Friday, April 19, 2024

ధరణి ట్రయల్ రన్?

- Advertisement -
- Advertisement -

Statewide trial run was conducted on Dharani

 

470 తహసీల్దార్ కార్యాలయాల్లో టెక్నికల్ సమస్యలపై ఆరా, వాటి పరిష్కారానికి సాంకేతిక బృందాలు
నేడో, రేపో తహసీల్దార్లకు ధరణిపై శిక్షణ
దసరాకు పోర్టల్‌ను ప్రారంభించేందుకు చర్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణిపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించారు. 470 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలకు సంబంధించి టెక్నికల్‌గా ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారులు ఈ ట్రయల్‌ను నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా నాలుగు రకాల రిజిస్ట్రేషన్ సేవలను, మ్యుటేషన్‌లోని తీరుతెన్నులను ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ట్రయల్ రన్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని టెక్నికల్ టీం వెంటనే నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సమస్యలు తలెత్తకుండా మార్పులు, చేర్పులు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించడంతో ఆ దిశగా టెక్నికల్ టీం కసరత్తు ప్రారంభించింది.

రెండు ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకునేలా…

దసరాకు ధరణిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం వడివడిగా ఆస్తుల నమోదుతో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సదుపాయాలను సమకూర్చడం వంటి తదితర చర్యలను చేపట్టింది. ఇప్పటికే జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ధరణిపై వారంరోజులు పాటు హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించింది. తహసీల్దార్‌లకు కూడా మూడు లేదా నాలుగురోజుల పాటు గత ఆదివారం (11వ తేదీన) శిక్షణ ఇవ్వాల్సి ఉండగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఫలితాలు ఉండడంతో వాటిని వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ రెండు రోజుల్లో తహసీల్దార్‌లకు ధరణిపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ధరణిలో మార్కెట్ విలువలను, ఆస్తుల నమోదును చేపట్టడంతో తహసీల్దార్ కార్యాలయాలకు కావాల్సిన ఇంటర్నెట్ (2 కనెక్షన్ల) సౌకర్యాన్ని తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తహసీల్దార్‌లకు శిక్షణ ఒక్కటే మిగిలి ఉండడంతో దానిని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దసరాలోపు వీటిని కూడా పరిష్కరించి పూర్తి స్థాయిలో ధరణిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News