Home ఆఫ్ బీట్ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. భువనగిరి కోట

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. భువనగిరి కోట

Special Story on Bhonagiri Fort

ఈ కొండ ఎత్తు 610 మీటర్లు. అండాకారపు ఏకశిలా పర్వతంలా ఈ కొండ ఉంటుంది. దీన్ని దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా, పడమటి నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా కనిపిస్తుంది. ఈ కొండ బాలాఘాట్ పర్వతపంక్తులలోని అనంతగిరి వరుసల లోనిది. ఈ కొండమీదనే భువనగిరి దుర్గమున్నది. ఇది తెలంగాణాలోని ఉండ్రుకొండ, ఉర్లుకొండ, అనంతగిరుల కంటే ఎత్తైనది. ఈ కోటకు నైరుతి, ఆగ్నేయ దిశల నుండి పైకి వెళ్ళే మార్గాలున్నాయి. ప్రస్తుత మార్గం నైరుతి నుండే ప్రారంభమవుతుంది. జానపదుల పేరుమీద ఒక దుర్గం, ఒక నగరం ఏర్పడ్డది చరిత్రలో ఎక్కడైనా వుందో లేదో కాని మన తెలంగాణలో ఉంది. అదే ‘భువనగిరి కోట’ ఇది
యాదాద్రి భువనగిరి జిల్లా లో ఉంది.

భువనగిరి, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలం, ఒక ముఖ్య పట్టణం. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమాదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రి భువనగిరి అని పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరి గా మారింది.
ప్రత్యేకతలు….
మౌర్యులు (చంద్రగుప్తుడు, అశోకుడు), శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, పశ్చిమ, కళ్యాణి చాళుక్యులు, కందూరి చోడులు, కాకతీయులు, పద్మనాయకులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, నిజాం రాజులు ఇలా తెలంగాణాను ఏలిన అందరి పాలనలో భువనగిరి ఉంది. భువనగిరి ఒక చారిత్రక పట్టణం. విష్ణుకుండినుల నాటి నాణేలు భువనగిరిలో దొరికినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో గణపతిదేవ చక్రవర్తి రుద్రమదేవి భర్త వీరభద్రునికి అరణంగా యిచ్చిన కొలనుపాకసీమలోనిదే భువనగిరి దుర్గం. కాకతీయుల సామంతుడైన గోనబుద్ధారెడ్డి ఏలిన మానువనాటి సీమలో భువనగిరి అంతర్భాగంగా వుండేది. ఈ కొండలో ఇప్పటికీ కనుగొనని అనేక గుహలు సొరంగాలున్నట్లు చెప్పుకుంటారు. ఇది అతిశయోక్తే. కొండపైన ఒక శివాలయం ఉంది. కొండకింద రెండు దేవాలయాలు ఒకటి పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం, ఒక మఠం ఉన్నాయి. భువనగిరికి దగ్గరగా ఆలేరు నది (భిక్కేరు), మూసీనదులున్నాయి. భువనగిరికి వాయువ్యాన చెరువుంది. ఆ చెరువుకు బీబీనగర్ చెరువు గొలుసుకట్టు గా అక్కడనుండి కట్టుకాలువ ఉంది .
చరిత్ర…..
మౌఖిక కథనాల ప్రకారం భువనగిరిలో కోట కట్టాలనుకున్న త్రిభువనమల్లునికి స్థానికులైన గొల్ల దంపతులు ఈ కొండను చూపించారట. అరణ్యంలో తీగెలతో కప్పబడివున్న ఈ కొండ కోట నిర్మాణానికి అనుకూలంగా భావించి దుర్గం నిర్మించిన బోనయ్య, గిరమ్మ దంపతుల పేరు మీదనే పట్టణానికి నామకరణం చేసాడట చక్రవర్తి త్రిభువనమల్లుడు. చాళుక్యుల పిదప కాకతీయులు దుర్గాన్ని ఏలారని చెపుతారు. ఆ బోనగిరే సంస్కృతీకరించబడి ఇప్పుడు భువనగిరిగా పిలువబడుతున్నది. భువనగిరి పరిసరాల్లోని తుమ్మలగూడెం, వలిగొండ, రాయగిరి వంటి చోట్ల మధ్య పాత రాతియుగం (క్రీ.పూ. 50000,-10000) నాటి మానవ ఆవాస చిహ్నాలున్నాయి. రాతిగొడ్డళ్ళు, కత్తులు, బొరిగెలు, బాణాలు వంటి రాతిపనిముట్లు లభించాయి. సమాధులు కూడా కనుగొన్నారు. భువనగిరిలో మధ్య రాతి యుగం (క్రీ.పూ. 1000-, 2000) నాటి మానవ నివాస జాడలు లభించాయి. నవీన శిలాయుగం (క్రీ.పూ.2500-, 1000) నాటి మానవ ఆవాసాలు భువనగిరి కొండ కింద చాలా ఉన్నాయి.
అక్కడ చూడాల్సిన ప్రదేశాలు…
భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ‘ఉక్కుద్వార’మంటారు. ఫతే దర్వాజా లాగే వుంటుంది. తలుపులు వెడెల్పు చెక్కలతో, ఇనుప గుబ్బలతో గజంపొడుగు బేడాలతో నిర్మించబడింది. రెండోద్వారం గుళ్ళోని చౌ కోటులెక్క వుంటుంది. బేడాల రంధ్రాలు గోడల్లోకి ఉంటాయి. ఈ ద్వారం దాటి పైకెళ్ళితే ఒక కొలను కనపడుతుంది. నీళ్ళున్నపుడు అందులో తెల్లకలువలు విరబూసి కనపడుతుంటాయి. పై ఎత్తుకి శిఖరానికి చేరినపుడు అక్కడ రాజభవనాలు, అంతఃపురం (బారాదరి) కనిపిస్తాయి. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో ఉన్నాయి. పైన గచ్చు నమాజుకు వీలుగా మసీదులాగా కనిపిస్తుంది. ఈ అంతఃపురం గోల్కొండ బారాదరిని పోలి వుంటుంది. బారాదరికి పడమట లోతు తెలియని ‘ఏనుగుల మోటబాయి’ (గుండం) ఉంది.

తోడిన నీళ్ళు నిలువచేసుకోవడానికి బారాదరికి ఆనుకుని 9తొట్లు (హౌసులు) కట్టివున్నాయి. ఉత్తరాన ఒక నల్లని నంది విగ్రహం ఉంది. రాజ ప్రాసాదాల వద్ద చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే నాలుగు రేకుల పుష్పాలంకారాలు, ఏనుగు ముఖాల్లోంచి సర్పాకారాలు, కాకతీయశైలిలో మకరతోరణాలు, ద్వారపాలకులు, గజలక్ష్మి చెక్కబడి వున్నాయి. కోట లోపల ప్రాకారాల్లో ధాన్యాగారాలు, సైనికాగారాలు, గుర్రపు కొట్టాలున్నాయి. రాజ ప్రాసాదాల కింద ఎన్నో అంతుతెలియని రహస్య శిలాగర్భ మార్గాలున్నాయి.ఈ సొరంగాల తొవ్వలు ఎక్కడికి తీసుకెళ్తాయో ఎవరు కనుక్కోలేకపోయారు. కోటలో పడివున్న ఫిరంగులు ఎనిమిది. అందులో ఒకటి కుతుబ్షాహీలతో షితాబుఖాన్ (సీతాపతి) చేసిన యుద్ధంలో వాడిన ఫిరంగి. చరిత్రలో తెలంగాణాను ఏలిన అందరి ఏలుబడిలో భువనగిరిప్రాంతం ఉంది.

ఎలా వెళ్లాలి…. హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. రైలు మార్గం కూడా ఉంది. ప్రైవేట్ వాహనాలు కూడా వెళుతుంటాయి.