Home ఎడిటోరియల్ సంపాదకీయం : రచ్చ చాలు-ఇక చర్చ చేయండి!

సంపాదకీయం : రచ్చ చాలు-ఇక చర్చ చేయండి!

Sampadakeeyam-Logo   ఐదొందలు, వెయ్యి రూపాయల విలువగల నోట్ల చలామణీ రద్దుతో ఆసేతు హిమాచలం సామాన్య ప్రజలను బికారులుగా రోడ్డుమీదకు నెట్టిన ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయంపై చర్చ విషయంలో ప్రతిపక్షాల పట్టు, ప్రభుత్వ మొండివైఖరి కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాల వ్యవధిలో మూడు వారాలు కొట్టుకుపోయాయి. చర్చ సమయంలో ప్రధాని సభకు హాజరై చర్చకు సమాధానం చెప్పాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుపడు తుండగా, లోక్‌సభలో ఓటింగ్ జరిగే రూలు కింద చర్చ జరగాలని ప్రతి పక్షం, ప్రభుత్వ సమాధానంతో చర్చను ముగించే రూలు కింద చర్చకు సిద్ధమని ప్రభుత్వపక్షం భీష్మించటంతో రచ్చతోనే నిత్యం సమావేశాలు వాయిదా పడుతున్నాయి.

16వ తేదీతో ముగిసే శీతాకాల సమావేశంలో ఇక మూడు పనిదినాలు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఒక మెట్టుదిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రజాజీవితాన్ని నెలరోజులపైబడి అతలాకుతలం చేస్తున్న డీమానిటైజేషన్ అంశంపై తమ అభిప్రాయాన్ని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికల్లో నమోదు చేసే అవకాశాన్ని కోల్పోతాయి.
పార్లమెంటు సమావేశాలకు కొనసాగుతున్న అంతరాయంపై ఇద్దరు ఉద్ధండ పార్లమెంటేరియన్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ పార్లమెంటేరియన్, మాజీ ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ ప్రతిపక్షాలపైనే గాక స్పీకర్, ప్రభుత్వపక్షంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, మంత్రిగా పనిచేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత పరిణామాలపట్ల బాధపడుతూ ‘దయచేసి అంతరాయాలు ఆపండి, చర్చించండి’ అని పార్లమెంటేరియన్‌లకు విజ్ఞప్తి చేశారు. డీమానిటైజేషన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై రాష్ట్రపతికి ఫిర్యాదుచేసిన ప్రతిపక్షాలు, ఆ రాష్ట్రపతి బహిరంగ విజ్ఞప్తిని గౌరవించి చర్చకు ఉపక్రమించవచ్చు.
పార్లమెంటుకు హాజరై ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానా లివ్వటానికి సుముఖత చూపని ప్రధాని మోడీ, వెలుపల బహిరంగ సభల్లో గంభీరోపన్యాసాల్లో, ‘ప్రతి పక్షాలు పార్లమెంటులో నన్ను మాట్లాడనివ్వటం లేదు – అందుకే ప్రజలసభల్లో మాట్లా డుతున్నా’నంటూ ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారు. డీమానిటైజేషన్ స్వతంత్ర భారత చరిత్రలో అతిభారీ కుంభకోణమని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్లమెంటులో తనను మాట్లాడనిస్తే భూకంపం సృష్టిస్తానంటున్నారు. ఇటువంటి వాద ప్రతివాదాలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు ప్రజలకష్టాలు తీర్చవు. లేదా నగదు రహిత ఆర్థిక లావాదేవీలు, డిజిటలైజేషన్, మీ సెల్‌ఫోనే మీ బ్యాంక్ అంటూ ప్రజల దృష్టి మళ్లించేం దుకు ప్రధాని మొదలు మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రచారం కరెన్సీ కష్టాలనుంచి ప్రజలకు ఊరట కలిగించదు.

‘ఇదంతా పేదల కోసమే-కొంతకాలం ఓపిక తో నాతో సహకరించండి – దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది’ అని ప్రధాని మోడీ భరోసాలు నమ్మకం కలిగించటం లేదు. పేదల పేరు చెప్పి దోపిడీ వర్గాలకు మేలు చేకూ ర్చటం ఈ దేశంలో పాలకవర్గాలకు అలవాటే. ఇందులో మోడీ కొన్ని మెట్లు పైనే ఉన్నారు.
నల్లధనాన్ని రూపుమాపటం, అవినీతిని అరికట్టడం, నకిలీ కరెన్సీని ఏరివేయటం, టెర్రరిస్టులకు నిధుల లభ్యతను బంద్ చేయటం డీమానిటైజేషన్ ధ్యేయంగా ప్రధాని ప్రకటించటం గుర్తు చేసుకోదగింది. లక్షాలతో సూత్రప్రాయంగా విభేదించే వారెవరూ ఉండరు. అయితే ముందుగా తగినంత సన్నద్ధతలేకుండా, అనాలోచితంగా ప్రధాని నిర్ణయం తీసుకున్నాడనేదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. దీనికొరకు 90 శాతం ప్రజలను యమబాధలు పెట్టాలా అన్నదానిపైనే రచ్చ. బ్యాంకుల ముందు పడిగాపులు పడినా రూ.2వేలు దొరుకుతుందన్న గ్యారంటీ ప్రజలకు లేకపోతే, నల్ల కుబేరులకు వేలకోట్ల కొత్తనోట్లు ఎలా చేరుతున్నాయన్నదే దిగ్భ్రాంతి గొలుపుతున్న విషయం. నల్లకుబేరులు తమ పలుకుబడిని, ఇతర మార్గాలను ఉపయోగించి, కమిషన్ లిచ్చి నలుపును తెలుపుచేసుకుంటుంటే ఇక ప్రభుత్వానికి దొరికే నల్లధనమెంత? అవినీతి అంతమెప్పుడు? అందువల్ల ప్రభుత్వం కూడా భేషజానికి పోకుండా పార్లమెంటులో చర్చను అనుమతించాలి, అమలులో లోటుపాట్లను అంగీకరించాలి. ప్రధాని పార్లమెంటును గౌరవించాలి.