Home రాష్ట్ర వార్తలు సెట్‌లకు స్వస్తి?

సెట్‌లకు స్వస్తి?

  • మెడిసిన్ మినహా మిగిలిపోతున్న మిగతా కోర్సుల సీట్లు
  • సెట్‌లను రద్దుచేసి మెరిట్ ఆధారంగా కేటాయించే అంశంపై ఉన్నత విద్యామండలిలో సాగుతున్న చర్చ
  • జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల వ్యవస్థ కోసం ఎదురు చూపు, ఆతరువాతే నిర్ణయం

TS-CETSహైదరాబాద్: రాష్ట్రంలోని వృత్తి విద్యా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్(ప్రవేశ పరీక్ష)లపై ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొన్ని కోర్సుల్లో ప్రవేశపరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కంటే సీట్లు ఎక్కువగా ఉంటు న్నాయి. ఇలాంటి కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలా..? లేక ఆ పరీక్షలకు రద్దు చేసి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించడం అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు సమాచారం. ఉన్నత విద్యామండలి పాలకవర్గ సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు. ప్రవేశ పరీక్షలపై మరింత అధ్యయనం చేసి ప్రభుత్వా నికి నివేదించనున్నట్లు తెలుస్తోంది.

భారీగా మిలిగిపోతున్న సీట్లు : మెడిసిన్ విద్య మినహా దాదాపు అన్ని కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఒకప్పుడు వృత్తి విద్య కోర్సు ల్లో సీటు లభించడమే గగనంగా ఉంటే, ఇప్పుడు ఏటా భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇంజనీరింగ్, ఎంబిఎ,ఎంసిఎ, బి.ఇడి, లా తదిత ర కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ విద్యాసంవత్సరం ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు తగ్గించినా అవి కూడా పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. కన్వీనర్ కోటా కింద 73,604 సీట్లు అందుబాటులో ఉండగా, 12,638 సీట్లు ఖాళీగా మిగిలాయి. రెండు కళాశాలల్లో ఒక అడ్మిషన్ కూడా జరుగలేదు. అలాగే ఐసెట్‌లో మొత్తం 63,560 మంది ఉత్తీర్ణత సాధించగా, అందులో 30,540 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఎంబిఎలో కన్వీనర్ కోటా కింద మొత్తం 22,396 సీట్లు అందుబాటులో ఉండగా, 22,017 సీట్లు భర్తీ అయ్యాయి. 379 సీట్లు మిగిలాయి. అలాగే ఎంసిఎలో మొత్తం 1,909 సీట్లు అందుబాటులో ఉండగా, 1,852 సీట్లు అయి 57 సీట్లు మిగిలాయి. అలాగే న్యాయవిద్యలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సులో కన్వీనర్ కోటా కింద 2,590 సీట్లు అందుబాటులో ఉండగా, 739 సీట్లు మిగిలాయి. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సులో 1,176 సీట్లకు 585 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎల్‌ఎల్‌ఎంలో 524 సీట్లకు 81 సీట్లు మిగిలాయి. కొన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నప్పటికీ చాలా కోర్సుల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్న నేపథ్యంలో ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌టిఎ విధివిధానాలపై స్పష్టత వస్తేనే : ఉన్నత విద్యలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నేషనల్ టిస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన నేపథ్యంలో రాష్ట్రాలలో ప్రవేశ పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుందో అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్‌టిఎ విధివిధానాలపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రవేశ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెడిసిన్‌లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్న తరహాలోనే దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం కూడా జాతీయ స్థాయిలో ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఎఐసిటిఇ చేసిన ప్రతిపాదనకే కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వర్సిటీలతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు కాలం చెల్లనుంది.