Thursday, April 25, 2024

‘దటీజ్ ఎస్‌ఆర్’ హైవేనే ఆక్రమించేశారు

- Advertisement -
- Advertisement -

SR University occupies the National Highway

పంచాయతీ నోటీసులు జారీ చేసినా స్పందించని వైనం

రోడ్డు నిర్మించి మూడు నెలలైనా తొలగించని ఫెన్సింగ్
మొక్కలు నాటడానికి సిద్ధమైన సర్పంచ్, అధికారులు
అధికారులను, గ్రామస్తులను ధిక్కరిస్తున్న ఎస్‌ఆర్ వర్శిటీ

మన తెలంగాణ/హసన్‌పర్తి : జాతీయ రహాదారిని ఆక్రమించి ఫెన్సింగ్ నిర్మించడమే కాకుండా, దాన్ని తొలగించాలని గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీచేసినా పట్టించుకోకుండా ఎస్‌ఆర్ యూనివర్శిటీ యాజమాన్యం ధిక్కార ధోరణితో వ్యవహరిస్తోందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ నుంచి వరంగల్‌కు వచ్చే హైవేలో వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో హైదరాబాద్, ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలకు అనంతసాగర్ మీదుగా ధర్మసాగర్ వైపుగా వెళ్లేందుకు నేషనల్ హైవేను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను కరీంనగర్ హైవే నుంచి అనంతసాగర్, మడిపల్లి, ఉనికిచర్ల, ధర్మసాగర్ మీదుగా హైదరాబాద్ నేషనల్ హైవేకు 100 ఫీట్ల హైవే రోడ్డు ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసి మూడు నెలల క్రితం రోడ్డు పనులను సైతం కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అయితే ఈ హైవే రోడ్డును అనుకుని ఉన్న ఎస్‌ఆర్ యూనివర్శిటీ ప్రాంతంలో పనులు జరిగే సమయంలో రోడ్డుకు అవలివైపున వ్యవసాయ పంట పొలాలు ఉండటం కోతలు పూర్తయ్యేవరకూ అవకాశం ఇవ్వాలని కోరడంతో ఆ ప్రాంతంలో 33 ఫీట్ల వెడల్పుతో బిటి డబుల్ రోడ్డు పనులను కాంట్రాక్టర్ పూర్తి చేశారు.

హైవేకు అదనంగా సర్వీసు రోడ్డు, మొక్కలు నాటడం కోసం మరింత రోడ్డును వదిలి పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో హైవేను అనుకుని ఉన్న అనంతసాగర్, మడిపల్లి, ఉనికిచెర్ల, ధర్మసాగర్ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుకు చేర్చి ఉన్న స్థలాలను వదిలేయడంతో రోడ్డు పనులు వేగంగా పూర్తయ్యాయి. అయితే హైవే క్రాస్‌లో ఉన్న ఎస్‌ఆర్ వర్సిటీ వద్దకు వచ్చేసరికి సర్వీసు రోడ్డు, మొక్కలు నాటడం కోసం ఉంచిన 30 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి రోడ్డు పనులకు ముందే ఫెన్సింగ్ వాల్‌ను నిర్మించారు. ఇదిలా ఉండగా, ఈ హైవేపై అనంతసాగర్ గ్రామ సర్పంచ్ బండ అమిత జీవన్‌రెడ్డి నేతృత్వంలో కార్యదర్శి కల్పన ఈ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటేందుకు ఏపిలోని కడియం నర్సరీ నుంచి మూడు వేల మొక్కలను తీసుకొచ్చారు.

అనంతసాగర్ నుంచి కరీంనగర్ హైవే క్రాస్ వరకు రెండున్నర కిలోమీటర్ల పొడవునా ప్రస్తుతం మొక్కలను నాటుతున్నారు. రోడ్డుకిరువైపులా నాటుతూ ఎస్‌ఆర్ వర్శిటీ ఫెన్సింగ్ వాల్ వద్దకు వచ్చేసరికి మొక్కలు నాటడం నిలిపివేశారు. కాగా, రోడ్డు ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్‌ను తొలగించాలని ఎస్‌ఆర్ వర్శిటీ యాజమాన్యానికి మూడురోజులుగా నోటీసులు జారీ చేస్తున్నా చలనం కన్పించడం లేకుండా పోయింది. పంచాయతీ నోటీసులను ఫెన్సింగ్ వాల్‌కు అంటించారు. ఒక పక్క పంచాయతీ సిబ్బంది నోటీసులు అంటిస్తుంటే.. వర్శిటీ యాజమాన్యం మాత్రం ఆ నోటీసులను తొలగిస్తుందన్న వాదన స్థానికంగా విన్పిస్తోంది. ఈ వ్యవహారంపై గ్రామస్తులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నోటీసులిచ్చినా తొలగించడం లేదు

నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం కోసం గ్రామంలోని రోడ్డు వెడల్పు చేస్తున్నామని, అయితే.. ఎస్‌ఆర్ వర్శిటీ వద్దకు వచ్చే సరికి వర్శిటీ యాజమాన్యం రోడ్డును ఆక్రమించిన స్థలంలో ఫెన్సింగ్ చేశారని దాన్ని తొలగించాలని నోటీసులు జారీచేసినా వారు స్పందించడం లేదన్నారు. ఫెన్సింగ్‌వాల్‌కు నోటీసులు అంటిస్తుంటే వాటిని చించివేస్తున్నారని తదుపరి చర్యల కోసం సిద్ధమవుతున్నట్లు కార్యదర్శి కల్పన వివరించారు.

                                                                                            -గ్రామ కార్యదర్శి కల్పన

ఫెన్సింగ్‌ను తొలగించాలి

నేషనల్ హైవేరోడ్డును ఆక్రమించి తమ సొంతానికి ఫె న్సింగ్ చేసిన ఎస్‌ఆర్ వర్శిటీ యాజమాన్యం తక్షణమే దా న్ని తొలగించాలని, లేకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు ఫెన్సింగ్‌ను తొలగిస్తామని అనంతసాగర్ గ్రామ సర్పంచ్ బండ అమిత జీవన్‌రెడ్డి హెచ్చరించారు. నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం జరగడం వల్ల సమీప గ్రామాల ప్రజలకు రవాణ సౌకర్యంలో మెరుగవుతుందన్నారు. మొదటి హెచ్చరికగా పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీచేశారని, అప్పటికి తొలగించకపోతే చట్ట ప్రకారం ఆక్రమణలను కూల్చి వేసి రోడ్డును అభివృద్ధి చేస్తామన్నారు.
                                                                                  -సర్పంచ్ బండ అమిత జీవన్‌రెడ్డి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News