత్రుడు. హైదరాబాద్‌లో వీరందరూ కలవాలంటే పల్లా దుర్గయ్య ఇల్లు ఒక సాహితీ ‘పాకశాల‘తో పాటు పాఠశాలగా కూడా మారిపోయేది. రోజుల తరబడి ఈ సాహితీ శిఖర సమానమైన వారు ఆ ఇంట్లోనే సమావేశమై సాహితీ చర్చలు జరిపి కొత్త సాహిత్యాన్ని సృష్టించారు. భావ కవిత్వం నుంచి మొదలు విప్లవ కవిత్వం దాక అనేక రచనలకు పుట్టినిల్లు పల్లా దుర్గయ్య ఇల్లు. ఆయన కూడా స్వతహాగా కవి, రచయిత. ఆయన రాసిన ‘గంగిరెద్దు‘ ‘పాలవెల్లి‘ ప్రఖ్యాత రచనలు.

గంగిరెద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజులు పాఠ్యాంశంగా ఉంది. ఆ తర్వాత తీసివేయబడింది. సంక్రాంతి కన్నా ముందు, ఆ తర్వాత కూడా తెలంగాణ పల్లెల్లో గంగిరెద్దుల ఆడించే వారి బతుకుదెరువు, వారి జీవితాన్ని అందులో చాలా చక్కగా వర్ణించారు. మడికొండ ఘనకీర్తి గురించి ఆ గ్రామస్తుడైన కవి అనుముల కృష్ణమూర్తి రాసిన ఈ కవిత మడికొండ ప్రతిభకు అద్దం పడుతుంది. మొలిచిన మొక్కలన్నియును కూచి ఫలించిన నందనమ్మనన్, పిలిచిన పలుకు దైవమని పేర్గల అంటూ ‘అచట పుట్టిన చిగురు క్మొన చేవ’ అని మనుచరిత్రలోని అల్లసాని పెద్దన రాసిన కవిత లాగా మడికొండ మీద ఇలా సాగుతుంది ఆయన కవిత్వం. బిరుదు రామరాజు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ మిత్రబృందం సమావేశాలు తరచుగా రామరాజు ఇంట్లో కూడా జరిగేవి. ఈ సాహితీ మిత్ర బృందంలో మన పివి, కాళోజీ నారాయణరావు తప్పించి మిగతా మిత్రులందరూ రాజకీయ వాసనలకు దూరంగా ఉన్న వారే. కాళోజి కూడా రాజకీయాల్లో ఎమ్మె ల్యేగా నిలబడి నైతికంగా గెలిచి సాంకేతికంగా ఓడిపోయినవాడు.

రూపాయి ఖర్చుతో పీవీకి పూలమాల సన్మానం
పివి అప్పటి కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినప్పుడు పల్లా దుర్గయ్య ఇంట్లోనే పీవీని సన్మానించారు. అది ఎలాగంటే నేను పైన చెప్పిన ఉద్దండులు అందరూ ఆ సన్మాన సభలో పాల్గొన్నారు. అప్పటికప్పుడు కాళోజీ నారాయణరావు తన జేబులో రూపాయి తీసి పక్కనే పూల దుకాణంలో ఒక పూల దండ కొనుక్కుని వచ్చి మంథని ఎమ్మెల్యేగా ఎన్నికైన పీవీ మెడలో సంతోషంగా వేసి మిత్రులందరితో కలిసి చప్పట్లు కొట్టారు. అలా పీవీ సన్మానం ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా జరిగింది. సాహిత్యానికి పెద్దపీట వేసిన పాలకులు వానమామలై వరదాచార్యులుకి ఎంత పాండిత్యం ఉన్నా కావలసిన సర్టిఫికెట్ చదువు లేదు. దాంతో అప్పటి హైదరాబాద్ స్టేట్‌కి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వరదాచార్యులు ప్రతిభను గుర్తించి తన ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారుగా ఆయనను అపాయింట్ చేశారు. ఆ తర్వాత వరదాచార్యులు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఆయనను ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులో ప్రభుత్వ టీచర్‌గా నియమించారు.

విధానమండలిని సాహితీ క్షేత్రంగా మలచిన రాజకీయాలు, ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరంగా కాళోజీ నారాయణరావు, వానమామలై వరదాచారి ఉండిపోయారు. వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సాహిత్యంలో కూడా మిత్రులైన కాళోజీ పి.వి నరసింహారావు రాజకీయాల్లో వైరి వర్గంగా కూడా మారిపోయిన చారిత్రిక సందర్భాలు మనం చూశాం. అలాంటి కవులను, కళాకారులను ప్రోత్సహించి అప్పటికే రాజకీయ పునరావాస కేంద్రంగా తయారవుతున్న ఆంధ్రప్రదేశ్ విధాన మండలిలో వీరిద్దరితో పాటు వరంగల్ నగరానికి చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్‌లను ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత అప్పటి రాజకీయ పార్టీల నాయకులదే. ఇవాళ విధానమండలిని మాత్రమే కాదు, పెద్దల సభ అయిన రాజ్యసభ కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు కవులకు కళాకారులకు ఆనాడు పెద్దపీట వేశారు.

బతికుండగానే సంతాప సభ
ఈ సాహితీ మిత్రులు అందరూ కలిసి ఒకసారి ఒక విచిత్ర సన్నివేశాన్ని సృష్టించారు. బతికుండగానే వరదాచార్యులకు సంతాప సభ నిర్వహించిన సాహితీ మిత్రులు, ఆ తర్వాత ఎంత పని అయిపోయింది అనుకున్నారు. ఆ అరుదైన విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. వానమామలై వరదాచార్యులుకి ఒకసారి టీబీ వ్యాధి సోకింది. దానికి చికిత్స కోసం మైసూర్ వెళ్లారు. అప్పటి మైసూర్ మహారాజు వీరిని గుర్తించి, ఆదరించి చికిత్సకు ఖర్చు అంతా తానే భరించి ఆశ్రయం ఇచ్చారు. ఆయన మైసూరులో ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో వరదాచార్యులు మరణించారని తెలిసింది. దాంతో ఈ మిత్ర బృందం అంతా పల్లా దుర్గయ్య ఇంట్లోనే సమావేశమై సంతాప సభ నిర్వహిస్తుండగానే వానమామలై వరదాచార్యులు ఆ సభకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఆయన మరణించలేదని అర్థం అయిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయ్యో ఇంకా మీరు పోలేదా అని సరదాగా వ్యాఖ్యానించారు. అప్పుడు వానమామలై నేను ‘పోతానా’! అని మరింత సరదాగా అన్నారు. అవును నువ్వు అభినవ ‘పోతనవే’ అని ఆయన అందరూ అభినందించారు.
సాహిత్య పిపాసి పివి,

సాహిత్యమే పీవీకి ఆటవిడుపు
వరదాచారి పోతన భాగవతం గురించి రాసిన రచనలు అచ్చు వేయడానికి ఆనాడే తెలంగాణ రచయితల సభ ఆవిర్భవించింది. దానికి కాలోజి నారాయణరావు అధ్యక్షులు, డాక్టర్ సి.నారాయణరెడ్డి కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ వైతాళిక సమితి ఆవిర్భావంలో కూడా పివి ప్రత్యక్ష, పరోక్ష సహకారంతో పాటు ఆశీస్సులు ఉన్నాయంటారు. తెలంగాణలో అప్పట్లో జరిగిన సాహిత్య సమావేశాలు, సహస్రావధానాల్లో పీవీ తరచుగా పాల్గొనేవాడు. ఇలా సాహిత్య పరిమళాలు ఎక్కడ విరాజిల్లినా వీలైనంతవరకు పీవీ హాజరయ్యేవాడు. రాజకీయ రణరంగంలో కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు మధ్య తలమునకలైన పీవీకి సాహిత్య రంగం ఒక ఆటవిడుపు లాగా పనిచేసింది.

అందుకే ఆయన కలం నుండి ‘గొల్ల రామవ్వ‘ కథ మాత్రమే కాదు, ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలను సహస్రఫణిగా అనువాదం చేశారు పీవీ నరసింహారావు. అలా హిందీలో అనువాదం చేయడం వల్లనే కేంద్ర సాహిత్య అకాడమీలో పెత్తనం చెలాయించే ఉత్తరాది సాహిత్యకారులకు విశ్వనాథ గొప్పతనం తెలిసిందని, దానివల్లే ఆయనకు జ్ఞానపీఠ అవార్డు లభించిందని కూడా చెప్పుకుంటారు. అలా ఒక తెలుగు వాడు మరో తెలుగు వాడికి సాహిత్యంలో దన్నుగా నిలిచాడని చెబుతారు. పీవీ నరసింహారావు ప్రధానిగా అత్యున్నత రాజకీయ శిఖరాలను అధిరోహించి తర్వాత తీరిక సమయంలో తన లోపలి మనిషిని ఆవిష్కరించారు. ఎంతైనా పీవీ ఒక సాహిత్య పిపాసి.