Home ఆఫ్ బీట్ కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం

3న కృష్ణాష్ట్టమి సందర్భంగా..

Krishnashtami

శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన పుణ్యతిథే కృష్ణాష్ట్టమి. ఈ రోజున ఉదయాన్నే స్నానపానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో శ్రీ కృష్ణుని పూజించాలి. పూజ పూర్తయ్యాక భాగవతాది గ్రంథాలలోని కృష్ణలీలాఘట్టాలని పఠించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణవిగ్రహాన్ని ఊరేగించి, తర్వాత ఊయలలో ఉంచాలి. దేవకీదేవి శయ్యపై పడుకుని బాలకృష్ణుడికి పాలు ఇస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని అలంకరించిపూజించడం మంచిది. కృష్ణాష్టమి నాడు కృష్ణుని అర్చించడం వల్ల సకల పాపాలు హరించి పోవడమే గాక మోక్షం కలుగుతుందని, అఖండ విజయాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు చిన్ని కృష్ణునికి ఇష్టమైన పాలు, పండ్లు, వెన్న, మీగడ మొదలైనవి
నైవేద్యంగా సమర్పిస్తే సమస్త కోరికలు నెరవేరతాయని ప్రతీతి.

‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. వాస్తవానికి ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అనే అర్థాలున్నాయి. వాటిని పాలించేవాడు అంటే కాపాడే వాడు కాబట్టి కృష్ణుడు గోపాలకృష్ణుడయ్యాడు.

కృష్ణ లీలలు అనంతం..ః పరిపూర్ణావతారమైన కృష్ణావతారంలో శ్రీ కృష్ణుడు అవతరించినది మొదలు నిర్యాణం చెందేవరకు ఎనలేని లీలలు చూపాడు. కృష్ణుని లీలలన్నీ మానవాతీతమైనవి. పరమార్థపూరితమైనవీను. నోటిలో పదునాలుగు భువన భాండాలను చూపి దైవత్వాన్ని చాటుకున్నాడు. గోవర్థనగిరిని చిటికెన వేలితో నిలబెట్టి, దేవతలందరి వందనాలు అందుకున్నాడు. లోక కంటకునిగా తయారైన మేనమామను సైతం మట్టుపెట్టి దుష్టశిక్షణలో వారు, వీరని భేదం లేదని నిరూపించుకున్నాడు. అహంకారంతో అతిశయిస్తూ, గోవులను, గోపబాలురను భయభ్రాంతులను చేస్తున్న కాళీయుడనే సర్పరాజు తలపై మర్ధించి అహంకారాన్ని అణచాడు. రామావతారంలో ఏకపత్నీవ్రతంలో తీర్చలేకపోయిన రుషుల కోర్కెను కృష్ణావతారంలో గోపాలకృష్ణునిగా తీర్చాడు. ద్రౌపది మాన సంరక్షణ చేసి ఆశ్రిత వత్సలుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని నివారించేందుకు రాయబారం నెరపాడు. సత్యభామ వద్ద ఉన్న కొండంత ధనం కన్నా, రుక్మిణీ దేవి అచంచలమైన భక్తి విశ్వాసాలే గొప్పవని నిరూపించాడు. కర్తవ్య నిర్వహణను మించిన ధర్మాచరణ మరొకటి లేదని విశ్వరూప ప్రదర్శనతో అర్జునునికి గీతామృతాన్ని బోధించి
జగద్గురువయ్యాడు.

ముక్తికావ్యం భాగవతం: అశాశతమయిన ఐహిక బంధాలనుంచి దూరం చేసి శాశ్వతమైన మోక్షప్రాప్తిని పొందేందుకు దోహదం చేసే శ్రీమద్భాగవతానికి మూల పురుషుడు శ్రీకృష్ణుడు. భాగవతం వినడం, చదవడం, రాయడం వల్ల అంతులేని కష్టాలు సైతం తలవంచుతాయి. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, మార్కండేయుడు, ధ్రువుడు, కుచేలుడు వంటి ఎందరో పుణ్యచరితలు ఉన్న భాగవతం ముక్తి కావ్యంగా ఖ్యాతి గాంచింది.
పవిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మసంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగే

ధర్మానికి హాని కలిగినప్పుడు, చెడు చేతిలో మంచి బాధపడుతున్నప్పుడు, దుష్టులను శిక్షించి సాధు, సజ్జనులను రక్షించేందుకు ఇలపై అవతరిస్తానని చెప్పాడు. తాను చెప్పిన మాటను నెరవేర్చేందుకే కృష్ణావతారం ఎత్తాడు. ముక్తికావ్యానికి మూల పురుషునిగా నిలిచాడు.
కృష్ణాష్టమి పర్వదినం నాడు శ్రీకృష్ణుని బోధామృతమైన గీతా పఠనం అత్యంత అవశ్యక మైనది. కృష్ణుని పూజించడమే కాదు. ఆయనలోని కొన్ని మంచి లక్షణాలయినా అలవరచు కోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యానుగ్రహాన్ని పొందగలం.