Home తాజా వార్తలు జలక్రీడలకు కాళేశ్వరంతో నూతనోత్సాహం

జలక్రీడలకు కాళేశ్వరంతో నూతనోత్సాహం

rafting competitions

 

ఆసక్తిగా తొలి రాష్ట్రస్థాయి తెప్పల పోటీలు, జలాలతో తలరాతలు మార్చిన మహానేత కెసిఆర్ : మంత్రి కొప్పుల

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, గోదావరి బ్రిడ్జి వద్ద ఆదివారం నిర్వహించిన తెప్పల పోటీలు జలక్రీడల రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ క్రీడాభిమానులకు నూతనోత్సాహాన్ని కలిగించింది. తొలిసారిగా ఇక్కడ రాష్ట్రస్థాయిలో మత్స్యవీర కెసిఆర్ తెప్పల పోటీలు ఉత్సాహంగా సాగగా పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ పోటీలను రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ తూర్పున పారే గోదావరి నదిని పడమరకు దిశమార్చి కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం చేసి రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరిని నిండుకుండలా మార్చిన అపర భగీరథుడు సిఎం కెసిఆర్ అని కొనియాడారు.

జలాలతో తలరాతలు మార్చిన మహానేతగా సిఎం కెసిఆర్ సరికొత్త చరిత్రను సృష్టించారని తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 220 మంది క్రీడాకారులు పాల్గొనగా, మంచిర్యాల జిల్లాకు చెందిన ఆరుగుట్ల శ్రీనివాస్, అరుగుట్ల రాజేష్, పెద్దపల్లి జిల్లా ఎన్టీపిసికి చెందిన పిట్టల వెంకటేష్, కూనారపు రాజేష్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వీరికి మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే చందర్‌లు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిడ్పిటిసి ఆముల నారాయణ, నిర్వాహకులు గోలివాడ ప్రసన్నకుమార్, నాయకులు పెంట రాజేష్, మారుతి, చుక్కల శ్రీనివాస్, అడప శ్రీనివాస్, శంకర్, జంపయ్య, జెవి రాజు, దేవరాజ్ పాల్గొన్నారు.

State-level rafting competitions