Home ఎడిటోరియల్ నిత్య వెలుగుల సారస్వత క్షేత్రం

నిత్య వెలుగుల సారస్వత క్షేత్రం

Story about Telugu Language

 

భాష కేవలం సమాచార వాహిక మాత్రమే కాదు. ఒక సంస్కృతికి సూచిక. ప్రాచీన వారసత్వాన్ని పదిలంగా భవిష్యత్తు తరాలకు అందజేసే మాధ్యమం. ఒక భాషను దెబ్బ తీయడమంటే ఆ భాషా వ్యవహర్తల సంప్రదాయాలను, సంస్కృతిని, వారసత్వాన్ని దెబ్బ తీయడమే. తెలుగు భాషకు సైతం అలాంటి ముప్పు ఏర్పడ్డ సందర్భంలో ఏర్పడ్డ సంస్థ ఆంధ్ర మహాసభ. ఈ సంస్థలో జరిగిన చర్చల ఫలితంగా భాషా సాహిత్యాల వికాసం కోసం ప్రత్యేకంగా సారస్వత పరిషత్తు ఏర్పాటైంది. నిజాం రాజు పరిపాలన ఫలితంగా పరిపాలనా భాషగానూ బోధనా భాషగానూ ఉర్దూయే చలామణీలో ఉండేది. తెలుగు భాష అన్ని చోట్ల అవమానాలు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల నుండి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని పరిరక్షించవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర మహాసభ 1930లో ఏర్పాటైంది. తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించడం ఈ సంస్థ స్థాపన లక్ష్యం. జోగిపేటలో ప్రథమ సభలు జరుపుకున్నది మొదలు వెట్టి చాకిరీ, జమీందార్ల దోపిడీ, జాగీర్దార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పయనించింది ఈ సంస్థ. వరంగల్లులో జరిగిన తొమ్మిదవ మహాసభల్లో ప్రత్యేకంగా ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో పదవ ఆంధ్ర మహాసభలు 1943 మే 23, 24 తేదీల్లో జరిగాయి. అప్పటికే తొమ్మిదవ మహాసభలో నిర్ణయించిన ప్రత్యేక సాహిత్య సంస్థ వ్యవస్థాపనపై పదో మహాసభ చర్చించింది. ఈ చర్చల ఫలితంగా సంస్థ ఏర్పాటుపై ఒక స్పష్టత వచ్చింది. అనంతరం రెండు రోజులకే మే 26న మహాసభ నాయకులు హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ కు ఒక రూపం ఇచ్చారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంత రావు, బూర్గుల రాంకిషన్ రావు, గడియారం రామకృష్ణ శర్మ మొదలైన దిగ్గజాలతో ఉపసంఘం ఏర్పాటైంది. ఈ ఉపసంఘం పరిషత్తుకు పూర్ణ స్వరూపాన్ని ఏర్పర్చింది. లోకనంది శంకర నారాయణ రావు అధ్యక్షులుగా పరిషత్తు కార్యవర్గం ఏర్పాటు జరిగింది. మొదట్లో గోలకొండ పత్రికా కార్యాలయంలోనే పరిషత్తు వ్యవహారాలను కూడా నిర్వహించేవారు. అనంతరం హనుమాన్ కొంతకాలం కార్యకలాపాలను నిర్వహించిన అనంతరం 1951లో బొగ్గులకుంటలో శాశ్వత భవనాన్ని ఏర్పరచుకుంది సారస్వత పరిషత్తు.

మాతృ భాషాభిమానం పెంపుదల, పాఠ్యప్రణాళిక రూపకల్పన, వివిధ పరీక్షల నిర్వహణ, సాహిత్యానికి ప్రోత్సాహం, ఉత్తమ గ్రంథాలకు పారితోషికం బహూకరణ మొదలైన కార్యక్రమాలను పరిషత్తు చేపట్టింది. తెలుగు భాషపై ఆసక్తి పెరిగేలా పాఠ్యాంశాలను సిద్ధం చేశారు. ఆయా పాఠ్యాంశాల ఆధారంగా పరీక్షల నిర్వహణ కూడా జరిగింది. 1945 అక్టోబరు 4, 5, 6 తేదీల్లో తెలుగులో ప్రాథమిక, ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. భాష విషయంలో చైతన్యం లక్ష్యంగా అనేక కార్యక్రమాలను పరిషత్తు నిర్వహించింది. అక్షరాలను నేర్చుకున్న వ్యక్తి చైతన్యవంతుడవుతాడు. అందుకే గ్రామాల్లో రాత్రి బడుల నిర్వహణకు పూనుకుంది సారస్వత పరిషత్తు. వయోజనుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచేందుకు కంకణం కట్టుకుంది. సారస్వత పరిషత్తు క్షేత్ర స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాల వల్ల ప్రజలు చైతన్యవంతులయ్యారు. పెరిగిన ప్రజల చైతన్యాన్ని నాటి నిజాం ప్రభువులు భరించలేకపోయారు. పరిషత్తు కార్యక్రమాలను నిర్వహించే కార్యకర్తలపై భౌతిక దాడులకు పూనుకున్నారు. రజాకార్లు రంగంలోకి దిగారు.

సారస్వత పరిషత్తు తొలి వార్షికోత్సవం 1944లో వరంగల్లు కోటలో ఏర్పాటైంది. ఈ ఉత్సవాల కోసం వేసిన పచ్చని పందిళ్లను రజాకార్లు తగులబెట్టారు. సారస్వత మూర్తులను భయభ్రాంతులకు లోనుచేసేందుకు యత్నించారు. అయినా సభలో పాల్గొన్న తెలంగాణ తేజోమూర్తులు జంకలేదు. కాలుతున్న పందిళ్లు ఒకవైపు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నా దాశరథి నిర్భీతిగా గళం విప్పారు. “ఓ పరాధీన మానవా! ఓపరాని /దాస్యము విదల్చలేని శాంతమ్ము మాని /తలుపులను ముష్టి బంధాన కలచివైచి /చొచ్చుకొని పొమ్ము స్వాతంత్య్ర సురపురమ్ము” అని కవితాగానం చేశారు. నాటి సభాధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డితో పాటు దేవులపల్లి రామానుజరావు తదితరులు రజాకార్ల దుశ్చర్యలను ఖండించారు.

ఈ విధంగా రజాకార్లకు వ్యతిరేకంగా కవులు, రచయితలు దృఢ వైఖరిని కనబర్చినప్పటికీ పెచ్చుమీరిన దాడుల ఫలితంగా పరిషత్తు కార్యక్రమాలను కొనసాగించలేని పరిస్థితి నెలకొని కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దాంతో కొద్ది కాలం పరిషత్తు కార్యకలాపాల్లో స్తబ్దత ఏర్పడింది. విద్యాజ్యోతులను పంచిన పరిషత్తు చీకట్లోకి వెళ్ళిపోయింది. చీకటి అనంతరం వెలుగు తప్పకుండా వస్తుందన్న ఆశావహ దృక్పథంతో పరిషత్తు ఉద్యమకారులు వెలుతురు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. చివరికి వారి ఎదురుచూపులు ఫలించాయి. పోలీసు చర్య జరిగింది. హైదరాబాదు సంస్థానం 1948 సెప్టెంబరు 7న భారతదేశంలో విలీనమైంది. తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. మబ్బు నుండి బయటి కొచ్చిన సూర్యుడిలా అజ్ఞాత వాసం తెర నుండి బయటికొచ్చింది సారస్వత పరిషత్తు. ఆ తర్వాతి సంవత్సరంలో ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ అనే పేరు నుండి ‘నిజాం రాష్ట్రం’ అనే పదబంధాన్ని తొలగించారు. అప్పటినుండి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’గా మారింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ‘తెలంగాణ సారస్వత పరిషత్తు’ గా వ్యవహారంలోకి వచ్చింది. బోధనా భాషగా తెలుగు అమలు కోసం సారస్వత పరిషత్తు ఎంతో కృషి చేసింది. ఆ కృషి ఫలితంగా మెట్రిక్ వరకు తెలుగు బోధన ప్రారంభమైంది. భాషా సుగంధాలను నలు దిశలా వెదజల్లాలంటే సుశిక్షితులైన తెలుగు పండితులను తీర్చిదిద్దడం అవసరం. అందువల్లే 1964 లో సారస్వత పరిషత్తు తెలుగు పండిత శిక్షణ కళాశాలను నెలకొల్పింది. అనంతరం ఉస్మానియాకు అనుబంధంగా ప్రాచ్య కళాశాలను ఏర్పాటు చేసింది. భాషా బోధన, ప్రాచ్య విద్య విషయాల్లో విశేష కృషి చేసింది. తెలంగాణలో నిరంతర సాహితీ చైతన్యం ప్రభవించడంలో సారస్వత పరిషత్తు పాత్ర అమూల్యమైనది. పరిషత్తు అధ్యక్షులుగా దేవులపల్లి రామానుజరావు ఆ కృషికి బీజం వేశారు. అదే వారసత్వాన్ని ఆచార్య సి.నారాయణ రెడ్డి కొనసాగించారు. ప్రస్తుత అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ, సారస్వత పరిషత్తు కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. సారస్వత పరిషత్తు వివిధ కవుల సంస్మరణ ప్రసంగాలను నిర్వహించింది.

అశేష జీవితానుభవం పొందిన ప్రముఖులు సారస్వతానుభవాలను పంచుకునే ‘పరిణతవాణి’ని నిరాటంకంగా కొనసాగిస్తూ, పాత తరం స్ఫూర్తిని కొత్త తరం పొందేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తు నిత్యం సారస్వత సొబగులు వెదజల్లే భాషా సాంస్కృతిక సారస్వత క్షేత్రం. భాషాంశాలను అధ్యయనం చేసే విద్యార్థులతో కూడిన కళాశాల; కవులు, కళాకారులతో భాసిల్లే దేవులపల్లి రామానుజరావు కళామందిరం; ఔత్సాహిక పాఠకులతో అమూల్య పుస్తకాల గ్రంథాలయం, అధ్యయన శీలుర అవసరాలు తీర్చే పుస్తక విక్రయ కేంద్రం ఈ సాహిత్య క్షేత్రంలో చైతన్య దీప్తిని తెలియజేస్తూ ఉంటాయి. ఈ సుక్షేత్రం సారస్వత వెలుగులను మరెన్నో తరాలకు పంచాలి. తెలుగునాట వెలుగు రేఖలు విరబూసేందుకు మార్గదర్శిగా నిలవాలి.

Story about Telugu Language