Home ఎడిటోరియల్ రజనీకాంత్ ‘రాజకీయం’

రజనీకాంత్ ‘రాజకీయం’

Sampadakiyam     పేరు సంపాదించాలంటే పేరున్న వారిని తిట్టాలి అని నానుడి. కాని అసాధారణమైన పేరున్న వారే ఆ పనికి ఒడిగట్టడాన్ని ఏమనాలి? ప్రఖ్యాత చలన చిత్ర నటుడు, దేశ విదేశాల్లో అశేష అభిమాన జన ధనమున్న రజనీకాంత్ అతడు మోయలేనంత కీర్తిని గడించుకున్నాడు. అయినా తనకింకేదో కావాలనుకుంటున్నాడు. ఎంజిఆర్, జయలలిత, ఎన్‌టిఆర్‌ల మాదిరిగా రాజకీయాలలో రాష్ట్రస్థాయి అధికార శిఖరాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. అందుకు అనువైనదిగా తాను భావిస్తున్న ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఎంచుకున్నట్టు రూఢి అవుతున్నది. అదే ఆయనను ఇప్పుడో పెద్ద వివాదంలోకి నెట్టి వేసిందని స్పష్టపడుతున్నది. ఈ నెల 14వ తేదీన చెన్నైలో జరిగిన ‘తుగ్లక్’ పత్రిక 50వ వార్షికోత్సవ ఘట్టాన్ని రజనీకాంత్ తన రాజకీయ దిశను వ్యక్తం చేయడానికి ఒక అవకాశంగా తీసుకున్నట్టు బోధపడుతున్నది.

‘తుగ్లక్’ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు ‘చో’ రామస్వామి అనుసరించిన మితవాద రాజకీయాల గురించి తెలిసిందే. ద్రావిడ, ఆత్మాభిమాన, బ్రాహ్మణీయ, విగ్రహారాధన వ్యతిరేక ఉద్యమ సారథి స్త్రీల అణగారిన వర్గాల పక్షపాతి పెరియార్ రామస్వామిని వక్రీకరించి చూపడం ద్వారా ఆయన అభిమానులు అపారంగా ఉన్న తమిళనాడులో ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించాలని అందులో భాగంగా ఆ రాష్ట్రంలో హిందుత్వ రాజకీయాల పునాదిని గట్టి పరచాలని తన అభిమానులను అటువైపు మళ్లించాలని రజనీకాంత్ సంకల్పించినట్టు కనిపిస్తున్నది. 1971లో సేలంలో తీసిన ఒక ఊరేగింపులో పెరియార్ దేవతల విగ్రహాలను ముఖ్యంగా సీతారాముల ప్రతిమలను నగ్నంగా ప్రదర్శింపచేశాడని వాటికి చెప్పుల దండ వేయించాడని ఆ వార్తను ప్రచురించిన ‘తుగ్లక్’ పత్రిక అప్పటి డిఎంకె ప్రభుత్వం నుంచి అణచివేతను ఎదుర్కొన్నదని దాని సంపాదకుడు ‘చో’ రామస్వామి అంతటి గొప్పవాడని రజనీకాంత్ అన్నట్టు వార్తలు వచ్చాయి.

దీని మీద పాలక అఖిల భారత అన్నాడిఎంకె (ఎఐఎడిఎంకె) సహా ద్రావిడ పార్టీలన్నీ సహజంగానే అగ్గి మీద గుగ్గిలాలయ్యాయి. పెరియార్ గురించి ఆనాటి సేలం ప్రదర్శన గురించి వాస్తవాలు తెలియక వినికిడిగా తన దృష్టికి వచ్చిన దానినే రజనీకాంత్ పొరపాటున అని ఉంటే ఆ తర్వాత దానిని ఆయన సరిదిద్దుకుని ఉండేవాడు. కాని అలా జరగలేదు. తాను అన్న దానికి కట్టుబడి ఉంటానని క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించాడు. బ్రాహ్మణీయ, విగ్రహారాధన వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించిన పెరియార్‌కు హిందూ దేవతల పట్ల సదభిప్రాయం లేని మాట వాస్తవం. కాని 1971లో సేలంలో తీసిన ప్రదర్శనలో సీతారాముల విగ్రహాలను నగ్నంగా ఊరేగించలేదని వాస్తవ సమాచారం తెలియజేస్తున్నది. అందుకే పెరియార్‌ను రజనీకాంత్ వక్రీకరించాడని ద్రావిడ పార్టీలు అంటున్నాయి.

ఆ ఊరేగింపులో పెరియార్ కొంత మంది హిందూ దేవుళ్ల, దేవతల నగ్న విగ్రహాలను ప్రదర్శించిన మాట నిజమేగాని అందులో సీతారాముల ప్రతిమలు లేవని అప్పట్లోనే ‘ది హిందూ’ పత్రిక ప్రచురించిన వార్త పేర్కొన్నట్టు చెబుతున్నారు. రజనీకాంత్ ఎందుకోసం ఇలా అబద్ధాలను ఆశ్రయించాడో తెలియడం లేదని, భారతీయ జనతా పార్టీ వారే ఆయన చేత ఈ అసత్య ప్రకటన చేయించి ఉంటారని ద్రావిడర్ విడుతలై కజగం అనే స్థానిక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు కొలత్తూర్ మణి అభిప్రాయపడ్డారు. తమిళనాడులో ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన పార్టీగా ఉన్న డిఎంకె పట్ల రజనీకాంత్ తన వ్యతిరేకతను దాచుకోలేదు. ఆ పార్టీ పత్రిక ‘మురసోలి’ని డిఎంకె వారే చదువుతారు, ‘తుగ్లక్’కు మేధావి పాఠకులున్నారు అని కూడా ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో గల 39 స్థానాల్లో 38ని డిఎంకె కూటమి గెలుచుకున్న సంగతి తెలిసందే.

పెరియార్ విషయానికి వస్తే దేశంలో జ్యోతిబా ఫూలే, అంబేడ్కర్‌ల సరసన చేర్చదగినవాడు. వారితో సమానంగానూ, కొన్ని సందర్భాల్లో ఎక్కువగానూ ప్రత్యామ్నాయ సామాజిక తత్వాన్ని ప్రచారం చేసినవాడు పెరియార్. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో బ్రాహ్మణా ధిపత్యం వెన్ను విరిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. హిందీ భాషా వ్యతిరేకోద్యమాన్ని పరాకాష్ఠకు తీసుకు వెళ్లి తమిళుల సొంత భాషాభిమానాన్ని శిఖరాయమానం చేసిన వాడు. ‘నా వంటి సామాన్యుడు ఈ రోజున ఇంత గొప్ప పదవిలో ఉండడానికి కారణం ఆయనే’ అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడంటే పెరియార్ ఘనత ఎటువంటిదో తెలుస్తున్నది. దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలకు భిన్నంగా తమిళనాడు రాణిస్తూ ఉండడానికి పెరియార్ రూపొందించిన సామాజిక విప్లవాత్మక ఆలోచనే కారణం. అటువంటి మహానుభావుడి గురించి అసత్య ప్రచారం చేసి దానికి కట్టుబడి ఉన్నానని చెప్పుకుంటున్న రజనీకాంత్ లక్షం తమిళనాడులో ద్రావిడ రాజకీయాలకు తెర దించి హిందుత్వ దారిలోకి మళ్లించాలనే బిజెపి వ్యూహకర్తలకు పావుగా ఉపయోగపడడమేనని అనుకోక తప్పడం లేదు.

Story about Rajinikanth Political Entry