Home కామారెడ్డి నిర్లక్షం నీడలో.. హరితహారం మొక్కలు

నిర్లక్షం నీడలో.. హరితహారం మొక్కలు

 Spend crores of rupees for plant protection

మనతెలంగాణ/మద్నూర్: ‘పచ్చని చెట్లు -ప్రగతికి మెట్లు ’ మొక్కలు నాటండి-… పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న అటవీ శాఖ అధికారులు మాత్రం మొక్కల సంరక్షణను ఆచరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మొక్కల సంరక్షణ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుండగా కొందరు అటవీ శాఖ అధికారుల నిర్లక్షం కారణంగా నాటిన మొక్కలు నేలకొరిగి పాడైపోతున్నాయి. మద్నూర్ మండలంలోని చాలా గ్రామాలలో అటవీ శాఖ అధికారులు తెలంగాణ హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఇటీవల వీచిన ఈదురుగాలులకు నేలకొరిగాయి. మొక్కలు నేలకొరిగి వారం రోజులు గడుస్తున్నా సంబంధిత అటవీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మండలంలోని లచ్చన్ గేట్ నుండి గ్రామం వరకు రహదారికి ఇరువైపులా అటవీశాఖ అధికారులు మొక్కలను నాటారు. పశువులు, మేకలనుండి మొక్కలను సంరక్షించడం కోసం ప్లాస్టిక్ జాలీలను ఏర్పాటు చేసారు. కాగా వారం రోజుల క్రితం ఈదురు గాలులు వీయడంతో మొక్కలన్నీ నేలకొరిగాయి. కొన్ని మొక్కలు విరిగి పోయాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా అందంగా కన్పించిన మొక్కలు నేడు నేలకొరిగి అందవిహీనంగా కన్పిస్తున్నాయనీ అటవీ శాఖ అధికారులు మొక్కల సంరక్షణ పట్ల తగు చర్యలు చేపట్టడం లేదనీ లచ్చన్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని విధులు నిర్వర్తిస్తున్న కొందరు అటవీఅధికారులు విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారనీ, కొందరైతే గ్రామాల వైపే కన్నెత్తి చూడడం లేదని గ్రామీణులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అటవీశాఖ అధికారులు నేలకొరిగిన మొక్కలను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. విధుల పట్ల నిర్లక్షంగా వ్యవరిస్తున్న అటవీ సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.