Tuesday, March 21, 2023

అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం

- Advertisement -

god2

*పట్టువస్త్రాలు సమర్పించిన
మంత్రి దంపతులు
*వేలాదిగా తరలివచ్చిన
భక్తులు
*నేడు ముగియనున్న
బ్రహ్మోత్సవాలు

మన తెలంగాణ/బాన్సువాడ: తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చూడ ముచ్చటగా వేదపండితులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించా రు. గత నాలుగు రోజులుగా దేవాలయంలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీవారి కళ్యాణాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో కళ్యాణాన్ని జరిపించారు. స్వామి వారి కల్యాణానికి మంత్రి పోచారం దంపతులు పట్టువస్త్రాలను సమర్పించుకున్నారు. అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి అభిషేకాలు, అలంకరణ ప్రక్రియలను చేపట్టారు. వేద మంత్రాల ఘోషణల మధ్య శ్రీవారి కళ్యాణం జరిగింది. శ్రీవారి పెండ్లి తంతును చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కళ్యాణాన్ని వీక్షించి భక్తులు పునీతులయ్యారు.
రైతు సుబీక్షంగా ఉంటే రాష్ట్రం సుబీక్షంగా ఉంటుంది: త్రిదండి రామానుజ జియర్ స్వామీజీ
రైతు సుబీక్షంగా ఉన్నప్పుడే దేశం సుబీక్షంగా ఉంటుందని, భక్తి పెరిగిన చోట జనజీవనం ప్రశాంతంగా సాగుతుందని ప్రవచించారు. దేవుడిని నమ్మిన వారికి ప్రాణం ఉన్నంత కాలం ఆ దేవుడే పరిరక్షిస్తాడన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని చెప్పారు. పవిత్రత తోటే ప్రజారోగ్యం ఏలా ఉంటు ందో భక్తి ఉన్న చోటే భగవంతుడు కొలువై ఉంటాడన్న వాస్తవం కూడా అంతే ఉంటుందన్నారు. నిత్య వ్యాపకాలతో కాకుండా రోజులో గంట పాటు దేవుడి ఆధీనంలో మనస్సును లగ్నం చేసి తమ సాధక బాధలు తెలిపిన వారికి భగవంతుడు అండగా ఉంటాడని స్వామీజీ పిలుపునిచ్చారు.
మరో తిరుపతిగా తిమ్మాపూర్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి
తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరో తిరుపతిలా అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తిమ్మాపూర్ వెంకన్న స్వామి ఎంతో మహిమాన్వితుడని, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవార్లు ఇక్కడ స్థిరత్వం పొందారని అభిలషించారు. 2016లో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు కెసిఆర్ ఆయుత చండీ యాగంతోపాటు తాను వరుణయాగం చేయడం వల్లనే పుష్కలంగా వర్షాలు కురిశాయన్నారు. ఆలయ అభివృద్ధికి సిఎం కెసిఆర్ రూ.10 లక్షలు, ప్రభుత్వం నుండి మరో రూ.13 కోట్లు నిధులను మంజూరు చేశారన్నారు. ఆ నిధులతో ఆలయ ప్రాంగణంలో మాడ వీధులు, శ్రీవారి పుష్కరిణీ, కల్యాణకట్ట, మండపం, ప్రాకారాల నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచారం సోదరుడు శంభురెడ్డి దంపతులతోపాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News