Home భద్రాద్రి కొత్తగూడెం కల్యాణ వైభోగమే……..

కల్యాణ వైభోగమే……..

కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం
రామనామ స్మరణతో మార్మోగిన భద్రగిరి
తిలకించి పులకించిన భక్తజనం
పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన దేవాదాయ శాఖమంత్రి

దక్షిణ భారత అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరి రామనామ స్మరణతో మార్మోగింది. సీతారాముల కల్యాణం ఆధ్యంతం కమనీయంగా సాగింది. భక్తజన సందోహంతో గోదారమ్మ పులకించింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులతో కరకట్ట కళకళలాడింది. కల్యాణ మండపమైన మిథిలాస్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. పురోహితుల వేదమంత్రోశ్చరణలు, భక్తుల రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ
జగదభి రాముని కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. లోక కల్యాణాన్ని తిలకించిన భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయింది. సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమర్పించారు.

Sita-Ramula-Kalyanam

భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణం బుధవారం అత్యంత వైభవంగా సాగింది. లోక కల్యాణార్థం జరిగే వివాహ వేడుకను చూసేందుకు రాష్ట్ర నలు
మూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్. ఒడిస్సా, మహా రాష్ట్రల నుంచి సైతం భక్తులు తరలి వచ్చారు. తమ ఇలు వేల్పయిన శ్రీ సీతారాముల పెళ్లి కన్నులారా తిలకించిన భక్తులు తన్మయత్వంతో నిండిపోయారు. కల్యాణ మండప ప్రాంగణమైన మిథిలా స్టేడియం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. ఉదయమే పావన గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తల నీలాలు సమర్పించి మోక్కులు చెల్లించుకున్నారు. రామనామ స్మరణతో ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నేరుగా స్వామివారి పెళ్లి తంతును తిలకించేందుకు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు.

భక్తుల రాకతో ఆ ప్రాంగణం సందడిగా మారింది. ఉదయం 10 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, కోలాట నృత్యాల నడుమ మండపానికి తోడుకోచ్చారు. స్వామివారి కళ్యాణ మండపంలోనికి వేంచేస్తున్న తరుణంలో ఒక్క సారిగా భక్తులు జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణ చేశారు. ఈ సంఘటనతో కళ్యాణ మండపం భక్తి పారవశ్యంతో తొనికిసలాడింది. స్వామివారి ఉత్సవ మూర్తులను శాస్త్రోక్తంగా వేదపండితులు పెళ్లి పీటలపై కూర్చుండబెట్టి నూతన వస్త్రాలు ధరింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిం చేందుకు దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భద్రాచలం వచ్చారు. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు ఆలయానికి చేరుకున్న వారికి వేద పండితులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం మిధిలా స్టేడియానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకుని వచ్చి అత్యంత భక్తిశ్రద్దలతో సమర్పించారు. కళ్యాణ మండపంలో అర్చకులు విశ్వక్షేణపూజ, పుణ్యహావచనం నిర్వహించారు. మంత్రపూజలతో కళ్యాణానికి వినియోగించే సామాగ్రికి సంప్రోక్షణ చేశారు. 12 దర్భాలతో అల్లిన గర్భదోష తాడును సీతమ్మ వారి నడుముకుబిగించారు.

ఈ రకమైన దర్భాల తాడును కట్టడం వల్ల స్త్రీలలో గర్భదోశ నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సీతారాముల కుడి చేతులకు రక్షాబంధనం వేశారు. పరిమళ భరిత తీర్థంతో పుష్పోదికం గావించారు. వేదపండితులు రామాలయ విశిష్ఠత, లోకకళ్యాణార్థం ఆరుబయ నిర్వహించే స్వామి వారి కళ్యాణ తంతును, భక్తరామదాసు స్వామికి చేసిన సేవలను వివరించారు. అదే విధంగా రామదాసు సీతమ్మకు చేయించిన మంగళసూత్రాలు, పచ్చల పతకం, చింతాకు పతకం, కిలుకు తురాయిల వివరాలను భక్తులు తెలిపి వాటిని సీతారామలక్ష్మణులకు అలంకరించారు.

అదే విధంగా రామ మాడను చూపిస్తూ దాని విశిష్టతను వివరించారు. దీనిని వినిన భక్తులు స్వామి నామస్మరణలో మునిగితేలారు. వధూవరుల గోత్ర నామాలతో పూజలు చేసిన అనంతరం కన్యాదాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. రమారమి 12 గంటల సమయంలో పునర్వసు నక్షత్రలో అభిజిత్ లఘ్నమందు ఉత్సవ విగ్రహాలపై జిలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. రామదాసు చేయించిన మంగళ సూత్రాలను భక్తులు చూపిం చి దూపదీప నైవేద్యాలు, మంగళవాయిధ్యాల సందడిలో సీతమ్మ తల్లికి మాంగళ్యధారణ నిర్వహించారు. తమిళనాడులోని శ్రీరంగంలో గల
రంఘనాధ స్వామి ఆలయం నుంచి వచ్చిన శేషదండను సీతారా ములకు కలిపి వేశారు.

అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు కార్యక్ర మాన్ని వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ తంతులో భాగంగా వధూ, వరులకు బ్రహ్మబంధనం చేశారు. ప్రత్యేక పద్యాలు ఆలపిస్తుండగా అర్చక స్వాములు బంతులాట ఆడారు. సీతారాములకు కర్పూర నీరాజనం చేశారు. చెతుర్వేదాలతో రామచంద్ర ప్రభువు సీతా దేవికి ఆశీర్వచనం అందజేశారు. శ్రీరంగంలోని రంఘనాథుని ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, చినజీయర్ స్వామిమఠం, శృంగేరి పీఠం, మైసూర్ దత్తపీఠం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరుపున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

హాజరు కానిముఖ్యమంత్రి…

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులు బుధవారం భద్రాద్రిలో జరిగిన సీతారాముల కళ్యాణానికి హాజరు కాలేక పోయారు. నేత్రానికి శస్త్ర చికిత్స జరిగినందున హజరు కానట్లు తెలుస్తోంది. గత ఏడాది ఒక్క రోజు ముందుగానే భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి హౌసింగ్ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. ఆ మరుసటి రోజు సతీసమేతంగా కళ్యాణానికి ప్రభుత్వ తరుఫున హాజరై స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సారి ముఖ్యమంత్రి రాకపోవడంతో భక్తులు కూడా నొచ్చుకున్నారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, హైకోర్టు న్యాయమూర్తి బీష్వాల్, కెసిఆర్ సతీమణి శోభ, మనవడు హిమాన్షు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎంపి సీతారామ్ నాయక్, ఎంఎల్‌ఎలు సున్నం రాజయ్య, జలగం వెంకట్రావు, కోరం కనకయ్య, నర్సంపేట శాసన సభ్యుడు దొంతు మాధవరెడ్డి, ఎంఎల్‌సిలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆర్‌టిఎ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, డిజిపి అనురాగ్ శర్మ, ఐజి నాగిరెడ్డి, ఎస్‌పి అంబర్ కిషోర్ ఝా, ఎఎస్‌పి సునీల్ దత్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.