Home తాజా వార్తలు జానపదుల చేతిలోని తీపి మామిడి

జానపదుల చేతిలోని తీపి మామిడి

Hari Krishna

 

తెలంగాణ మట్టిలో మనుషుల మనోగతాలు, ప్రేమలు,త్యాగాలు, సంఘర్షణలు ,ఉద్యమాలు, చైతన్యం ,అస్తిత్వపుపోరాటాలు, దగాపడ్డ గొంతుకలు, అణచివేయబడ్డ అమాయకత్వం, కళలు, సాహిత్యం, ప్రాచీన చరిత్ర, ఈ రకంగా అన్నీ దాగి ఉన్నవి. ఇక్కడి మనుషుల్లో ఈ మట్టి మీద ఉన్న మమకారం తాము ఎంచుకున్న సిద్ధాంతాల ఆశయ సాధనకు దోహదం చేస్తూ, తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నది. ఇటువంటి కార్యసాధకులు తెలంగాణలో మణిపూసల్లా పుడుతూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో మన కట్టు ,మనబొట్టు, మన బోనం, మన బతుకమ్మ ,మన భాష అంటూ తెలంగాణ అస్తిత్వ మూ లాలను, సంస్కృతిని పునరుజ్జీవింప చేస్తూ తాను ఎదిగివచ్చినతొవ్వను, మానవీయ కోణాన్ని మరువని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు.

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి లక్ష్యాలకు అనుగుణంగా గత పాలకుల కాలంలో వివక్షకు గురైన తెలంగాణ సంస్కృతి, భాష ,్కళలు వీటికి పునర్వైభవం తెచ్చేవిధంగా అనుభవం కార్యదక్షత కలిగిన ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు, టూరిజం, కల్చర్ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారి సౌజన్యంతో హరికృష్ణ గారు రవీంద్రభారతి వేదికతోపాటుగా ,ఢిల్లీమరియు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తెలంగాణ కళలకు కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పిస్తూ వస్తున్నారు.

హరికృష్ణ గారు బహుముఖ వ్యాసకర్త,కవి, విమర్శకుడు, అనువాదకుడు, బహుభాషావేత్త, ఆర్టిస్టు అంతేగాక కళల గురించి అమితంగా అవగాహన కలిగిన వారు. తాను సమాజంలో కష్టాలు కన్నీళ్లు ఒక దశలో అనుభవించిన వారు కావడంతో సంఘజీవిగా తన మనుగడ కోసం పరిభ్రమిస్తున్నప్పుడు తనలో కలిగే సంఘర్షణ భావజాలాన్ని వ్యక్తీకరించడానికి తాను కవిగా ఆవిష్కరింపబడినారు. వీరి కవిత్వం ఒక ప్రవాహంలో చిన్నచిన్న పాయలు కలిసినట్టుగా అన్ని భావజాలాలు పాయలుగా కలిసి ప్రవహిస్తూనే ఉంటుంది.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ప్రస్థానం మామిడి హరికృష్ణ గారిని 2014 అక్టోబర్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా నియమించింది.. అంతకు ముందే వీరు తెలంగాణ సంస్కృతి మీద విస్తృత అవగాహన కలిగినవారు. అంతేగాక ప్రపంచ సాహిత్యం మరియు సినిమా ప్రపంచం మీద అవగాహన కలిగిన వారు. అంతకంటే తెలంగాణ మట్టిలోని కళలమీద అమిత ఆసక్తి ఉన్న వారు. సహజంగానే హరికృష్ణ గారు కవులను కళలను కళాకారులను ఎంతో ఇష్టపడతారు. గత ప్రభుత్వాల కాలంలో తెలంగాణ సంస్కృతిలో భాగమైన పండుగలు ,కళలు నిరాదరణకు గురయ్యాయో, వాటిని పునరుజ్జీవింప చేసే లక్ష్యంతో సంచాలకులుగా నియమించిన నాటి నుండి రవీంద్రభారతి వేదికగా నూత న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు రవీంద్రభారతి శాస్త్రీయ కళలకు అడ్డాగా ఉండేదని అందరికీ తెలుసు. అటువంటి రవీంద్ర భారతికి హరి కృష్ణ గారు వచ్చిన తర్వాత జానపద కళలకు పెద్దపీట వేశారు.

జానపద కళారూపాలలో ఆశ్రిత, ఆశ్రితేతర కళారూపాలని రెండు రకాలు ఉంటాయి. ఇందులో కేవలం ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి కళాప్రదర్శన చేసేవి ఆశ్రిత కళారూపాలు. ఆశ్రితేతర కళారూపాలు ఒక కులానికి పరిమితం కాకుండా అన్ని కులాలను ఆశ్రయించి ప్రదర్శిస్తాయి. ఈ ఆశ్రిత కళారూపాలు నాటి నుండి నేటి వరకు వారికి తరతరాలుగా సంక్రమించిన గ్రామాల్లోనే ప్రదర్శిస్తూ బయటి ప్రపంచానికి తెలియని స్థితిలో మరుగున పడిపోయాయి .అటువంటి జానపద కళల్ని ప్రత్యేక తెలంగాణ రాకముందు తెలుగు విశ్వవిద్యాలయం వారి జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్ కేంద్రం వాటికి ప్రాచుర్యం కల్పించేది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అటువంటి కళారూపాలకు రవీంద్ర భారతి వేదిక గా బహుళ ప్రాచుర్యం కల్పించడం ప్రారంభించింది.

జానపదకళ బతకాలంటే కళకు అవకాశం, ఆదాయం కల్పిస్తే మనుగడ సాగిస్తుందని ఆశించిన హరికృష్ణ గారు అంతకుముందు కళాకారునికి ఒకరోజు ప్రదర్శన నిమిత్తం పారితోషికంగా 500 రూపాయలు ఇస్తే, వీరు రాగానే ఆ పారితోషికాన్ని రెండింతలు చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు .ప్రారంభంలోనే గోదావరి పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జానపద కళారూపాలకు సాధ్యమైనంతవరకు పుష్కరాల్లో ప్రదర్శన కోసం అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత రవీంద్రభారతి లోపల బయట ప్రత్యేక వేదికను నిర్మించి 125 రోజుల పాటు ’కళారాధన’ పేరిట జానపద కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతి పేరు తెలియని కళారూపాల కళాకారులు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రవీంద్ర భారతికి రావడమే గాక తమ కళను ప్రదర్శించుకునే అరుదైన అవకాశాన్ని, వారి సంస్కృతికి ఒక గుర్తింపును కలిగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమస్తుందనుకునే సమాజానికి తమ కళలు, తమ అస్తిత్వపు మూలాలు పరిరక్షింప బడతాయనే సమాధానం వినిపించింది.

జానపద కళల్ని పరిరక్షించేక్రమంలో హరికృష్ణ గారు రాష్ట్రంలో మరుగున పడిపోయి కొనఊపిరితో ఉన్న కళారూపాలను గుర్తించి ఆయా కళారూపాలను డాక్యుమెంట్ చేసే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కళారూపాలు ఉన్నవి. రాష్ట్రంలోనే మార్కండేయ పురాణం చెప్పే ఒకే ఒక కళాకారుడు పురాణం రమేష్ .అతని కళ మరుగున పడిపోయి కొనఊపిరితో ఉన్న కళారూపాన్ని ప్రోత్సహించి ఆ కళారూపం మీద డాక్యుమెంటేషన్ చేయించడమే కాక ఆ కళారూపాన్ని సజీవంగానే నిలబెట్టి, ఆ కళాకారునికి రాష్ట్రస్థాయి జానపద కళాకారునిగా ఎన్నికయ్యే విధంగా ఆ కళాకారునిలో ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. కిన్నెర కళాకారుని కూడా ప్రోత్సహించారు . ఇవే కాకుండా అంతరించిపోతున్న చెక్కబొమ్మలాట ,కిన్నెర , మాసయ్య పటం కథ,గుఱ్ఱపు పటం కథ, తోటి, ఒగ్గు ,కాకి పడిగల పటం కథ ,చిరుతల రామాయణం, రుంజ ,కొమ్ము ఏనూటి మొదలైన కళారూపాలను డాక్యుమెంటేషన్ చేయించారు.

అంతేగాక రాష్ట్రంలో ప్రత్యేకంగా కనిపించే రాజన్నడోళ్లు, ఒగ్గుడోళ్లకు అధిక ప్రాధాన్యాన్ని కలిగించి అనేక సందర్భాల్లో ప్రదర్శన కల్పించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జానపదకళలకు అధిక ప్రాధాన్యమిస్తూ గోల్కొండ కోట మీద ప్రదర్శనలు ఇప్పించడం విశేషం. రాష్ట్రంలోని దుబ్బు కళాకారులు కేవలం పెద్దమ్మ కథ చెప్పుతూ గ్రామాల కే పరిమితమైన ఆ కళాకారులను సైతం ఏకం చేసి గోల్కొండ కోట మీద దుబ్బు వాద్యం వినిపించేలా చేశారు హరికృష్ణ గారు. జానపద కళాకారుడు ఎవరైనా తన దగ్గరికి వస్తే ఆ కళారూపం గత 60 ఏళ్లుగా మనుగడ కోసం పోరాడిన తండ్లాటను ఆ కళాకారునిలో చూస్తారు హరికృష్ణ గారు .ముందుగా ఆ కళాకారునికి భోజనం పెట్టించి ఆ తర్వాత తన ప్రదర్శనకు అవకాశం కల్పించడం వీరి ప్రత్యేకత. అంతేకాదు కళాకారుణ్ణి ఆ కళారూపం యొక్క చరిత్రకు చిహ్నంగా చూస్తూ గౌరవించటం విశేషం.

వీరు జానపద కళల మీద ఉన్న అభిమానంతో జానపద కళల మీద పరిశోధన చేసిన ప్రముఖులతో రాష్ట్రానికి పరిమితమైన పటం కథల పేరుతో ఒక పుస్తకాన్ని,అలాగే కళా తెలంగాణ పేరుతో జానపద కళారూపాల మీద ఒక పుస్తకాన్ని ప్రచురించి వాటి సంస్కృతిని నిక్షిప్తం చేశారు. ప్రపంచ జానపద దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జానపద జాతర అనే పేరుతో కలళోత్సవాలు నిర్వహించి జానపద కళలకు ప్రాచుర్యం కల్పించారు. ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం తో కలిసి జానపద వాద్యాల ప్రదర్శన ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా తెలంగాణ జానపద కళల విశిష్ఠతను తెలియజేశారు .రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జానపద కళలకు అవకాశాలు కల్పించే దిశగా హరికృష్ణ గారు తెలంగాణ జానపద కళలకు జీవం పోస్తూ వస్తున్నారు.

Spirits of man in the soil of Telangana