Wednesday, March 22, 2023

శ్రీదేవి ఇక లేరు

- Advertisement -

sri

కథగా, కల్పనగా కనిపించి మాయమైన ఓ దొరసాని

దుబాయ్‌లో పూర్తయిన పోస్టుమార్టం, భౌతిక కాయం నేడు ముంబయికి రాక

అశేష అఖిల భారత చలనచిత్ర ప్రేక్షక హృదయ సామ్రాజ్యాన్ని ఎదురు లేకుండా దశాబ్దాల పాటు పరిపాలించి అతిలోక సుందరిగా ముద్ర వేసుకున్న నటీమణి శ్రీదేవి శనివారం రాత్రి దుబాయ్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.  దుబాయ్: అందానికి అందంగా నిలిచిన ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులతో మేనల్లుడి పెళ్లి వేడుకకు దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి శనివారం అర్థరాత్రి తరువాత ప్రాణాలు కోల్పోయా రు. అప్పటివరకూ అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లిన శ్రీదేవి ఆ తరువాత గుండెపోటు రావడంతో కుప్పకూలి చనిపోయినట్లు వెల్లడైంది. ఆమెను స్థానిక రషీద్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.ఆదివారం తెల్లవారు జాము నే ఈ విషాద వార్త తెలియడంతో దేశ విదేశాలలోని కోట్లాది మంది అభిమానులు తల్లడిల్లిపొయ్యారు. పలువురు సినిమా ప్రముఖులతో పాటు సామాన్యుల వర కూ అంతా చాలా సేపటి వరకూ ఈ వార్త నిజంకాదనే భా వించారు. అయితే బాల నటిగా వెండితెరకు వచ్చి, పదహారేళ్ల అమ్మాయిగా, తరువాత పాతికేళ్ల పడతిగా, ప్రేయసిగా, గృహిణిగా ఎన్నో వైవిధ్య భరిత చిత్రాలలో నటించి హీరోయిన్లలో తిరుగులేని సూపర్ స్టార్‌గా మారిన శ్రీదేవి ఇక లేరనే విషయం నిర్థారణ అయింది. 55 సంవత్సరాల శ్రీదేవి ఆకస్మిక మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. భర్త బోనీకపూర్, కూతు రు ఖుషీతో కలిసి పెళ్లి వేడుకకు వెళ్లిన సమయంలోనే శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో దేవకన్యగా నటించిన శ్రీదేవి మానవా అనే పలకరింపుతో , పలు చిత్రాలలో కంటి చూపులతో ఒలికించిన సోయగాలతో కోట్లాది మందిని అభిమానులుగా మలుచుకున్నారు. దక్షిణాదికి చెందిన ఈ నటి బహుభాషా నటిగా వెలిగి, బాలీవుడ్‌లో కూడా తన ఆధిక్యతను చాటుకున్నారు. మేనల్లుడు మొహిత్ మర్వా పెళ్లికి హాజరయ్యేందు కు శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. 1978లో సోల్వా సావన్ సినిమాతో శ్రీదేవి బాలీవుడ్‌లో ప్రవేశించారు.

బాలనటిగా కూ డా తెలుగు, తమిళ సినిమాలలో నటించిన శ్రీదేవి ప్రముఖ తెలుగు, తమిళ, హిందీ సినిమా హీరోలతో జంటగా నటిం చి అందరిని మెప్పించారు. సోల్వా సావన్ తరువాత ఆమె ఐదేళ్లకు హిందీలో హిమ్మత్ వాలా సినిమాలో జితేంద్రతో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా బ్రహ్మండమైన రీతి లో విజయం సాధించడంతో ఇక ఆమె వెండితెరపై బంగారంగా మెరిసింది. ఆమె నవ్వులు జలతారు అంచుల వెన్నెలులుగా మారాయి. కమల్‌హాసన్‌తో ఆకలి రాజ్యం , మూం డ్రాం పిరై (వసంతకోకిల)సినిమాలో నటించిన శ్రీదేవి అమితాబ్ బచ్చన్‌తో కూడా పలు చిత్రాలలో నటించారు. వసంత కోకిలలో బుద్ధిమాంద్యం ఉన్న యువతి పాత్రలో జీవించిన శ్రీదేవికి పలు అవార్డులు వచ్చాయి. లోకం తెలియని మనస్సుతో ఉండే ఒక యువతి హావభావాలు, ఆమె ప్రకృతి పట్ల కనబరిచే ఆత్మీయత వంటి వాటిని తన నటనా ప్రతిభతో శ్రీదేవి పండించింది. ప్రేమాభిషేకం సినిమాలో శ్రీదేవి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో అత్యధికంగా హీరో కృష్ణతో జంటగా నటించిన శ్రీదేవి తరువాత యువహీరోలతో కూడా జోడిగా జోరుగా నటించింది.

రామ్ గోపాల్ వర్మ సినిమా క్షణక్షణంలో ఆమె నటన వెండితెరకు జిలుగులను అందించింది. హిందీలో శ్రీదేవి ఉంటే సిరి పంటనే అనే పేరు తెచ్చుకున్నారు. సిరిమల్లెపువ్వా సిరిమల్లె పువ్వా అనే పాట, నీ కళ్లు చెపుతున్నాయి. అనే పలు పాటలు ఆమె అందానికి చరణాలుగానే నిలిచాయి. భాషాతీతంగా అందరి గుండెల్లో గుచ్చుకున్నాయి. హిందీలో మవాలీ, తోఫా, మిస్టర్ ఇండియా, చాందినీ వంటి సినిమాలు ఆమెను సూపర్ స్టార్‌గా నిలిపాయి. వసంతకోకిల సద్మాగా హిందీలో వచ్చింది. ఛాల్‌బాజ్ వంటి పలు సినిమాలు ఆమె ప్రతిభకు అద్దం పట్టాయి. గత ఏడాది ఆమె చివరి సినిమా వచ్చింది మామ్ అనే ప్రతీకార ఇతివృత్తపు సినిలో శ్రీదేవి నవాజుద్దిన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నాతో కలిసి నటించారు. అంతకు ముందు ఇంగ్లీషు వింగ్లీష్ సినిమాలో మధ్య తరగతి మహిళగా ఇంగ్లీషు నేర్చుకోవాలనేతపన గల మహిళగా ఆమె చేసిన నటనకు ఆద్యంతం మంచి స్పందన దక్కింది. ఈ సినిమా కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆమె బాలీవుడ్ ప్రవేశంతో యావద్భారత ప్రఖ్యాత నటిగా పేరొందారు. తమిళ సినిమాలో బాల నటిగా 1969లో తునైవాన్ సినిమాలో తొలిసారిగా సినిమాలో నటించారు. తరువాతి ఏడాదే హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు జాహ్నవీ కపూర్ ప్రస్తుతం హిందీ సినిమాల ద్వారా సినిమా రంగానికి పరిచయం అవుతోంది. ముంబైలో ఒక సినిమా షూటింగ్‌లో జాహ్నవీ ఇప్పుడు ఉన్న సమయంలోనే భర్త బోనీ, చిన్నకూతురు ఖుషీ వెంట ఉన్నప్పుడే శ్రీదేవి మృతి చెందారు. గుండెపోటుతో కుప్పకూలి చనిపోయినట్లు తొలుత వార్తలు వెలువడినప్పటికీ కుటుంబ సభ్యులు ఆ తరువాత ఆమెకు గుండె సంబంధిత జబ్బులు ఏమీ లేవని, ఇంతకు ముందెన్నడూ ఈ సమస్య రాలేదని తెలిపారు. షారూక్ ఖాన్ హీరోగా రాబోయే జీరో సినిమాలో శ్రీదేవి ప్రత్యేక పాత్రలో నటించారు. ఆమె పాత్ర చిత్రీకరణ చాలా రోజుల క్రితమే పూర్తి అయింది. ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుంది.
రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖుల సంతాపాలు
ప్రముఖ నటి శ్రీదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న విశిష్ట పాత్రలను పోషించి ఆమె వెండి తెరకు ఖ్యాతి తెచ్చారని ప్రశంసించారు. ఆమె అకాల మరణం తనను కదిలించివేసిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. తెలుగు నటిగా ప్రఖ్యాతి వహించిన శ్రీదేవి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎందరో అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి మరణం దిగ్భ్రాంతిని కల్గించిందని ఇరువురు సిఎంలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీదేవి మృతి పట్ల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ నటి హేమామాలిని, పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.
నేడు ముంబైకి భౌతికకాయం ?
పెళ్లి వేడుకకు వెళ్లి ఆకస్మికంగా మృతి చెందిన శ్రీదేవి భౌతిక కాయాన్ని దుబాయ్ నుంచి ముంబైకి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు భారతీయ ఎంబసీ వర్గాలు తెలిపాయి. అర్థరాత్రి పెళ్లి వేడుక తరువాత ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జుమైరా ఎమ్మిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేశారు. అర్థరాత్రి బాత్రూంలో కళ్లు తిరిగి పడిపోయినట్లు, గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెంది ఉన్నట్లు గుర్తించారని వెల్లడైంది. గుండెపోటుతోనే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టు మార్టం నివేదిక ఇవ్వడానికి 24 గంటలు పడుతుందని వెల్లడైంది. దీనితో ఆమె మృతదేహం తరలింపులో జాప్యం జరిగింది. దుబాయ్‌లోని భారతీయ దౌత్యవర్గాలు కలుగచేసుకుని భౌతికకాయాన్ని భారత్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం శ్రీదేవి భౌతిక కాయం ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుంటుంది. అంత్యక్రియలు జుహులోని శాంతాక్రజ్ శ్మశానవాటికలో జరుగుతాయి. ఇప్పటికే ఆమె తుది దర్శనం కోసం వేలాది మంది శ్రీదేవి చార్‌బంగ్లా నివాసం వద్ద గుమికూడారు. శ్రీదేవి ఇంటి నుంచి భౌతిక కాయాన్ని తొలుత మెహబూబా స్టూడియోకు తరలిస్తారు. అక్కడ ప్రముఖులు, అభిమానుల నివాళుల తరువాత శ్మశాన వాటికకు ఊరేగింపుగా భౌతికకాయాన్ని తరలిస్తారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News