Home దునియా వ్యాసపురే.. బాసరగా మారింది..!

వ్యాసపురే.. బాసరగా మారింది..!

basara-templeమన దేశంలో పౌరాణిక, ఐతిహాసిక సంబంధం ఉన్న ప్రాచీన సరస్వతీ ఆలయాలు రెండు. మొదటిది కశ్మీర్‌లోని శక్తిపీఠం, రెండోది బాసరలోని ఆలయం. ఇవికాక చారిత్రక ప్రాధాన్యమున్న మధ్యయుగపు ఆలయాలు కొన్ని అయితే, ఇటీవలి కాలంలో నిర్మించిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అయితే ప్రస్తుతం స్వత్రంత్ర భారతంలో అందుబాటులో ఉన్నవి నిర్మల్ జిల్లాలో గోదావరి ఒడ్డున బాసరలోని ఆలయం ఒక్కటే.

వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణం రచిస్తుప్పప్పుడు శక్తిని వర్ణించడానికి తపఃశక్తికి తోడుగా ప్రశాంత వాతావరణం కావలసి వచ్చింది. దానితో వివిధ ప్రాంతాలు తిరిగి ఆయన ప్రస్తుతం బాసర ఉన్న ప్రదేశం చేరుకున్నాడు. ఈ ప్రదేశం తనకు అనుకూలంగా ఉంటుందనుకున్న వ్యాసులవారు కొంచెం సేపు ధ్యానం చేశారు. ధ్యానంలో శక్తి రూపం లీలామాత్రంగా కనిపించి మాయమైంది. దాంతో ఆయన ఆ శక్తి రూపం ఎవరిదోనని దివ్యదృష్టితో చూడగా సరస్వతీ అమ్మవారు కనిపించింది. అమ్మవారిని పూర్తి రూపం చూపక పోవడానికి కారణం తెలుపమనగా భూలోకంలోని కొన్ని పాపకార్యాలవల్ల తన రూపం చూపలేక పోయాననీ, రోజూ గోదావరి నదిలో ధ్యానం చేసి గుప్పెడు ఇసుకను తెచ్చి తనకు నచ్చిన స్థానంలో వేయాలని దాంతో తన పూర్తి రూపం తయారవుతుందనీ తెలిపింది. వ్యాసులవారు అలాగే గోదావరీ తీరాన ఉన్న గుహలో తపస్సు చేయడం మొదలు పెట్టి, అమ్మవారు చెప్పినట్టుగా గుప్పెడు ఇసుక ఒకచోట పోయటం చేశారు. కొన్నాళ్లకు ఆ ఇసుక సరస్వతీ రూపాన్ని సంతరించుకొంది. ఆ విగ్రహానికి జీవం పోయడం కోసం సరస్వతీదేవి వ్యాసులవారికి జ్ఞాన బీజాన్ని ఉపదేశించింది. ఆ ప్రకారంగా జ్ఞాన సరస్వతీ మాత ప్రతిష్టితమైంది.

మరొక కథనం ప్రకారం కురుక్షేత్రం యుద్ధానంతరం వ్యాసమహర్షి తన కుమారుడు శకుని, కొందరు శిష్యులతో మనశ్శాంతి కోసం తిరుగుతూ ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్దుడై తపస్సు చేయడం చేయడం మొదలు పెట్టాడు. ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి మూడు శక్తి రూపాలైన అమ్మలకు ఆలయం నిర్మించమని చెప్పింది. అదే విధంగా వ్యాసులవారు గోదావరిలోని ఇసుకను మూడు గుప్పెళ్లతో తెచ్చి ముగ్గురమ్మలనూ ప్రతిష్టించాడు.

వాల్మీకి మహర్షి ఇక్కడే నివసించి, అమ్మవారిని ప్రతిష్ఠించి రామాయణం రచించాడని మరో పురాణం కథనం. ఆలయం దగ్గరలో ఉన్న ఒక సమాధిని ఆ వాల్మీకిగా చెప్పుకుంటారు. వ్యాసుల వారి వల్ల నిర్మితం కాబట్టి ఈ ప్రాంతానికి “ వ్యాసపురి” అనే పేరు ఏర్పడి క్రమేపి “ వాసర” తరువాత మరాఠీ భాషా ప్రభావంతో “ బాసర” గా మారినట్లు తెలుస్తున్నది.

చరిత్రకు తెలిసినంతవరకూ బాసరలోని దేవాలయాన్ని నాందేడ్ ప్రాంతాన్ని పాలించిన ‘బిజ్జలుడు’ అనే రాజు కట్టించినట్లు తెలుస్తుంది. పరమత రాజులకు పాలనలో ఈ ఆలయంపై దాడి జరిగి ఆలయం, మహాలక్ష్మి విగ్రహం ధ్వసమయింది. మక్కాజీ పటేల్ అనే మహానుభావుడు వారిని ఎదుర్కొని తరిమివేసి, ఆ ఆలయ పునర్నిర్మాణం చేశాడు. గర్భగుడి పక్కన నమస్కరిస్తున్న భంగిమలో ఆయన విగ్రహం ఉంది. ఆలయానికి పశ్చిమ భాగంలో మహాకాళీ దేవాలయం, దక్షిణ దిశలో వ్యాస మందిరం ఉన్నాయి. వ్యాస మందిరంలో వ్యాసులవారి విగ్రహం, వ్యాసలింగము పేరుతో ఒక శివలింగమూ ఉన్నాయి. ఆలయానికి సమీపంలో 8 పుష్కరిణిలు ఉన్నాయి. వాటి పేర్లు ఇంద్రతీర్థం, సూర్య తీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేశతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం. శ్రీపంచమి, వ్యాసపూర్ణిమ, దేవీనవరాత్రులు, శివరాత్రి పర్వదినాలలో అమ్మవారికి విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఈ క్షేత్రం మహాప్రసిద్ధి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నైరుతీ మూలన మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నప్పటికీ బాసరకు కొద్ది దూరంలోనే కర్ణాటకల రాష్ట్ర సరిహద్దు కూడా ఉంది. అందుచేత మూడు రాష్ట్రాల భక్తులూ ఈ క్షేత్రానికి వస్తుంటారు.
                                                                                              -వడ్డేపల్లి మహేందర్

sri gnana saraswathi temple basara