Saturday, April 20, 2024

ప్రాజెక్టులు ఫుల్

- Advertisement -
- Advertisement -

గోదావరిలో పెరిగిన వరద
శ్రీరాంసాగర్, కడెం, మానేరు గేట్లు ఎత్తివేత
కృష్ణనదికి భారీ వరద హెచ్చరిక
జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
శ్రీశైలంలో 846 అడుగుల వరకు
అప్రమత్తంగా ఉండాలని అంతటా హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్: ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరం ప్రాంతంలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకంగా 80సెంటీమీటర్ల వర్షం కురువటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువ ప్రాంతాలకు పరుగులు తీస్తోంది.మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరివాహకంగా ఉన్న ప్రధాన జలాశయాలన్ని వరదనీటితో నిండిపోయాయి. జైక్వాడి, బాబ్లి తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి ఎగువనుంచి వస్తున్న నీటి ప్రవాహాలను నియత్రిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖద్వారంలో ఉన్న శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి 3లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఇప్పటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోవటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 35గేట్లు ఎత్తివేశారు. దిగువకు 6లక్షల క్యూస్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో గరిష్టనీటిమట్టం 1091అడుగులు కాగా,1090,40అడుగుల మేరకునీటిని నిలువ ఉంచి మిగిలిన నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
ఎల్లంపల్లికి వరదపోటు:
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదతాకిడి భారీగా పెరిగింది. ఎగువనుంచి 1,90,107 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు 35గేట్లు ఎత్తివేశారు. గేట్లద్వారా 2,28,690క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొదట 20గేట్లు ఎత్తిన అధికారులు వరద ఉధృతిని గమనించి మరో 15గేట్లు ఎత్తేశారు. ప్రాజెక్టు దిగువన గోదావరి పరివాహకంగా ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మత్సకారులు చేపలవేటకోసం నదిలోకి వెళ్లరాదని సూచిస్తున్నారు.
నిండుకుండల్లా మానేరు జలాశయాలు
వరదనీటి చేరికతో మానేరు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గంభీరావు పేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు వరదనీటితో నిండిపోయింది. పాల్వంచ, కూడవెల్లి, వాగులనుంచి భారీగా వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఇప్పటికే పూర్తిస్థాయినీటిమట్టానికి చేరటంతో వరదనీరు అలుగులెక్కిప్రవహిస్తోంది. కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రాజెక్టును పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలకు వరద హెచ్చరికలు చేస్తున్నారు. మధ్యమానేరు జలాశయంలోకి కూడా 82000క్యూసెక్కుల నీరు చేరుతుండగా,22గేట్లు ఎత్తివేసి 1,03,000క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దిగువ మానేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరదనీరు చేరుతోంది. మొయ, తుమ్మెద వాగుల నుంచి నీటిప్రవాహకం అధికంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు 12గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద పెరిగితే మరో రెండు గేట్లు ఎత్తివేసేందుకు సిద్దంగా ఉన్నారు.
కడెం గేట్లు ఎత్తివేత
గోదావరి పరివాహకంగా ఉన్న కడెం జలాశయంలోకి కూడా భారీగా వరదనీరు చేరుతోంది. ఎగువనుంచి 1,84,000 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు 14గేట్లు ఎత్తి 1,54,780క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాలిపేరు జలాశయంలొ కూడ వరదనీరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరటంతో 12గేట్లు ఎత్తి వేసి దిగువకు 14,148క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కృష్ణానదికి భారీవరద హెచ్చరిక
ఎగువన మహారాష్ట్రలో మహేబలేశ్వరం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు , కర్ణాటకలో కృష్ణానది ఉపనదులకు చేరుతున్నవరదనీటిప్రవాహాలతో రానున్న 24గంటల్లో కృష్ణానదికి భారీగా వరద వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.ఆల్మట్టి ప్రాజెక్టులోకి 58385క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టునుంచి 97000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటినిలువ 76శాతానికి చేరుకుంది. దిగువన నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,20,000క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1,28,590క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
జూరాల దిగువన అప్రమత్తం:
జూరాల ప్రాజెక్టులోకి 54960క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, 57849క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటినిలువ 64శాతం వద్ద నియంత్రిస్తున్నారు.
846అడుగులకు శ్రీశైలం:
శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమేపి మెరుగుపడుతూ వస్తోంది. గురువారం నీటిమట్టం 846అడుగులకు చేరుకుంది. నీటినిలువ 72టిఎంసిలకు పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఎగువనుంచి జలాశయంలోకి 63,120క్యసెక్కుల నీరు చేరుతుండగా, 21189క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన నాగార్జున సాగర్‌లోకి 500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతే మొత్తాన్ని పులిచింతలకు పంపుతున్నారు. సాగర్‌లో నీటిమట్టం 534.90అడుగులు ఉండగా , నీటినిలువ 177.80టిఎంసిలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టులోకి13800క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Sriram Sagar gates lifted due to heavy floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News