Home తాజా వార్తలు తెలంగాణ సాధనతోనే బానిస బతుకులకు విముక్తి

తెలంగాణ సాధనతోనే బానిస బతుకులకు విముక్తి

Srinivas Reddy attended to formation day celebrations

సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది
‘మిషన్ భగీరథ’ రాష్ట్రమంతటా కొనసాగుతుంది : స్పీకర్ పోచారం

మన తెలంగాణ / సిద్దిపేట: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనతోనే బానిస బతుకుల నుంచి మనకు విముక్తి లభించిందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా హజరై ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్ర ఫలాలు లభించలేదన్నారు. అడుగడుగున తెలంగాణకు అన్యాయం జరగడంతో మనం ఎన్నో బాధలు పడ్డామన్నారు. ఇది గ్రహించిన సిఎం కెసిఆర్ బానిస బతుకుల నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయిస్తేనే బాగుంటుందని 2001లో రాష్ట్ర సాధనకై ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ ఉద్యమం 2014లో తుది రూపం దాల్చుకొని తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, సహకారంతో జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం కొత్తగా పరిపాలన పగ్గాలు చేపట్టిన సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణించేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. కెసిఆర్ పాలనలో యావత్ దేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అంతకుముందు సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనాన్ని సమర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్, జెసి పద్మాకర్, డిఆర్‌ఒ చంద్రశేఖర్, సిపి జోయల్ డేవిస్, ఆర్డీఒ జయచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

Srinivas Reddy attended to formation day celebrations