Friday, April 26, 2024

సైబరాబాద్ సిపిగా స్టీఫెన్ రవీంద్ర

- Advertisement -
- Advertisement -

Stephen Ravindra appointed as Cyberabad CP

సజ్జనార్‌కు ఆర్‌టిసి ఎండిగా బదిలీ

మనతెలంగాణ/హైదరాబాద్ : సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ అక్కడ పనిచేస్తున్న సజ్జనార్‌కు ఆర్‌టిసి ఎండిగా బదిలీ చేస్తూ బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందిన సజ్జనార్ సైబరాబాద్ సిపిగా 2018 మార్చి 13న బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో దాదాపు మూడేళ్ల పాటు సజ్జనార్ సర్వీసులో తనదైన ముద్ర వేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంచలన కేసులు చేధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చినెలలో ఆయన అడిషనల్ డీజీ ర్యాంకు ప్రమోషన్ పొందారు. 2008 వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, 2019 శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. అదేవిధంగా మల్టీ లెవెల్ స్కాంలను ఛేదించడంలోనూ కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు.

కొవిడ్ సమయంలో వలస కూలీలను ఆదుకోవడం, సొంత ప్రాంతాలకు తరలించడంలో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొవిడ్ రోగులకు తగిన వైద్యసాయం అందించేందుకు ఉచిత ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందించడం, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కరోనా వేళ రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోవడంతో సజ్జనార్ ఏడాది వ్యవధిలో 3 సార్లు రక్తదానం చేసి కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 5వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు అందించారు. విధి నిర్వహణలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పరిపాలన కొనసాగించారు.

పలు ఎన్‌కౌంటర్లలో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న సజ్జనార్ గతంలో కడప జిల్లాలో పులివెందుల ఎఎస్‌పి, కడప ఎస్‌పిగా పని చేసిన సమయంలో విధినిర్వహణలో చెరగని ముద్ర వేశారు. కాగా 1999 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ ఐజీగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆయనకు సైబరాబాద్ సిపిగా బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేశారు. ఈక్రమంలో స్టీఫెన్ రవీంద్ర గతంలో వరంగల్, కరీంనగర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో అనంతపురం జిల్లాలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో 2004, ఆంత్రిక సురక్ష సేవా పదక్, 2005, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ,2010 ప్రధాన మంత్రి పోలీసు పతకం, 2016, రాష్ట్రపతి పోలీసు పతకాలు అందుకున్నారు.

సిపిగా బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర 

సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు ఇచ్చిన సీఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ముఖ్యంగా సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అదే విధంగా, సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని తెలిపారు. సైబరాబాద్‌లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ రాష్ట్ర పోలీస్‌కి మంచి పేరు తీసుకోస్తామని వివరించారు.

సిపిగా సేవలు సంతృప్తినిచ్చాయి: సజ్జనార్

సైబరాబాద్ సిపిగా ప్రజలకు చేసిన సేవలు సంతృప్తినిచ్చాయని పేర్కొన్న సజ్జనార్ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన హోం మంత్రి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డిజిపి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపారు. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా జడ్జిలతో పాటు సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు అభివాదాలు తెలిపారు. ఈక్రమంలో సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసు అధికారుకు, ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, ఇతర సంస్థలతో పాటు తన ప్రతీ ఒక్క అడుగులో వెన్నంటి నడిచి ప్రోత్సహించిన రంగా రెడ్డి, మేడ్చల్ ప్రజా సంఘాలకు, మీడియా మిత్రులకు వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News