Home ఆఫ్ బీట్ పరిమళభరితం ఈ బంధం!

పరిమళభరితం ఈ బంధం!

husband and wife

 

నేల చక్కగా తవ్వి ఎరువు వేసి నీళ్లు పోసి మల్లె చెట్టు నాటితే, ప్రతి రోజూ దానికి సంరక్షణ చేసి చీడపీడలు రాకుండా కాపాడితే కమ్మని సువాసన వచ్చే మల్లెపూవులు చెట్టు నిండా విరిసి కనువిందు చేస్తాయి. పరిసరాలు పరిమళ భరితం చేస్తాయి. ఒక చక్కని బాంధవ్యం కూడా అంతే దాన్ని పెంచిపోషిస్తేనే పదికాలాలు బతుకుతుంది. భార్యాభర్తల బంధం కూడా పెంచిపోషించే మల్లె తీగ వంటిదే. ప్రతి దినం జీవన క్రమంలో ఎన్నో చిన్న చిన్న ఆటంకాలు, ఘర్షణలు వస్తాయి. వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ బాంధవ్యాన్ని పెంచుకుంటూ ఉంటేనే ఆ దాంపత్యం కలకాలం పచ్చని పందిరిలాగా ఉంటుంది.

ఇద్దరూ కలసి గడిపే సమయం చాలా తక్కువే ఉంటుంది. ఉద్యోగాలు, ఇంటిపని, విశ్రాంతి ఇవన్నీ రొటీన్‌గా గడిచిపోతూ ఉంటాయి. ఈ బిజీలైఫ్‌లో సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా డిజిటల్ ప్రపంచం ముఖ్య ఆకర్షణగా కూడా భార్యాభర్తలైనంత మాత్రానా ఇవన్నీ వదిలేసుకోరు. ఎవరి ప్రపంచం వారిదిగా స్మార్ట్‌ఫోన్‌కు తొలిపాత్ర ఇస్తునే ఉంటారు. మాట్లాడుకునే అపురూపమైన సమయం కోసం ఈ గాడ్జెట్లు కాస్త దూరం పెట్టాలి కదా! మొదటి రోజుల్లో భవిష్యత్ గురించి ఎన్నో ఆలోచనలు పంచుకునే సమయం స్మార్ట్‌ఫోన్‌తో వృథా చేయటం నేరమే అవుతుంది. భార్యభర్తల బాంధవ్యాన్నీ పెంచే మొదటి ఎరువు సమయం భార్యభర్తలు ఇద్దరూ కలసి తమకోసం ఒక అద్భుతమైన సమయాన్ని మిగుల్చుకోగలగాలి. ఇవ్వాల్టిని పూర్తిగా ఆస్వాదిస్తూ రేపటి భవిష్యత్ కోసం పునాదులు వేసుకోవాలి. ప్రతినిమిషం జారిపోతే మళ్లీ చేతికి చిక్కదన్న అవగాహనతో ఉండాలి.

భార్యభర్తలు సాధారణంగా హనీమూన్ ప్లాన్ చేసుకునేది ఇద్దరి మధ్య కొత్తదనం పోయి ఒకళ్ల నొకళ్లు అర్థం చేసుకొనేందుకే. కనీసం ఒక సంవత్సరం పాటైనా కొత్త కొత్త ప్రయాణాలు చేయాలి. కనీసం వారానికి ఒకసారైనా ఒక చిన్న రెస్టారెంట్‌కు అయినా ఓ గంటసేపు రిలాక్స్‌గా గడిపేందుకు వెళ్లాలి. ఇద్దరి నడుమ ఒక ఆకర్షణ ఉంటుంది. దాన్ని జీవితం పోగొట్టుకోకుండా ఉండే ప్రయత్నాలు నిరంతరం చేయాలి కూడా. ఇద్దరి మధ్య ఒక తాజాతనం ఒక కొత్త సరదా ఆకర్షణ అన్నీ ఉండాలి. భార్యాభర్తల మధ్య ఎన్నో ఘర్షణలు, వాదాలు వస్తాయి. ఈ వాదప్రతి వాదాలు పోటీ తత్వం కూడా సామరస్య ధోరణితో సాగాలి. ఇద్దరు తమ తోటి వారు గెలిచేలా చూడాలి అనుకోవాలి. పోటీలు లేకుండా ఒకళ్ల మాటలు ఇంకొకళ్లు వినాలి. ఇద్దరి మధ్య ఇద్దరికీ సంబంధించిన ఒక కొత్త కమ్యూనికేషన్, ఒక కొత్త భాష సిద్ధం కావాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఒకళ్ళ మనసు ఇంకొకళ్లకి అర్థం కావాలి.

పరస్పర నిందలు, స్వీయ లోపాలు ఏవీ ఎత్తి చూపుకోవద్దు. ఎప్పుడు రెండోవాళ్లదే తప్పు అన్న ప్రతిపాదనలు కళ్లలో వద్దు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు లాంటివాళ్లు. ఒకళ్ల లోపాలు ఒకళ్లు సవరించుకోగలిగిన తెలివీ చాకచక్యం గలవాళ్లు ప్రపంచంలో నెగ్గుకునేందుకు ఎన్నో నైపుణ్యాలు అలవర్చుకుని ఉంటారు. దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. ఇద్దరూ ఎంతో తెలివితో, కుటుంబాన్ని శ్రద్ధగా కాపాడు కోవాలి. పరస్పరం చేతులు వదలకుండా ఇల్లునే స్వర్గాన్ని రెండు చేతులతో హృదయాన్ని హత్తుకోవాలి. ఇద్దరి మధ్య సానుకూలమైన వైఖరి మాత్రమే ఉండాలి. ప్రతి బాంధవ్యంలోనూ ఎన్నో అసంతృప్తులు, అసహనాలు, చిరాకులు, కోపాలు ఉండి తీరతాయి. కానీ భార్యాభర్తలు ఒక రాజీ ధోరణిలో, అహం అన్న పదానికి ఆస్కారం ఇవ్వకుండా వ్యవహరించాలి.

ఇద్దరి మధ్య ఇతరుల జోక్యం వద్దు. తల్లిదండ్రులు, తోబట్టువులు అయినా భార్యాభర్తల మధ్యన పరాయి వారిలాగా ఉండాలి. ఇద్దరూ చక్కని శృంగార జీవితం అనుభవించాలి. చక్కగా కలిసి మెలిసి వ్యవహరించాలి. చక్కని వాతావరణం సృష్టించుకోవాలి. సారవంతమైన నేలలో ఏపుగా పెరిగే అందమైన మల్లె పొద లాగా ఉండాలి జీవితం.

Spiritual relationship between husband and wife