Home తాజా వార్తలు ఈ-ఆఫీస్

ఈ-ఆఫీస్

State Secretariat to have e-office system soon

 

ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారి, సాంకేతిక సహాయకుడు
ఉద్యోగుల మాస్టర్ డేటాబేస్, డిజిటల్ సంతకాల సేకరణ
సిబ్బందికి త్వరలో శిక్షణ, కరోనా నేపథ్యంలో రాష్ట్రం కీలక నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహామ్మారి కోరలు చేస్తున్న ప్రస్తుత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-ఆఫీసు ద్వారా పరిపాలన అందించాలని నిర్ణయించింది. దీనిని ఈ నెల రెండవ వారం నుంచి అధికారికంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది.సచివాలయంతో సహా ఇతర హెచ్‌ఒడిలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈఆఫీస్ సాఫ్ట్‌వేర్ ద్వారా సులభతర పరిపాలన మొదలుపెట్టబోతోంది.

ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఉద్యోగుల మాస్టర్ డేటా బేస్ రూపొందించాలని, ఈఆఫీస్‌కు అవసరమయ్యే సాఫ్ట్ వేర్, హా ర్డ్‌వేర్ల వివరాలు, డిజిటల్ సంతకాలను సేకరించాలని వివిధ శాఖలకు నోట్ జారీ చేసింది. ఈఆఫీస్ నిర్వహణ కోసం ప్రతిశాఖకు ఒక నో డల్ అధికారిని, సాంకేతిక సహాయకుడిని కూడా నియమించే విధంగా ఇప్పటికే ఆదేశాలిచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లో వచ్చే వారం నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత తరుణంలో అ ధికారిక లావాదేవీలు ఆన్‌లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫైళ్ల నిర్వహణ భౌతికంగా జరగడం ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ప్రమా దం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుంది.

ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ సులభతరమయి పారదర్శకత, విశ్వసనీయతలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎండోమెంట్ శాఖల్లో ము ందుగా ఈఆఫీస్ ప్రక్రియను ప్రవేశ పెట్టనుంది. తరవాత ఇతర శాఖలకు దాన్ని విస్తరించను ంది. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సరంజామాను సమకూర్చుకోవడంతో పాటు ఉద్యోగుల మాస్టర్ డేటాబేస్, హైరార్కీ మ్యా పింగ్, వాళ్ళ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ లాంటి వివరాలతోపాటు ఇ.. ముద్ర అప్లికేషన్ ద్వారా వాళ్ళ డిజిటల్ సంతకాలను కూడా సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారిని నియమించి అన్ని వివరాలను మంగళవారం నాటికల్లా సిద్ధంగా ఉంచుకోవాలని వివిధ శాఖలకు సూచించింది.

ఈనెల 8 వ తేదీలోగా ఫైళ్ల డిజిటలైజేషన్, 9 వ తేదీలోగా ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసి జూలై రెండోవారం నుంచే ఇ..ఆఫీస్ ద్వారా ఆన్ లైన్ పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈఆఫీస్ సాఫ్ట్‌వేర్ ను డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రూపొందించింది. ఉద్యోగి తన యూజర్ నేమ్, పాస్‌వర్ తో ఇ..ఆఫీస్ లోకి ప్రవేశించి డిజిటల్ ఫైళ్ల సృష్టి, నిర్వహణలతో పాటు అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించవచ్చు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా ఓ ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ కీ అందుబాటులో ఉంటుంది. తద్వారా దాంట్లోని డేటా, సమాచారం, ఇతర ఫైళ్లు టాంపర్ కు గురికాకుండా భద్రంగా ఉండే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఐటి శాఖ సహకారంతో ఎస్‌ఒ నుంచి ఆ పైస్థాయి అధికారుల వరకు హైరార్కీ మ్యాపింగ్ చేస్తున్నారు.

మామూలు పరిస్థితుల్లో లాగా కరెంట్ల నిర్వహణలో గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైళ్ల కదలిక నిరంతరం తెలిసేలా, నిర్దిష్ట సమయంలో అది ఏ అధికారి దగ్గర ఉంది, ఫైల్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? తదితర వివరాలను ట్రాక్ చేసేలా, ఫైళ్ల నిర్వహణ పారదర్శకంగా జరిగేలా ఇ-ఆఫీస్ దోహదపడుతుంది. ఫైల్ కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తమ మొబైల్లో వచ్చే అలెర్ట్‌ల ద్వారా లేదా ఇ-మెయిళ్ల ద్వారా తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ విధానాన్ని త్వరలో అన్ని శాఖల్లో అమలుచేసి అధికారులు, సిబ్బంది ఇంట్లో ఉన్నా పనయ్యేట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఐతే డిజిటల్ ప్రక్రియ ద్వారా పరిపాలన కొనసాగలంటే ప్రతి సెక్షన్‌కు కనీసం ఒక స్కానర్ అవసరమవుతుంది. ఒకచోట స్కాన్ చేసి ఫైల్ ను అప్ లోడ్ చేస్తే… ఇక అది డిజిటల్ ఫైల్ రూపంలో ప్రతి సిస్టంలో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. కాగా ఇ..ఆఫీస్ సాఫ్ట్‌వేర్ కోసం ప్రతి అధికారి దగ్గర 4జిబి ర్యామ్ అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న డెస్క్ టాప్ సిస్టం అవసరమవుతుంది.

State Secretariat to have e-office system soon