Home తాజా వార్తలు పాత్రికేయుని నుంచి పాలకుని దాకా…

పాత్రికేయుని నుంచి పాలకుని దాకా…

Story about PV Narasimha Rao Political career

పివి రాజకీయ అరంగ్రేటం ఎలా జరిగింది?

నాగపూర్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బి పూర్తి అయినప్పటికీ అక్కడే ఉండిపోయిన పీవీ నరసింహారావు హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిర్బంధ పాలనపై దేశానికంతకు తెలియజేయాలన్న ఉద్దేశంతో జాతీయ స్థాయిలో వెలువడే ఇంగ్లీస్, హిందీ పత్రికలకు అనేక వ్యాసాలు రాస్తూ వచ్చారు. ఆ రోజుల్లో నాగపూర్ హిందూమతం, సంస్కృతికి సంబంధించిన సభలు, సమావేశాలు స్వేచ్ఛగా జరుగుతుండేవి. వీరసావర్కార్, గోఖలే, తిలక్, శివాజీ మహారాజ్ వంటి మహానీయుల పట్ల అక్కడి ప్రజలకున్న గౌరవభావం, ఆరాధన వంటీ అంశాలు పీవీలో చెరగని ముద్ర వేశాయి. దేశభక్తి, జాతీయ భావం, స్వదేశ వేషభాషల పట్ల ఆయన ఆకర్షితడయ్యారు. మరోవైపు స్వాతంత్య్ర పోరాటానికి బ్రిటిష్ పాలకులు తలొగ్గారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. అయితే భారత యూనియన్లో చేరడానికి హైదరాబాద్ నిజాం అంగీకరించలేదు.

ఒకవైపు దేశవ్యాప్తంగా స్వాంత్య్ర సమరోత్సవాలు జరుపుకుంటుండగా హైదరాబాద్ సంస్థానంలో వీటిని నిషేదించారు. నిషేద్ఞాలు ఉల్లంఘించి హైదారాబాద్లో విద్యార్థులు జాతీయ జెండాను ఎగరవేయడానికి ప్రయత్నిస్తే నిజాం సర్కార్ వారిని ఎక్కడికక్కడే అరెస్టులు చేయగా, రజాకార్ల సేనలు దౌర్జన్యాలు, దాడులకు దిగాయి. స్వాతంత్య్రం ప్రకటించడానికి ముందు రోజు రాత్రే స్వామి రామానందాతీర్థ వంటి ముఖ్య నాయకులను పొలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతుండగా హైదరాబాద్ సంస్థానంలో మాత్రం తమను భారత యూనియన్లో చేర్చుకోవాలనే ఆందోళన ఉధృత రూపం దాల్చింది. దీంతో ఇండియన్ యూనియన్లో చేరాలని నిజాంపై వత్తిడి పెరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, నిజాం ప్రభుత్వానికి మధ్య ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు, రాయబారాలు జరిగాయి. రెండు ప్రభుత్వాలకు మధ్య 1947 నవంబర్ 29న యథాతధపు ఒడంబడిక్ణఅనే పేరుతో ఒక ఒప్పందం కుదిరింది.

జవహార్లాల్ నెహ్రూ స్వయంగా హైదరాబాద్కు వచ్చి నిజాంతో మాట్లాడి ఒప్పించారు. ఒక ఏడాది పాటు భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అయితే తమ ప్రతినిధిగా కెఎం మున్షీ అనే అధికారి హైదరాబాద్లోనే ఉండి పర్యవేక్షిస్తారనేది ఈ ఒప్పందం. దీనికి నిజాం ఒప్పుకున్న రజాకార్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మరింత రెచ్చిపోయి రజాకార్లు తమ దమనకాండను కొనసాగించడం ప్రజల తిరుగుబాటుతో నిజాం సంస్థానం మరింత అల్లకల్లొలంగా మారింది. స్వాతంత్య్ర వచ్చాక కూడా ఏడాది పాటు ఓపిక పట్టిన భారత ప్రభుత్వం ఎట్టకేలకు 1948 సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ సంస్థానంలోకి భారత సైన్యాలు ప్రవేశించాయి. ఐదు రోజుల తర్వాత సైనిక చర్యతో లొంగిపోయిన నిజాం ప్రభువు ఇండియన్ యూనియన్లో తన సంస్థానాన్ని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.

పోలీస్ చర్య తర్వాత వరంగల్కు చేరుకున్న పీవీ, తన స్నేహితుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి కాకతీయ పత్రిక్ణ పేరుతో వార పత్రికను స్థాపించారు. సదాశివరావు దీనికి ఎడిటర్గా ఉండగా పత్రికా నిర్వహణ భారాన్ని పీవీ చేపట్టారు. ఉన్నత ప్రమాణాలు, నైతిక విలువల అవశ్యకతను కాకతీయ పత్రిక ప్రబోధించింది. రాజకీయంగా ప్రజాస్వామ్య-సామ్యవాద సిద్ధాంతాల వ్యాప్తికి కృషి చేసింది. వ్యవసాయ, కార్మిక, సహకార, విద్యా, సాంఘీక సంక్షేమాలపై ప్రత్యేక సంచికలను కూడా ప్రచురించింది. పీడిత ప్రజల హక్కులు, ప్రయోజనాలను బలపరుస్తూ ప్రగతిశీల భావాలుగల అభ్యుదయ పత్రికగా పేరు తెచ్చుకుంది. పీవీ కూడా ఈ పత్రికలో అనేక వ్యాసాలు, వ్యాఖ్యలు, కథలు, కవితలు, విమర్శలను విజయ, జయ కలం పేర్లతో రాస్తూ వచ్చారు. (ఈ పేర్లతో నే తన కవల పిల్లలకు జయ-విజయగా పెట్టుకున్నారు).

ఈ పత్రికకు చందాలు కట్టించడం, ప్రకటనలు సేకరించడం, రచయితలు, కవుల నుంచి వ్యాసాలు సేకరించడం ప్రూపులు దిద్దడం వంటి పనులన్నింటినీ పీవీనే చూసుకునే వారు. పెద్ద పెద్ద వాళ్లతో వార్షిక చందాలు కట్టించడానికి పీవీ నానా తంటాలు పడుతుండగా ఎడిటర్ పాములపర్తి సదాశివరావు ఏమో ఉన్నవాళ్లకు వ్యతిరేకంగా రోజు ఏదో ఒకటి రాయడం వల్ల చందాలు కట్టిన వారి నుంచి పీవీ ఎన్నో తిట్లుతినాల్సిన పరిస్థితిని ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో పత్రికను నడపాలా? వద్దా? అని పీవీ తీవ్ర సంఘర్షనకు లోనయ్యారు. ఈ అంశంపై తనను ఏమి చేయామంటారని కాళోజీని పీవీ సలహా అడిగితే నీకెందుకీ ఆవేదన. నీకేవరన్నా ఫీజు ఇస్తున్నారా? కేసు ఇచ్చారా? మీ వాణిని వినిపించడానికేగదా పత్రిక నడిపేది. మనసునిండి ఒలకబోస్తున్న ధారను ఎవరు ఆపగలరు? అని ప్రశ్నించారంట. కాళోజీ మాటల్లోని అనేక అర్థాలు తమను పత్రిక నడపడానికే ముందుకు తీసుకెళ్లినట్టు పీవీ ఒకచోట పేర్కొన్నారు. అభ్యుదయ భావాలుగల కవితలు, కథలను ప్రోత్సహిస్తూ ఎందరో యువ రచయితలను ప్రోత్సహించేవారు. కాళోజీ, హీరాలాల్ మోరియా, ఊటుకూరు రంగారావు, దాశరథి వారి రచనలు కూడా కాకతీయ పత్రికలో ప్రచురితం అయ్యాయి.

పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. అతివాద వర్గానికి స్వామి రామానందతీర్థ నాయకత్వం వహించగా, మితవాద వర్గానికి జనార్దన్రావు దేశాయి, బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి నాయకత్వం వహించారు. జమలాపురం కేశవరావు, బొమ్మకంటి సత్యనారాయణరావు, కోదాటి, ఎంఎస్ రాజలింగం, ఎస్‌ఆర్ వెంకటేశం, పీవీ నరసింహారావు తదితరలంతా స్వామి రామానందతీర్థను అనుసరించారు. మితవాద నాయకులు, భూస్వామ్యం వర్గాలు రామానందతీర్థను వ్యతిరేకించారు. కమ్యూనిష్టులు సాయుధ పోరాటం సమస్యను శాంతి భద్రతల సమస్యగా పరిగణించకూడదని, తెలంగాణ సమస్య భూమి, యాజమాన్యం సమస్యగా రామానందతీర్థ అభిప్రాయపడేవారు. సేద్యం చేసే రైతుకే ఆ భూమిపై యాజమాన్యపు హక్కు కల్పిస్తూ శాసనం చేయాలన్నది ఆయన డిమాండ్.

స్వామిజీ అభ్యుదయ సిద్ధాంతాలను, ఆశయాలను సంపూర్ణంగా సమర్థించిన ప్రగతిశీల కాంగ్రెస్ వాదులలో ఒకరైన పీవీ ఆయన గురించి ఒక చోట నితెలంగాణలో ఆయన చరిత్ర సృష్టించారు. ఆయనలాంటి వ్యక్తిత్వం గల మరొకరిని ఉదహరించడం అసాధ్యమనడంలో నాకెలాంటి సందేహం లేదు. ఆయన నుంచి ప్రేరణ పొందిన నాబోటి రాజకీయ కార్యకర్తలకు ఆయన కేవలం నాయకుడిగా, వ్యక్తిగా భావించలేం. ఆయన ఒక ప్రతీకగా, ఒకశక్తిగా, ఒక దీపస్తంభంగా, ఒక సంస్థగా భావిస్తాం పేర్కొన్నారు. భూ సంస్కరణల వంటి ప్రగతిశీల చట్టాలను ప్రవేశ పెట్టే విషయంలో ఆయన వైఖరి స్పష్టంగా, కచ్చితంగా, రాజీలేనిదిగా ఉండేదని కూడా పీవీ కొనియాడారు. తనలో బలంగా నాటుకున్న ఈ అభిప్రాయల వల్లనే రామానందతీర్థను అనుసరించడానికి కారణంగా పీవీ విశ్లేషించారు కూడా.

1952 జనవరిలో హైదరాబాద్ స్టేట్లో శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు కమ్యూనిష్టులు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించారు. కమ్యూనిస్టు నాయకులు పీఫుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పక్షాన పోటీ చేయగా కాంగ్రెస్ తరఫున కరీంనగర్ నుంచి పీవీ, కాళోజీ నారాయణరావు జంటగా (ఇద్దరేసి సభ్యుల పోటి చేయడం ఉండేది) పోటి చేసి ఇద్దరూ ఓడిపోయారు. కాళోజీ 1400 ఓట్లతో పీవీ 80,000 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ( తన ఓటమిపై కాళోజీ ఏమన్నారంటే నినా మడికొండ ఓట్లతో ఓడాను అని చమత్కరించారు. కాళోజీ పుట్టిపెరిగిన ఊరు మడికొండ. అక్కడ అప్పుడు సరిగ్గా 1400 ఓట్లే ఉండేవట. ఆ తర్వాత కాళోజీ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా గెలిచి సొంత ప్రభుత్వాన్నే విమర్శించడంతో రెండోసారి అవకాశం ఇవ్వలేదు).

కమ్యూనిష్టులు బలంగా ఉన్న కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పిడీఎఫ్ ఘన విజయం సాధించగా కరీంనగర్లో పీవీపై బద్దం ఎల్లారెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్కు చెందిన అతిరథ మహారథులు జమలాపురం కేశవరావు, బొమ్మకంటి, కోదాటి వంటి ప్రముఖులందరికీ ఓటమి తప్పలేదు. అయితే తెలంగాణలో కమ్యునిష్టులు అధిక స్థానాలను గెలిచినప్పటికీ అప్పుటి హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్నా మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ సాధించిన సీట్లతో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రథమ ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో చేరడం వల్ల దిగంబరరావు బిందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షత పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో స్వామి రామానందతీర్థ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి, రాష్ట్ర కార్యదర్శిగా పీవీ నరసింహారావును నియమించారు. అక్కడి నుంచి పీవీ రాష్ట్ర నాయకునిగా ఎదిగారు. ఆ తర్వాత వరుసగా 1957, 1962, 1964, 1967 నాలుగు సార్లు మంథని నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి 1962లో న్యాయశాఖ మంత్రిగా పని చేసి ఆ తర్వాత మంత్రివర్గాల్లో కొనుసాగుతూ వచ్చారు. 1969 నుంచి జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల ఫలితంగా 1971లో అప్పటి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో 30,సెప్టెంబర్, 1971న (దసరా పండుగ రోజు) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

పీవీ సీఎం అయిన సందర్భంగా ఆయన స్నేహితుడు, పాములపర్తి సదాశివరావు జనధర్మ పత్రికలో రాసిన వ్యాసం లో ఎమన్నారంటే, నిఅతనిలో బాల్యం నుంచీ భావావేశం అనే సహజ లక్షణం ఉంది. రసాస్వాదన చెందే స్వభావ ప్రేరణ ఉంది. కళాత్మకంగా తాదాత్మ్యానుభవం పొందే చిత్తస్ఫూర్తి ఉంది. అన్వేషణ శీలమైన సూక్ష్మవివేకం, ఆస్వాదనాశీలమైన గ్రహణ ప్రకర్ష-అపూరూపమైన ధీవి భావం, స్వచ్ఛందమైన వక్త ృత్వ వైశద్యం అను సర్వాంగ లక్షణాలు నిబిడీకృతమై ఉన్నాయి. మరి ఆశ్చర్యమేమిటంటే అతడు మహాకవి కాలేదు, గొప్ప నవలా రచయిత కాలేదు, సంగీత విద్యాంసుడు గానో, లేదా చిత్రకారుడిగానో రూఢి చెందలేదు. తత్వవేత్తగానో, శాస్త్ర పరిశోధకుడుగానో విఖ్యాత న్యాయవాదిగానో కూడా పేరుగాంచలేదు. అందుకు బదులుగా పీవీ ఈ నాడు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కే పరిణామామం చూస్తున్నాం అని విశ్లేషించారు.

Story about PV Narasimha Rao Political career