Home ఎడిటోరియల్ విశాఖ ఉక్కు-విస్తుగొల్పే వాస్తవాలు

విశాఖ ఉక్కు-విస్తుగొల్పే వాస్తవాలు

Steel plant employees rally against privatisation

 

ఆంధ్రుల త్యాగాల ఫలమైన విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటన్నదే ఇప్పుడు అందరి ముందున్న సందేహాల సమాహారం. ఉక్కు ఆంధ్రుల హక్కేనని కార్మికులు, ఉద్యమకారులు, మేధావులు, స్థానికులు అందరూ నినదిస్తున్నారు. ప్రభుత్వా ల చర్యలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్లాంటు సక్రమ నిర్వహణకు మార్గాలను అన్వేషించాలి. గత చరిత్రను, ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని, వాస్తవ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ సమూహంలో విశాఖ ఉక్కును చేర్చవద్దన్నదే అందరి భావన. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు… నిజమే. ఎందరో త్యాగాల ఫలమని అందరికీ తెలిపిందే. ఎన్నో పోరాటాల మీదట తెలుగు వారికి అందివచ్చిన ఉక్కు కర్మాగారం ఇటీవల ఆటుపోట్ల నడుమ నిలిచింది. ఉన్నట్టుండి ప్రైవేటీకరణ కొలిమిలో పడ్డట్లయింది.

పెట్టుబడుల ఉపసంహరణ పేరిట సాగుతున్న ప్రచార సుడిలో ఇరుక్కుపోయింది. త్యాగాల ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు మళ్లీ ప్రజల పోరాటానికి ఎదురు చూస్తోంది. ఆ నాటి ఉద్యమ స్ఫూర్తి నేడు కొరవడటంతో అసలు ఫ్యాక్టరీ భవితవ్యమే ప్రశ్నార్ధకమవుతోంది. ప్రైవేటీకరణ అడకత్తెరలో బందీ అయిన ఉక్కు కర్మాగారం పై ఎన్నో వాదోపవాదాలు సాగుతున్నాయి. ఫ్యాక్టరీ స్థాపన, పూర్వాపరాలు మరోసారి వేదిక పైకొచ్చాయి. వాస్తవాలు విస్తుపోతున్నాయి. మేధావులు, పరిశీలకులు, కార్మిక సంఘాలు, ఉద్యమకారుల స్పందనను పరిశీలిస్తే పలు అంశాలు వెలుగులోకొస్తున్నాయి. ముందుగా… ప్రభుత్వ అభిమతాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా పలు మౌలిక రంగాల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. నష్టాలను భరించేకన్నా ఆయా రంగాల్లోని ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తే దేశ పురోభివృద్ధికి ప్రయోజనకారి అవుతుందని కేంద్రం తలపోస్తోంది.

ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం కూడా తెరపైకి వచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో కుండబద్దలు కొట్టారు. ప్రైవేటుపరం చేయనున్న వివిధ రంగాలు, పరిశ్రమలపై ఆమెతో పాటు సంబంధిత శాఖల మంత్రులు వివరణలు ఇచ్చుకున్నారు. విశాఖ ఉక్కులో 100 శాతం వాటాలు విక్రయిస్తారనీ, ఒక్క శాతం ఈక్విటీ కూడా లేని రాష్ట్ర ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదని నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణతోను ఉత్పత్తి సామర్ధ్యం పెరుగుతుందని, బోలెడన్ని ఉపాధి అవకాశాలుంటాయని, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని వివరణ ఇచ్చారు. మరోవైపు లోక్ సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ మరి కొంత దూకుడును ప్రదర్శించారు. ఆయా సంస్థలు లాభ నష్టాల్లో ఉన్నాయా లేదా అన్నది ప్రాతిపదిక కాదని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణపై తగ్గేదిలేదన్నారు.

ఇప్పటికీ 35 సంస్థలపై నిర్ణయం తీసుకున్నామని, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లని చెప్పుకొచ్చారు. కాగా 100 దాకా ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారనీ వార్తలు వస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ వాదన ఏకపక్షంగా ఉందంటూ పలు విశ్లేషణలు ఆవిష్కృతమయ్యాయి. ఉత్పత్తి సామర్థ్యం, లాభనష్టాల అంచనాలు, ప్రజాస్పందన… అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఉత్పత్తిలో విశాఖ ఉక్కు తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి 261 శాతం అధికంగా ఎగుమతులు జరిగినట్లు లెక్కల్లో తేలింది. ఒక్క మార్చిలోనే రూ. 3300 కోట్లు అమ్మకాలు రికార్డ్ అయ్యాయి. గత 4 నెలల్లో రూ. 740 కోట్ల లాభం గడించింది. ఇదే ఉత్పత్తి ప్లాంటు పురోభివృద్ధికి తార్కాణమని కార్మిక సంఘాలు నినదిస్తున్నాయి. అదే విశాఖ ఉక్కుకు సొంత గనులుంటే రూ. 6 వేల కోట్లు ఆదా జరిగేదని ఆ సంఘాలు నివేదిస్తున్నాయి. కర్మాగారం సిఎండి రథ్ ఇటీవల విశాఖ ఉక్కు ఉత్పత్తిపై గణాంకాలను వెల్లడించడం గమనార్హం.

ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులైతే ఈ ఏడాది అంతకు మించి ఉత్పత్తి జరిగిందన్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే రూ. 3300 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క నెలలో ఇంత ఆదాయం రావడం కర్మాగారం చరిత్రలో తొలిసారి. సొంత గనులు లేకపోవడం విశాఖ ఉక్కుకు గుదిబండగా మారింది. దేశంలోని ఇతర ఉక్కు కర్మాగారాలతో పోలిస్తే విశాఖ ఉక్కు లో రవాణా ఖర్చు అధికమవుతోంది. ఉత్పత్తి దీటుగా ఉన్నా ముడి ఖనిజం లభ్యతపై ఎన్నో వ్యయ ప్రయాసలకు గురికావడం అనివార్యంగా మారింది. 1999 2004 మధ్య వాజ్‌పేయి ప్రభుత్వం పొరుగు రాష్ర్టం చత్తీస్‌గఢ్‌లో కొన్ని గనులు విశాఖ ప్లాంటుకు ఇవ్వడానికి అప్పటి సిఎం రమణ్ సింగ్ తో చర్చించారు. అయితే ఆయన 600 మంది తమ రాష్ర్టం వారికి ఉద్యోగాలు ఇచ్చే షరతులతో విశాఖ ఉక్కుకు గనులు కేటాయించేందుకు అంగీకరించారు. అయితే విశాఖ ఉక్కు యాజమాన్యం ఒప్పుకోకపోవటంతో ఆ అవకాశం చేజారింది.

అంతర్జాతీయ స్టీలు వినియోగం పెరగడంతో విశాఖ ఉక్కుకు సొంత గనులు లేకపోయినా 2004 నాటికి 5 వేల కోట్ల రూపాయల మిగులు సాధించారు. అదే 2007 2008 నాటికి మరో రూ. 2995 కోట్ల మిగులు సాధించారు. ఇదే తరుణాన ప్లాంటు విస్తరణకు సాయం అర్ధించగా కేంద్రం మొండి చేయి చూపింది. దీంతో బ్యాంకుల నుంచి అత్యధిక వడ్డీలతో అప్పులు తెచ్చారు. సుమారు 13 శాతం వడ్డీని చెల్లించాల్సి వచ్చింది. 2011 నుంచి పదేళ్ళలోనే అప్పుపై వడ్డీ పెరిగి రూ. 2500 కోట్ల రూపాయల భారంపడింది. ఇలా… ఆర్థిక లోటును సాకుగా చూపిస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా పావులు కదపటం శోచనీయమన్న వాదన వినిపిస్తోంది. ఎన్నో విధానపర లోపాలు ఈ దుస్థితికి కారణమని పరిశీలకులు చెబుతున్నారు. లోపాల్లో ప్రధానంగా సొంత గనులు అంశమే కీలకంగా మారింది. సొంత గనులు లేక ఇనుప ఖనిజం కొనుగోలుకు రూ.6000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి రావడం ప్రస్తావనార్హం.

సొంత గనులుంటే ఏడాదికి రూ. 2500 కోట్లు లాభాలు గడించే అవకాశముందని ప్లాంటు కార్మిక సంఘాలు ఉంటంకిస్తున్నాయి. గతంలో స్టీలు ప్లాంటు నష్టాలకు గనుల అంశానికి తోడు మార్కెట్ మందగమనం కూడా మరో కారణమని ఆ సంఘాలు పేర్కొంటున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణం 1982లో ప్రారంభమైంది. కేంద్ర పెట్టుబడి రూ. 4,883 కోట్ల అంచనా వ్యయంగా ప్రారంభమై 1990 నాటికి 8 వేల కోట్లు ఖర్చు చేసి ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. కర్మాగారంలో కేంద్రం తనకున్న రూ. 4 వేల కోట్లకుపైగా విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకునే లక్ష్యం లో భాగంగా ప్రైవేటీకరణ పల్లవిని అందుకుంది. ప్లాంటు ఇప్పటి విలువ రూ.2 లక్షల కోట్లపైనే ఉంటుందని అంచనాలున్నాయి. వేలాది ఎకరాల భూమి ప్లాంటుకు దఖలు పడింది. ఇక ప్రైవేటీకరణ అంటే రియల్ ఎస్టేట్ రంగం ప్రవేశం అనివార్యమే అవుతుందని ఉద్యమ కారులు, స్థానికులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

దేశ సంపద, సహజ వనరులు నానాటికీ తరిగిపోతున్నాయి. అవి కొద్ది మంది కార్పొరేట్ల ఆధీనంలోకి పంపించబడుతున్నాయి. ప్రైవేటీకరణ ఇలా చేసుకుటూపోతే ప్రజల పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎందరో మహానుభావుల సారథ్యంలో సాగిన నాటి విశాఖ ఉక్కు ఉద్యమం చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ఎట్టకేలకు ఆంధ్రుల చిరకాల స్వప్నం నెరవేరింది. నష్టాల పేరుతో ప్రభత్వరంగ సంస్థలను అమ్ముకుంటూపోతే ఇక రాబోయే తరాలకు మిగిలేదేముంది? నిరుద్యోగిత రేటు నానాటికీ ఎగబాకుతున్నవేళ… ఆంధ్రులు సాధించుకున్న విశాఖ ఉక్కు కూడా ప్రైవేటుపరమైతే యువతకు, ఉద్యోగార్థులకు ఏం సంకేతమిస్తారు? ఉద్యోగ భద్రతకు గ్యారంటీ ఉంటుందా? ప్రభుత్వ రక్షణ లేని ఉపాధికి జవాబుదారీ తనం ఎక్కడ?… అంటూ భిన్నవాదనలు వెల్లడవుతున్నాయి. నష్ట కారణాలు, విధానాల పై పరిశీలన, లాభాలపై అన్వేషణ కొరవడటం ఆక్షేపణీయమన్నదే పలువురి అభిప్రాయంగా ఉంది. వీటన్నింటికి తోడు ప్రజా స్పందన కూడా అంతంత మాత్రంగా ఉంటోందని విజ్ఞులంటున్నారు.

నాటి ఉద్యమ స్ఫూర్తి కనుమరుగైందని స్థూల విశ్లేషణగా ఉంది. ప్రైవేటీకరణ అంశం వెలుగు చూశాక అక్కడక్కడా నిరసనలు, బంద్‌లు జరిగాయి. అయితే గత ఉక్కు సాధన ఉద్యమం స్థాయిలో సంఘటితంగా జరగడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రభుత్వాల తీరూ భిన్నమే. గతంలో ప్రజా ఉద్యమాలకు తలొగ్గేవారు. ఇప్పుడు నెలల తరబడి, సంవత్సరాల కాలం గా చేస్తున్నా ఉద్యమాలను పట్టించుకునే వారే లేకపోవడం శోచనీయమే. ఇక ఇప్పుడు విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటన్నదే సకల జనుల ముందున్న ప్రశ్న!!