Home ఎడిటోరియల్ పార్టీలు ఏమైనా ఎదిగాయా?

పార్టీలు ఏమైనా ఎదిగాయా?

story about telangana assembly elections
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత ఎన్నికల తర్వాత నాలుగున్నర సంవత్సరాలలో అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌తో పాటు వివిధ ప్రతిపక్షాలు ఎదిగినది ఎంత, తగ్గినది ఎంత అనే ప్రశ్న సమీక్షించదగినది అవుతున్నది. వివరంగా మాట్లాడుకునే ముందు క్లుప్తంగా చూడాలంటే, టిఆర్‌ఎస్ పార్టీకి తన ప్రభుత్వపు బలం లేదా బలహీనతలే తన బలం లేదా బలహీనతలుగా ఉన్నాయి. తాను స్వయంగా కూడా బలపడేందుకు చేసినదేమీ కన్పించదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉన్నచోటనే ఉండటమో లేక కొంత బలహీనపడటమో తప్ప, ముందుకు వెళ్లిన దేమీలేదు. ప్రతిపక్షం రాజకీయంగా చేయవలసింది ప్రభు త్వ వైఫల్యాలని తాను చెప్పే వాటిని ఎప్పటికపుడు ప్రజలలోకి సమర్థవంతంగా తీసుకుపోవటం,ఆయా అంశాలపై ప్రజలను మెప్పించే వాదనలు చేయటం, తన వైపు నుంచి నిర్మాణాత్మకంగా వ్యవహరించటమే తప్ప నెగెటివ్‌గా ఉన్నారనే అభిప్రాయం ప్రజలకు కలగకుండా జాగ్రత్త పడటం. అందువల్ల ప్రజలకు ప్రతిపక్షాలపట్ల గౌరవం, విశ్వాసం పెరుగుతాయి. ఇందులో కాంగ్రెస్‌కు ఒక పద్ధతి, దార్శనికత ఏదీ ఉన్నట్లు కన్పించదు.

ఇతర ప్రతిపక్షాల విషయం చూస్తే, గత ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల తర్వాత మూడవ స్థానం తెలుగుదేశంది. ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటు ప్రశ్నపై కపటనీతిని ప్రదర్శించి, ఆ విషయాన్ని ప్రజలు గ్రహించినప్పటికీ ఆ స్థాయిలో ఓట్లు, సీట్లు సంపాదించగలగటం మామూలు కాదు. ముఖ్యంగా బిసిలలో ఎన్‌టిఆర్ కాలం నుంచి గల సంప్రదాయిక పునాది, దానితో పాటు ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రులలో తగినంత మంది మద్దతు, హైటెక్ అభివృద్ధికి చంద్రబాబు కారణమని నమ్మిక గల యువకుల వంటివారు అందుకు కారణం. కాని ఒకసారి ఎన్నికలలో ఓడి ఇతర పరిస్థితులు కూడా ప్రతికూలమవుతూపోగా గత నాలుగేళ్లలో పార్టీ గణనీయంగా బలహీనపడింది. టిడిపి తర్వాత ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ మజ్లిస్ ఇత్తెహాదుల్ ఎ ముస్లిమీన్. ఆ పార్టీ అప్పటికన్న బలపడిందా లేక బలహీనపడిందా అంటే బహుశా ఎవరూ చెప్పలేరు. కాకపోతే, తెలంగాణా అంతటా విస్తరించాలనే ఆలోచన మాత్రం ముందుకు సాగినట్లు లేదు.

అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌తో మైత్రివల్ల వారందుకు గట్టి ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. విస్తరణ రీత్యా మజ్లిస్ కన్నా కొంత ఎక్కువే అయినా సీట్లను బట్టి తక్కువ అయిన బిజెపి, ఈ నాలుగేళ్ల కాలంలో గిడసబారిపోయే ఉంది. అందుకు కారణాలన్నీ స్వీయ వైఫల్యాలే. వీటన్నింటి తర్వాతి ఆరవ స్థానంలో ఉన్న వామపక్షాలు. సిపిఐ, సిపిఎంలను విడివిడిగా చూసినా, లేక కలిపి చూసినా పరిస్థితి అదే. గత ఎన్నికల తర్వాత నాలుగు మాసాలకు వీరు, మరికొన్ని వామపక్షాలు కలిసి భీకరమైన సంకల్పాలు కొన్ని చెప్పుకున్నారు. తదుపరి ఎన్నికల (2019) నాటికి తామే ప్రత్యామ్నాయం కాగలమన్నారు. కాని అందులో సగం కాలమైనా ప్రయాణించక మునుపే ఎవరి దారి వారిది అయింది. పోనీ ఎవరికి వారుగా బలపడింది కూడా లేదు. తమ మీడియా తమకు, సభల కోసం ఎవరి భావనలు వారికి ఉన్నాయి గనుక అట్టహాసాలు చేసి సంతృప్తి పడటం తప్ప.

తెలంగాణలో గత నాలుగేళ్ల రాజకీయ రేఖా చిత్రం ఇది. ఇటువంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగినపుడు ఫలితాలు ఏ విధంగా ఉండేదీ ఊహించటం కష్టం కాదు. అయితే ఒకటి చెప్పుకోవాలి. ఒకోసారి ప్రతిపక్షాల బలాబలాలకు, ఎన్నికల ఫలితాలకు సంబంధం ఉండదు. అనూహ్య ఫలితాలు వెలువడుతుంటాయి. ప్రభుత్వ వైఫల్యాలవల్ల లాభం పొందే శక్తియుక్తులు ప్రతిపక్షాలకు ఉండకపోవచ్చు. అంతమాత్రాన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు క్షమించరు. శిక్షించి తీరుతారు. అపుడు ప్రతిపక్షాలకు తామే అంచనా వేయని జాక్‌పాట్ విజయం వచ్చిపడుతుంది. మరి అటువంటి అవకాశాలు ఏవైనా రాష్ట్రంలో ఉన్నాయా? మరొక విధంగా అడగాలంటే, టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపట్లగాని, వ్యక్తిగతంగా కెసిఆర్ నాయకత్వం పట్లగాని కంటికి ఆనని తీవ్రమైన అసంతృప్తి ప్రజలలో గూడుకట్టుకుంటూ వస్తున్నదా? ఎక్కడా ఎవరికీ అసంతృప్తి అసలు లేదని కాదు. ఆ మాట అనటం అసత్యమవుతుంది. కాని అది పరిమితంగా మాత్రమే ఉందని ప్రతిపక్షాలు, ఇతర విమర్శకులు జనాంతికంగా అంగీకరిస్తున్న విషయం. కనుక, సీట్ల సంఖ్య మాట ఎట్లున్నా జయాపజయాల పరిస్థితి అనూహ్యంగా ఉండే అవకాశం లేదు. మరొక విధంగా చెప్పాలంటే, అధికార పక్షంపట్ల ప్రజలలో విస్తారమైన రీతిలో గూడుకట్టుకుంటూ వస్తున్న అసంతృప్తి అంటూ కన్పించదు.

మొత్తం మీద 201419 మధ్య కాలపు రాజకీయ చిత్రం ఇదీ. ఇపుడు కొద్దిగా వివరాలలోకి పోదాము. ముందుగా టిఆర్‌ఎస్ విషయం చూస్తే ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వపు బలాబలాలే ఆ పార్టీ బలాబలలు కూడా కావటం సాధారణం. పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా ప్రభుత్వాన్ని సమర్థించటం, విమర్శకులపై ఎదురు విమర్శలు చేయటం అన్నట్లుగా ఉంటాయి. ఆ మేరకు చూసినపుడు టిఆర్‌ఎస్ అదనంగా చేసిందిగాని, చేయనిదిగాని ఏమీ లేకపోవటం ఒక సహజస్థితి వంటిది. కాని ఈ రొటీన్‌కు అదనంగా ఒక అధికార పక్షం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో చేయవలసింది, చేయగలిగింది ఏమీ ఉండదా? తప్పకుండా ఉంటుంది. అది, తన సిద్ధాంతాల ప్రకారం ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం, ప్రజా సేవా కార్యకలాపాలలో పాల్గొనటం, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయేట్లు చూడటంవంటివి.

అందువల్ల ప్రజలకు మంచి జరగటం, ప్రభుత్వానికి మంచి పేరు రావటం, పార్టీ సిద్ధాంతాలు వ్యాపించటం, వీటన్నింటివల్ల ఇటు ప్రభుత్వం, అటు పార్టీ కూడా ప్రజాదరణ పొంది స్థిరపడటం వంటివి జరుగుతాయి. కాని ఎందువల్లనో టిఆర్‌ఎస్ ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. ఒక నిరంతర యుద్ధ పార్టీగా వ్యవహరించటం మినహా, రెండు ఎన్నికల మధ్య ఒక శాంతి పార్టీగా నిర్మాణాత్మక పార్టీగా చేయవలసినవి చేసి ఇతర పార్టీలకు ఒక నమూనాగా రూ పొందే ప్రయత్నం జరగలేదు. ఇటువంటి కార్యకలాపాల ప్రభావం ఎన్నికలలో గెలుపు ఓటములపై కూడా అనివార్యంగా ఉంటుంది. అయినప్పటికీ ఆపని జరగలేదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం బలంగా ఉన్నందున అందువల్ల టిఆర్‌ఎస్‌కు ఎన్నికల ఆదరణ లభించవచ్చునన్నది వేరే విషయం. కాని ఒక రాజకీయ సంస్థగా మాత్రం ఆ పార్టీ తనంతటతానుగా విడిగా బలపడింది లేదు.

కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్లలో రొటీన్ పద్ధతిలో తప్ప సృజనాత్మకంగా, కొత్త రీతిలో, నిజాయితీగా, వ్యవహరించింది శూన్యం. ప్రభుత్వం పట్ల వేర్వేరు విషయాలపై సామాన్య ప్రజలకు అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి? ఒక్క మాటలో చెప్పాలంటే మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లు. ప్రతిపక్షాలు ఈ విషయంగా గుర్తించకుండా ప్రతి దానిపై దాడి చేస్తూ పోవటంవల్ల ప్రజల దృష్టిలో వాటి విశ్వసనీయత దెబ్బతింటుంది. ఈ ధర్మసూకా్ష్మన్ని రాష్ట్ర కాంగ్రెస్ గుర్తించలేదు. మంచిని మంచి చెడును చెడు అంటూ, నిర్మాణాత్మకమైన సూచనలు చేసే పార్టీల పట్ల ప్రజలకు గౌరవం, నమ్మకం పెరుగుతాయి. కాని కాంగ్రెస్ అటువంటి దేమీ చేయకపోగా, అభివృద్ధి పథకాలని ప్రజలు భావిస్తున్న వాటిపై కుప్పలుగా కేసులు వేయటం వంటివి చేసి తన విశ్వసనీయతను మరింత దెబ్బ తీసుకున్నది. ఇతరత్రా కూడా పార్టీ యంత్రాంగం బలపడిందేమీ కన్పించదు.

టిడిపిది ఒక భిన్నమైన పరిస్థితి. తమకు సీమాంధ్రుల పార్టీ అనే ముద్ర రాష్ట్ర విభజన తర్వాత మరింత బలపడటం, పార్టీ శ్రేణులు ఇతర పార్టీలలో చేరుతుండటం, చంద్రబాబు సరైన నిర్దేశాలు ఇవ్వలేని స్థితి, ఇక్కడి సీమాంధ్ర ఓటర్లు తమ ప్రయోజనాల పరిరక్షణకు అధికార పక్షం వైపు కదలటం, పార్టీ తెలంగాణ నాయకత్వపు అసమర్థతల వంటి చిక్కుల మధ్య టిడిపి తన క్షీణ స్థితిని ఆపలేని విధంగా ఉంది. కనుక బలపడే ప్రసక్తి అన్నదే లేదు. బిజెపి లోగడ వాజ్‌పేయీ ప్రభుత్వం ఉన్నప్పటి అవకాశాలను ఎట్లా ఉపయోగించుకోలేకపోయిందో ప్రస్తుతం నరేంద్ర మోదీ కాలాన్ని కూడా అట్లానే ఉపయోగించుకోలేకపోతున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంలో తీవ్రమైన లోపాలున్నాయి. 2014 కన్నా ఇంకా బలహీనపడినట్లే కనిపిస్తున్నది. కమ్యూనిస్టులు కూడా అంతే. గత ఎన్నికల తర్వాత చెప్పుకున్న సంకల్పాలన్నీ గాలిలో కలిసిపోయాయి. వారికసలు ఏమి చేయాలన్నది, ఎట్లా చేయాలన్నది దిక్కు తోచకుండా ఉంది. ఈ నాలుగేళ్లలో ఆ పార్టీలు విస్తరించింది ఏమీ కన్పించదు.

                                                                                                                                                       –  టంకశాల అశోక్