Home కలం విశ్వమానవుడు గాలిబ్

విశ్వమానవుడు గాలిబ్

Mirza Ghalib

 

భారతదేశానికి మొగలులు ఏమిచ్చారని ఆలోచిస్తే ముఖ్యంగా మూడు కనిపిస్తాయి. ఒకటి ఉరుదు, రెండు గాలిబ్, మూడు తాజ్‌మహల్. ప్రపంచంలో తాజ్‌మహల్‌కు ఎలాంటి విశిష్ట స్థానం ఉందో గాలిబ్‌కు, ఉరుదూ భాషకు అలాంటి ప్రముఖ స్థానమే ఉంది. 1969లో ఢిల్లీలో గాలిబ్ శత వర్ధంతి ఉత్సవాలకు బ్రిటన్, రష్యా, ఆఫ్ఘానిస్థాన్, అమెరికా, ఇరాన్ వంటి ఎన్నో దేశాల నుండి ప్రతినిధులు వచ్చారు. గాలిబ్ గ్రంథాలను ఉరుదూ పర్షియన్ భాషలో సోవియట్ యూనియన్ ప్రచురించింది. భారత ప్రభుత్వం గాలిబ్‌ను ‘విశ్వకవి’గా ప్రకటిస్తూ ఒక మంచి స్మారక చిహ్నం నిర్మించింది. తాను ఏర్పాటు చేసుకున్న కొత్త కవితా రీతులతో తనకు తానై నిర్భయంగా నిలిచిన మహాకవి గాలిబ్. అందుకే ప్రపంచం నలుమూలలా ఆయన పుస్తకాలు ఎన్నో భాషల్లోకి అనువదింపబడి ఉన్నాయి. గాలిబ్ రాజ వంశానికి చెందినవాడు. కత్తి పట్టిన తాత తండ్రుల పద్ధతి నచ్చక, ఈయన కలం పుచ్చుకున్నాడు. వారికి రణభేరి వినిపిస్తే ఈయనకు కవితా కంకణ నిక్వణం వినిపించిందేమో!

గాలిబ్ పూర్వులు ఆసియా నుండి పద్దెనిమిదో శతాబ్దంలో మన దేశానికి వలస వచ్చారు. గాలిబ్ తాత లాహోరు గవర్నర్ వద్ద, అలాగే ఢిల్లీలో రెండవ షా ఆలం వద్ద ఉద్యోగం చేశాడు. అతని జ్యేష్ఠ కుమారుడు అబ్దుల్లా బేగ్ ఖాన్ ఒక సైనికాధికారి కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగానే అసదుల్లా ఖాన్ గాలిబ్ పుట్టాడు. ఆ రోజు 27 డిసెంబర్ 1797. గాలిబ్ చదువుకున్నది రెండు సంవత్సరాలే. అతనిని ఒక ప్రైవేటు ఫారసీ పాఠశాలలో చదివించారు. అక్కడ ఆయన పాత ఫార్శీ గ్రంథాల్లోంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. అప్పట్లో సభలు, సమావేశాలు, సాహిత్య గోష్ఠులు అన్నీ ఆనాటి అధికార భాష ఫారసీలోనే జరిగేవి. అప్పటికి గాలిబ్‌కి పన్నెండు సంవత్సరాలు. ఇరాన్ నుండి వచ్చిన అబుద్ స్సమద్ అనే పండితుని వద్ద ఫారసీ, అరబ్బీ కొంచెం కొంచెం నేర్చుకున్నాడు. ఆ రెండు సంవత్సరాలే గాలిబ్ శ్రద్ధగా చదివిందీ, కుటుంబంతో కలిసి ఉన్నదీ కూడా!

పదమూడవ యేట గాలిబ్‌కి పెళ్లి చేశారు. పెళ్లికాగానే ఆ దంపతులు ఆగ్రా నుండి ఢిల్లీ వచ్చారు. ఆయనకు ఢిల్లీ నగరమంటే ఎంతో ఇష్టం. అందుకే 1812 నుండి జీవితాంతం అక్కడే ఉన్నాడు. భార్య లాహోరు రాజవంశపు కన్య. మామ ఇలాహి బక్ష్ ఖాన్ ప్రముఖ కవి. సాహిత్యపరంగా గొప్పవాడు. అందరికీ తెలిసిన వాడు. అదీగాక, లాహోరు నవాబుకు చిన్న తమ్ముడు. ఆ రోజుల్లో లాహోరు నవాబులకు, ఢిల్లీ పాలకులకు మైత్రీ సంబంధాలు బావుండేవి. అన్ని అవకాశాలు కలిసి రావడం వల్ల గాలిబ్ ప్రతిభ వికసించింది. రాజులు, సైనికాధికారులు, పండితులు, కవులు, బంధువులు, సామాన్యులు ఇలా అన్ని రకాల వాళ్లతో గాలిబ్ కలుస్తూ ఉండడం వల్ల వారి వారి ఆలోచనలు, అనుభవాలు, సమస్యలు ఆకళించుకో గలిగాడు. ఆకళించుకున్నది కవిత్వంగా మలుచుకోగలిగాడు.

సాహిత్య ప్రవేశం:
పద్నాలుగేళ్లకే గాలిబ్ ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి, సాహితీ సామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. అప్పటి నుండి అనర్గళంగా కవితా వాహిని అతని కలం వెంట పరవళ్ళు తొక్కింది. కాని గాలిబ్ నోట కవిత పలకడం మొదలవడంతోనే దురదృష్టవశాత్తు అతని గృహలక్ష్మి ఎడబాటైపోయింది. సరిగ్గా అది మొగలుల సామ్రాజ్యం క్షీణించి, వైభవం తుడుచుకుపోయి ఉన్న సమయం. ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం వచ్చి అధికారం సంపాదించుకున్నారు. వారిచ్చే బత్తెంతో ఢిల్లీ చక్రవర్తే రోజులు గడుపుకుంటున్నాడు. రాజు అధికారం ఢిల్లీ కోటకు మాత్రమే పరిమితం. ఇక చక్రవర్తి పై ఆధాపడిన వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉండేవో ఊహించుకోవచ్చు.

పదిహేను సంవత్సరాల వయసులో గాలిబ్ అస్పష్టమైన భాషను ఉపయోగించి కవితలు రాసే వాడు. అవి జనానికి అర్థమయ్యేవి కావు. కాని ఆయన కవుల జాబితాలో చేరిపోయాడు. ‘ముషాయిరా’లలో పాలుగొనేవాడు. కవిత్వం అయోమయంగా ఉందని శ్రోతలు గగ్గోలు పెట్టేవారు. ‘దానీదీనా’ తర్వాత సరళంగా రాయడానికి కృషి చేశాడు. తొలి రోజుల్లో గాలిబ్ తన రచనలు ‘అసర్’ అనే పేరుతో ప్రకటించే వాడు. ఆ రోజుల్లో ఉరుదూ పూర్తిగా అభివృద్ధి కాలేదు. క్లిష్టమైన భావాలు కవిత రూపంలో ప్రకటించాలంటే భాష చాలేది కాదు. ఎంతో మంది కృషి వల్ల తరువాతి కాలంలో ఉరుదూ అందమైన కవిత్వ భాషను తయారు చేసుకుంది.

చివరి మొగల్ చక్రవర్తి బహద్దుర్ షా జఫర్ గొప్పకవి. తన రాజ్యంలోని కవి పండితులను దగ్గరికి తీసేవాడు. అతని సాహిత్య సలహాదారు జవ్వక్ అనే పండితుడు చనిపోగా ఆ పదవి గాలిబ్‌కు దక్కింది. మొగల్ షాహి నమోనాను ఫారసీలో రాయమని బహద్దర్ షా జఫర్ గాలిబ్‌ను కోరాడు. అందుకు సంవత్సరానికి రూ. 600 మంజూరు చేశాడు. దానికి తోడు భార్య వైపు నుండి వారసత్వంగా సంవత్సరానికి రూ. 750 అందుతూ ఉండేవి. వాటితో గాలిబ్ కవి రాజులా బతికాడు. బ్రిటీష్ వారి ప్రాబల్యం అధికమవడంతో ఒక రకంగా గాలిబ్‌కు కష్టాలు ఎక్కువయ్యాయి. తనను ఆదరించే బహద్దర్ షా జఫర్‌కు ద్వీపాంతర వాస శిక్ష విధించి రంగూన్ పంపారు. తను వారికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడేమోననే అనుమానంతో భరణం (పింఛను) ఆపేశారు.

ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత దారిద్య్రం బాధించినా గాలిబ్ ఇతరులను సహాయమడుగలేదు. ఆయన కొచ్చే ఆదాయం సరిగ్గా నౌకర్ల కివ్వడానికి సరిపోయేది. ఎప్పుడూ ఠీవిగా పల్లకీలో తిరిగేవాడు. విలువైన దుస్తులు, మంచి భోజనం కోరేవాడు. ఆయన జీవితపు నడక తొట్రు పడినా, ఆయనెక్కడా, ఎప్పుడూ తొట్రుపడలేదు. అదే బింకం, అదే దర్జా, అదే నిర్భయం, అదే ధైర్యంతో జీవితాంతం బతికాడు. ఎన్ని బాధలొచ్చినా ఎదుర్కొంటూనే బీదవారికి, అసహాయులకు దానాలు చేస్తుండేవాడు. కవిగానే కాదు, సమాజంలో మంచి మనిషిగా, మనసున్న మనిషిగా గుర్తుండిపోయాడు.

పింఛను ఆగిపోవడం వల్ల ఆయన జీవితం దుర్భరమైంది. గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు అప్పీలు చేసుకుందామని ఢిల్లీ నుండి కలకత్తా బయలుదేరాడు. అనారోగ్యం ఆయనను వెన్నంటి వేటాడింది. కాన్పూర్, కాశీ, చాందా, లక్నో వంటి పట్టణాలలో ఆగుతూ ఆగుతూ మూడు సంవత్సరాల తర్వాత కలకత్తా చేరాడు. ఒక్క లక్నోలోనే ఐదు నెలలుండాల్సి వచ్చింది. ఏమైతేనేం ఆయన శ్రమకు అర్థం ఉందన్నట్లు మళ్లీ పింఛను మంజూరయ్యింది. తర్వాత మెల్లిగా ప్రభుత్వపరంగా గౌరవం లభించింది. విలియం బెంటింగ్ కలకత్తాలో పెద్ద సభ ఏర్పాటు చేసి గాలిబ్‌ను ఘనంగా సన్మానించాడు. దాంతో ఎడింబరో రాజు తన ఆస్థానంలో స్థానమిచ్చి అనేక వసతులు కల్పించాడు. తర్వాత విక్టోరియా రాణి ఆస్థాన కవిగా నియమించడానికి, ఆయన గ్రంథాలు ప్రచురించడానికి బ్రిటీష్ ప్రభుత్వం ముందుకు రాలేదు. అందుకు వారి రాజకీయ కారణాలేవి ఉన్నా, తనను పూర్తిగా గౌరవించడం వారికి చేతకాలేదని గాలిబ్ వారి మీద జాలిపడ్డాడు.

పూర్వపు ఉర్దూ కవులందరూ ఫారసీ భాషపై వ్యామోహంతో రచనలన్నీ ఆ భాషలోనే చేశారు. అందుకు భిన్నంగా గాలిబ్ తన ఉర్దూ కవితను సహజంగా అభివృద్ధి చేశాడు. అప్పటి సంప్రదాయాన్ని ఎదిరించిన ధైర్యవంతుల్లో ప్రప్రథముడయ్యాడు. తనదైన విధానం, తనదైన వ్యక్తీకరణతో తనదైన గొంతుతో తనకు తానే ప్రత్యేకంగా నిలబడ్డాడు. ఉర్దూ కవితను గొప్ప కళా నైపుణ్యంతో, ప్రతిభతో, ప్రగతి పథాన నడిపించాడు. తన ‘గజల్’లలో అతి సున్నితమైన, సుకుమారమైన అనుభూతులను, ఆంతరంగిక విషయాలను వినిపించాడు. శ్రోతల పాఠకుల హృదయ కుహరాలలో అవి ప్రతిధ్వనించేవి. తన స్థితిని, తన దేశ పరిస్థితిని, తమ సమస్యల్ని, సామాజిక స్థితిగతుల్ని, మానవ జీవనంలోని ఎగుడు దిగుళ్లను, ఆధ్యాత్మిక చింతనను అన్నింటినీ కలగలిపి తన కవితలో వాటి సారం పిండేవాడు. దాన్ని విశ్వజనీనం చేసేవాడు. ఫలితం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఆయన చనిపోయి ఒకటిన్నర శతాబ్దాలయినా ఆయన కవిత్వంలో ఆయన సజీవంగా ఉన్నాడు. తరతరాలకు స్ఫూర్తినందిస్తూనే ఉన్నాడు. కవిత్వపరంగా విశ్వ వ్యాప్తమైన విశ్వనరుడాయన!

గాలిబ్ చివరి దశ చాలా దుర్భరంగా గడిచింది. అల్లాహ్ ఎప్పుడూ అయితే తమ భక్తుణ్ణి మాత్రం ఎక్కడా ప్రకటించుకోలేదు. లెక్కలేనంత మంది శిష్యులు ఆయన చుట్టూ తిరుగుతుండేవారు. చివరి దశలో వృద్ధాప్యంతో పోరాడుతున్నప్పుడు శిష్యులలోని హిందువులు ఆయనను ఆదరించారు. తన డెబ్బయి రెండవ యేట 15 ఫిబ్రవరి 1869న ఆయన భౌతికంగా కనుమరుగయ్యాడు. చంద్రుడు ఉన్నంత సేపే వెన్నెల ఉంటుంది. సెలయేరు పారుతున్నంత సేపే గలగలా రావం వింటాం. చంద్రుడు వెళ్లిపోతే, నీళ్లింకిపోతే ఏమీ ఉండదు. కాని ఇప్పుడు గాలిబ్ లేడు. ఆయన కవిత ఉంది. కవితల్లో ఆయన ఆత్మ ఉంది. మనసు పెట్టి కవిత్వం ఆస్వాదించే వారితో ఆయన ‘ఆత్మ’ మాట్లాడుతుంది! లపట్నా పర్నియామె షోలయే ఆతిష్ కా ఆసా హై వలె ముష్కిల్ హై హక్మతో దిల్ మె సొజెగంచు పానేకా పత్రం మీద నిప్పు కణికెను దాచిపెట్టొచ్చు. గుండెలో దుఃఖపు బాధ భరించలేము అని అర్థం మరో చోట అంటాడు “మృతి నెరుంగని మింటి దేవతల కన్న నలుగురికి మేలు చేసెడి నరుడే మిన్న” అని ! (అను: డా. దాశరథి) అలా మనిషి ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు గాలిబ్

Story about Mirza Ghalib Biography