Home దునియా బృందావనాన్ని తలపించే ఉడిపి

బృందావనాన్ని తలపించే ఉడిపి

Sri Krishna

 

శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం కోసం ఈ భూమ్మీద అవతరించాడు. మధురలో పుట్టి, రేపల్లెలో పెరిగి, బృందావనంలో సయ్యాటలాడిన ఆ స్వామి జీవనగాథంతా అద్భుత లీలా విశేషాలకు వేదికగా తోస్తుంది. ఈ సృష్టిలో ‘పరమాత్మను నేనే’ అని చెప్పి, భగవద్గీత ద్వారా తన సందేశాన్ని సమాజానికి అందించాడు. ఆ స్వామి అవతరించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపి.
మన దేశంలో ఉన్న శ్రీకృష్ణుని సుప్రసిద్ధ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం బృందావనాన్ని తలపిస్తుంది. ద్వైతమత స్థాపకులు శ్రీమధ్వాచార్యులు అవతరించిన స్థలం భాగ్యత క్షేత్రం. దానికి సమీపంలో ఉన్నదే ఉడిపి. ఉడిపిని పూర్వకాలంలో శివళ్లి అని పిలిచేవారు.

ఇది దక్షిణ కర్ణాటక ప్రాంతంలో మంగళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయాలలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఒకటి. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణతో ఉండే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. శ్రీమధ్వాచార్యులు తనకున్న దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను రక్షించినప్పుడు ఓడలోని నావికుడు వీరికి గోపిచందనం మూటను కానుకగా సమర్పించాడు. అందులో చందనంతో పాటూ చిన్ని కృష్ణుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని మధ్వాచార్యులు 800 సంవత్సరాల క్రితం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు.

అంత్యకులజుడైన కనకదాసు ఈ కృష్ణ దర్శనం చేసుకుని తరించాలని ప్రాధేయపడగా, పూజారులు నిరాకరించినప్పుడు, కనకదాసుకి సాక్షాత్తు ప్రత్యక్ష దర్శనమిచ్చిన శ్రీ కృష్ణ విగ్రహమే ఈ విగ్రహం. పరమ భక్తుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై దివ్యదర్శనాన్ని సాక్షాత్కరించాడు.
ఆనాడు కనకదాసుకు గవాక్షం గుండా దర్శనమిచ్చిన కిటికీలో నుంచే భక్తులు ఈనాటికి కృష్ణ దర్శనం చేసుకుంటారు. దీనినే కనకుని కిటికి అని పిలుస్తారు. కనకదాసు కృష్ణుని ప్రార్ధించిన చోట ఒక దివ్య మంటపాన్ని నిర్మించారు. ఇదే కనకదాసు మంటపం.

శ్రీమధ్వాచార్యులవారు ఏర్పాటు చేసిన మఠాల నుంచి ఎంపికైన వారే రెండు సంవత్సరాలకొకసారి ఉడిపి శ్రీకృష్ణుని దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12వ శతాబ్దంలో శ్రీమధ్వాచార్యులవారు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. ఆ ఎనిమిది మఠాలలో శ్రీకృష్ణమఠంగా పేరుపొందిన శ్రీ కృష్ణ ఆలయం కూడా ఒకటి.
ఒకప్పటి శ్రీకృష్ణమఠంగా, ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిలుచుకుంటున్న ఈ ఆలయమంతా కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించారు. ఈ ఆలయం ముందు ఒక గోపురాన్ని నిర్మించడం జరిగింది.

ఈ ఆలయం మహత్తు చాలా గొప్పది. శ్రీమధ్వాచార్యులవారు ఇక్కడ శ్రీకృష్ణభగవానుడ్ని బాలకృష్ణ రూపంలో ప్రతిష్టించారు. ఆలయం బయట, ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం.నిమ్నజాతికులస్థుడైన కనకదాసు భక్తికి మెచ్చిన శ్రీకృష్ణభగవానుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిస్తాడు. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమధ్వతీర్థం ఉంది. అలనాటి దేవాలయ సంస్కృతి, సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపమొకటి ఉంది. ఈ మండపంలో శ్రీమధ్వాచార్యుల దివ్య ప్రతిమ ఒకటి ఉంది.

ఉత్సవాలు, పండుగలప్పుడు ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. తీర్థానికి ఒడ్డున ఒకవైపున భగీరథుని మందిరం ఉంది. ప్రధానాలయంలో ఎడమవైపు భాగాన చెన్నకేశవస్వామి మందిరముంది. ప్రధానాలయమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, అలనాటి పనితనానికి నిదర్శనంగా కానవచ్చే కొయ్యశిల్పాలు, ఇవన్నీ భక్తులను అనితర సాధ్యమైన లోకాలకు తీసుకుని వెళతాయి. గర్భాలయం ముందు భాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దానికి సమీపంలోనే తీర్థ మండపం ఉంది. ఈ తీర్థ మండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకుల పొడి తదితరాలను ఉంచుతారు. పూజలు నిర్వహించే సమయంలో ఈ తీర్థ మండపంలో జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో ఈ మండప శోభ వర్ణనాతీతం.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయ సింహద్వారం తూర్పుముఖంగా ఉన్నప్పటికీ స్వామివారు మాత్రం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చెరియొక చేత ధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది.గర్భాలయంలో కొలువుదీరిన బాలకృష్ణుని దర్శనం పూర్వ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు.

గర్భాలయమంతా నిత్యం శ్రీకృష్ణ నామస్మరణంతో మారుమోగుతుంది.గర్భాలయం బయట శ్రీమధ్వాచార్యుల దివ్యమంగళ మూర్తి ఉంది. ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క శ్రీమధ్వాచార్య పీఠం ఉంది. అలనాటి కట్టడాలను స్ఫురణకు తెచ్చే ఈ మఠ శోభ వర్ణనాతీతం. ఇక్కడే ఆంజనేయస్వామివారి భవ్య మందిరం ఒకటి ఉంది.ఈ మందిరంలో కొలువుదీరిన ఆంజనేయస్వామి వీరాంజనేయస్వామి అవతారంలో కనిపిస్తారు. ఇదే ప్రాంగణంలో మరో పక్క సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువుదీరాడు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని వాదిరాజస్వామి ప్రతిష్టించారు.ఇదే ప్రాంగణంలో మరో పక్క నవగ్రహాలయం, గోశాల, గీతామందిరాలు ఉన్నాయి. భక్తులు ఆయా మందిరాలను భక్తితో దర్శించుకుని తరిస్తుంటారు.

ఉత్సవాలు, పండుగలు :
ఉడిపిలో ఉత్సవాలకు కొదువ ఉండదు. ఏటా ఈ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఆ ఉత్సవాల శోభను స్వయంగా చూడాలే కానీ వర్ణింప శక్యం కాదు. ఈ సందర్భంగా ఆలయంలో పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీమధ్వతీర్ధంలో స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఓ అపురూపమైన ఆధ్యాత్మికానందాన్ని ఈ ఉత్సవాలు భక్తులకు ఇస్తాయి. అలాగే ప్రతీ కార్తీక మాసంలో ఈ ఆలయంలో లక్షదీపోత్సవాన్ని నిర్వహిస్తారు.

లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరిగే ఈ లక్ష దీపోత్సవ పూజ నేపథ్యంలో ఆలయమంతా జ్యోతులతో తేజోవిరాజమానమవుతుంది. అలాగే మకర సంక్రాంతి ఉత్సవాలను కూడా ఈ ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆద్యంతమూ ఆధ్యాత్మిక సొబగులను అద్దే ఈ ఉత్సవాలను స్వయంగా చూడడానికి భక్తులు పోటీ పడతారు. అలాగే భీష్మ ఏకాదశి వేడుకలను కూడా ఈ ఆలచంలో ఘనంగా నిర్వహిస్తారు.

ఇతర ఆలయాలు :
ప్రధానాలయానికి సమీపంలో అనంతేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. అతి పురాతన ఈ ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం భీముడు నిర్మించాడని ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అనంత పద్మనాభ స్వామి వారు లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడకు సమీపంలోనే చంద్రమౌళీశ్వరస్వామి వారి ఆలయం ఉంది. గర్భాలయంలో కొలువుదీరిన చంద్రమౌళీశ్వర స్వామి దర్శనం సర్వ ఐశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావించి నీరాజనాలర్పిస్తారు.
ఓ విశేషమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే మహత్తర క్షేత్రం ఉడిపి. ఈ క్షేత్రంలోని శ్రీకృష్ణ దర్శనం పూర్వ జన్మల పుణ్యఫలం.

భోజన, వసతి సదుపాయాలు :
ఉడిపిలో భోజన వసతి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఆలయంలో రోజూ రుచికరమైన అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే బయట బస చేయడానికి, భోజనానికి రుచికరమైన అనేక హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి.?

ఈ క్షేత్రం హైద్రాబాద్ నుంచి 767 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఈ క్షేత్రానికి విమానంలో కూడా చేరుకోవచ్చు, విమానంలో వెళ్లాలనుకునేవారు మంగుళూరు వరకు వెళ్లి అక్కడి నుంచి ఉడిపి చేరుకోవచ్చు.

Sri Krishna incarnated in Udupi