Home రాష్ట్ర వార్తలు జిఎస్‌టి దెబ్బకు రాష్ట్రాలు అడుక్కోవాల్సిందే!

జిఎస్‌టి దెబ్బకు రాష్ట్రాలు అడుక్కోవాల్సిందే!

 అశాస్త్రీయమైన పన్నుల స్లాబ్‌కు మేం వ్యతిరేకం : సురవరం సుధాకర్‌రెడ్డి

                    suravaram

హైదరాబాద్ : జిఎస్‌టి వల్ల కేంద్రానికే తప్ప రాష్ట్రాలకు, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, పన్నుల ఆదాయం కోల్పోయే రాష్ట్రాలు కేంద్రం వద్ద భిక్ష పాత్ర పట్టుకునే పరిస్థితిని కల్పించడం మంచిది కాదని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు లాభం కల్పించే దిశగా పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జిఎస్‌టికి తాము సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ, అశాస్త్రీయమైన పన్నుల స్లాబ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఇప్పటికైనా స్లాబ్‌ల విధానంపై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా శుక్రవారం మఖ్ధూంభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. జిఎస్‌టిపై గత పదేళ్లుగా చర్చ జరుగుతూనే ఉందని, మోడీ ప్రభుత్వం ఏం ఘనకార్యం సాధించిందని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని సురవరం ప్రశ్నించారు. అందుకే తాము పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహన్ జిఎస్‌టిని ఎందుకు వ్యతిరేకించారో సమాధానం చెప్పాలన్నారు. జిఎస్‌టి అమలుతో వస్తు ఉత్పాదక రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, దీని వల్ల పన్ను ఆదాయాన్ని పూర్తిగా కోల్పోతున్న రాష్ట్రాలకు ప్రత్యామ్నాయం చూపలేదన్నారు.

ఒకే పన్ను విధానం ఉంటుందని చెప్పినందు వల్లనే జిఎస్‌టిపై సిపిఐ సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపిందని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టిలో పన్నుల స్లాబ్‌లు అశాస్త్రీయంగా ఉన్నాయని వివిధ వర్గాలు అభ్యంతరాలు చెబుతున్నాయని, వారి అసంతృప్తిని పరిగణలోకి తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం వాటిపై ఎలాంటి పరిశీలన చేయకపోవడం విచారకరమన్నారు. హడావుడిగా, ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా ఆర్భాంటంగా జిఎస్‌టిని అమలు చేయడం గర్హనీయమన్నారు. జిఎస్‌టి వల్ల నిత్యం ఉపయోగించే బట్టలు, చెప్పుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుండగా, పేకాట కార్డులు, క్యారంబోర్డుల ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు.

తెలంగాణలో ఇప్పటికే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, జిఎస్‌టి వల్ల ఎరువుల ధరలు పెరిగి రైతులపై సుమారు రూ.1700 కోట్ల భారం పడుతుందన్నారు. గోరక్షణ పేరుతో జరుగుతున్న హత్యలను ఆలస్యంగానైనా ప్రధాని ఖండించడం స్వాగతిస్తున్నామని, అయితే బిజెపి పాలిత రాష్ట్రాల్లో గోరక్షణ పేరుతో జరిగిన హత్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఒక్కరిని కూడా ఎందుకు శిక్షించలేదని ఆయన ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన చర్చల్లో భారతీయులకు వీసాల సమస్య, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాల ఉల్లంఘనపై ప్రస్తావన లేకపోవడం ప్రధాని మోడీ వివేశాంగ విధానంలో వైఫల్యమన్నారు. డాక్టర్ నారాయణ మాట్లాడుతూ జిఎస్‌టిపై కేంద్రం పూర్తిస్థాయిలో కసరత్తు చేయలేదని, జిఎస్‌టితో అభివృద్ధి జరుగుతుందనడంలో వాస్తవం లేదన్నారు. జిఎస్‌టి వల్ల కార్పోరేట్ సంస్థలకే లాభమని, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలకు తీవ్ర నష్టమన్నారు. జిఎస్‌టికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వర్గాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఆ వర్గాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, నైతికంగా కేంద్రం ప్రజలను దెబ్బతీస్తున్నదన్నారు.