Home ఆఫ్ బీట్ సామాజిక న్యాయం ఇంకెంత దూరం

సామాజిక న్యాయం ఇంకెంత దూరం

Minor-Rape

యుగయుగాలుగా గెలిచినవాళ్ళే చరిత్రనూ, గ్రంథాలనూ రాసుకున్నారు. కాబట్టి మనం పురాణాలననుసరించి దేవతలు మంచివాళ్ళు వరాలిచ్చి ఆదు కుంటారు, అనుగ్రహిస్తారు అనుకుంటాం. ఓడిన రాక్షసులు చెడ్డవాళ్ళు, క్రూరులు వీళ్ళు అకారణంగా అందర్నీ హింసిస్తూ అత్యాచారాలు చేస్తుంటారు అని అనుకుంటాం. ఎవరికి తెలుసు ఇందులో నిజానిజాలు. నాబోటి వాళ్ళు మాత్రం రాక్షసులంటే బలమైన వాళ్ళు, వాళ్ళు రక్షకులు అని తెలుసుకుంటాం. రక్షకులను రాక్షసులని, వక్రీకరించిన ద్విజనీతిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. మరి సృష్టికర్తలయిన దేవుళ్ళు స్వర్గంలోనూ ఆకాశంలోనూ చక్కర్లు కొడ్తూ విహారాలు చేస్తూ హాయిగా కాలం గడుపుతుంటారా, పైనుండి కింద ముఖ్యంగా తాము సృష్టించిన పుణ్యభూమీ, వేదభూమిలో రోజు ఏం జరుగుతుందో చూడనే చూడరా… కలికాలం, కలి యుగధర్మమంటూ కాలానికి దేశాన్ని వొదిలేసి ఊరుకుంటారా దేవుళ్ళు. రెండు క్షణాలు మనిషిలా మారి చూస్తే తెలుస్తుంది మనిషితనంపై జరిగే విధ్వంసకాండ, మారణెమం ఏ స్థాయిలో చెలరేగి మానవ వనరుల హననం జరుగుతున్నదో.

అందుకే దైవమైనా రాజకీయాలైన నేలమీద కాళ్ళూనాలి. ఒక వైపు సృషి్టి! మరోవైపు వినాశం! ఎంత అఘాయిత్యంగా ఉన్నాయో తెలుసుకునే ప్రక్రియ భూమ్మీద ఉంటేనే అవగాహనకొస్తుంది. తాను సృష్టించిన మనుషుల గురించి ఏమీ పట్టనితనం ఎందుకు ఈ దేవతలకు? లేదా మానవ సమాజానికి అతి స్వేచ్ఛనూ, అతిప్రజాస్వామికతను దీవెనలుగా ఇచ్చేసారా? మహాదేవుడినైనా, మహారాజునైనా ప్రశ్నించే కాలం, నిలదీసే సందర్భం ఒకటి వస్తుంది. అది ప్రజలు చేస్తారు. ఆ ప్రజలు మానవత్వపు అంశంతో ఉన్న కొద్ది మందే కావచ్చు. వాళ్ళు మానవత్వం మర్చిపోయినవాళ్ళను నీచ రాజకీయాల ఉచ్చుల్లో చిక్కుకుని, నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ, కొడిగట్టే దీపాల్లా, బ్రతికున్న శవాల్లా ప్రజలు ఎంతకని పడి వుంటారు. ఆధిపత్యాల అణిచివేతల కింద అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుందా.

ఏదో ఒకనాడది విస్ఫోటించదా… లావాలై ప్రవహించదా. అధికారం, మతం ఒక్కటిగా మారి చేస్తున్న నేరాలు నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం ఎవరికీ కనిపించదా అన్నది ప్రశ్న. అనాదిగా మానవజాతికి మృగాలంటేనే కదా ఎప్పటికీ భయం. మృగాలూ, విషకీటకాలంటే ఎంతో భయం. దేన్నీ జయించినా ఇంకా భయాన్ని మాత్రం జయించడంలో అసఫలులమే మనం. కానీ ఇప్పుడు క్రూర జంతువులంటే అంతగా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అవి అదే పనిగా మనుషులపై దాడి చేయవు. కాని అంతకంటే నీచమైన మానవ మృగాలతో సహజీవనం చేస్తున్నందుకు ప్రతి క్షణం భయపడుతూ సగంచచ్చి బతకవలసి వస్తున్నది. తమ చిన్నారులను తలుచుకొని గడగడా వణికిపోతున్నారు జనం. ఏ క్షణంలో ఏ మృగం దాడి చేసి చంపేస్తుందోనన్న భీతితో అల్లాడుతున్నారు పిల్లల్ని కన్నవాళ్ళు. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో కథువా జిల్లా రస్సానా గ్రామానికి చెందిన బక్రవాల్ సంచార తెగకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక అసిఫాబానో జనవరి 10న కనబడకుండా పోయి 17న అడివిలో శవంగా కనిపించింది. కథువాలోని ఒక గుడి నిర్వహించేవాడు సాంజీరావ్‌ు, ఒక టీనేజ్ యువకుడుకాని యువకుడూ, కొందరు పోలీసులు ఎనిమిది మంది కలిసి ఆ బాలికకు మత్తుమందిచ్చి వారం రోజులపాటు అత్యాచారం చేసి చంపేసి మత దాహం తీర్చుకున్నారు అనడం కంటే బాలిక రక్తంతో దాహం తీర్చుకున్నారనవచ్చు.

ఈ సంచార జాతివాళ్ళు మైనార్టీలు. గొర్రెల్నీ, గుర్రాల్నీ మేపుకుంటూ తిరుగుతుంటారు. వారు ఆక్రమణదారులంటూ ఆ నాలుగైదు కుటుంబాలను గ్రామం నుండి వెళ్ళగొట్టాలట. అందుకోసం వాళ్ళ పసిబిడ్డను అపహరించుకుపోయి మాటలకందనంత పచ్చినెత్తురు తాగే మృగాళ్ళు క్రూర నేరానికి పాల్పడితే సంచారులు భయంతోనైనా అక్కడినుండి పారిపోతారని ఆ బాలికపైన ఈ హింసాకాండ చేసారని ఒక నిర్ధారణ.‚ఎనిమిది మంది మృగాళ్ళ వేట క్రీడ వల్ల వాళ్ళ కోరిక నేరవేరింది. ఇప్పుడు ఆ సంచార జాతివాళ్ళు బెదిరింపులకు గురై అక్కడినుండి 101 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూపోయి రోడ్డు ప్రక్కన శరణు తీసుకున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే అక్కడినుండి కూడా ఇంకెంతో దూరం వెళ్ళిపోతామని చెప్తున్నారు. అసిఫా తండ్రి మాట ఒకటి యావత్ దేశ ప్రజలు మననం చేసుకోవాలి. బడుగుజీవుల సంక్షేమ రాజ్యం, భారత ప్రజల శ్రేయోరాజ్యం ఇప్పుడు అసిఫా ఎవరి బిడ్డో తేల్చి చెప్పాలి. అసిఫా తండ్రి “ఆ పాప నా బిడ్డ మాత్రమే కాదు మొత్తం దేశానికి బిడ్డే” అన్నాడు.

దేశంనిండా కల్లోలిత ప్రాంతాలు! కల్లోలిత హృదయాలు! అశాంతి జ్వాలల్లో కాలి బుగ్గవుతున్న ఊళ్ళూ, సమూహాలూ ఇదేం పాలన? ఒక గుజరాత్, ఒక ముజఫర్‌నగర్, ఒక కాశ్మీర్‌లోయ వందలాది ప్రాంతాలు అల్లకల్లోలితమవుతూ చెదిరిన బతుకులు, చితికిన ప్రాణాలు 8 రోజులు చిన్నారి దేహం మీద చిత్రవధగా, 86 గాయాల నమూనాగా , కొన ఊపిరితో ఉండగా మెడకు ఉచ్చుబిగించి ఉసురు తీసిన అన్యంపుణ్యం తెలియని ఆ పసి శరీరం మిగిల్చిన దు:ఖావేశంలా. చట్టాల వైఫల్యం, చట్టరక్షణ యంత్రాంగాల నైచ్యం, వైఫల్యం. పచ్చినెత్తురు తాగే మత పార్టీలు నేర వ్యవస్థతో జతకట్టడం. ఈ దేశానికే దిక్కులేదు. దేశ ప్రజల మానప్రాణాలిప్పుడు, రాజకీ య బడాబాబుల, మతమతోన్మాదుల, మాఫియాల చేతుల్లో బందీలు. వేల సంఖ్య లోని నేరాలూ హత్యలూ, దాడులూ, అత్యాచారాలుగా జరుగుతుంటే వందల సంఖ్యలో కూడా శిక్షలు పడవు. న్యాయం బాధితులకు దశాబ్దాల దూరంలో అస్థిపంజరంలా పడి ఉంటుంది. దిక్కులేని న్యాయం దీనులకేం న్యాయం చేస్తుంది. తమ సన్యాసుల పాలనలో క్రూర నేరాలు జరిగి ప్రభుత్వ పరువు పోతున్న క్లిష్ట పరిస్థితిలో పన్నెండేళ్ళ లోపు పిల్లలపై అత్యాచారం పాల్పడితే ఉరిశక్షనీ, పదహారేళ్ళ లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే జీవిత ఖైదు విధించాలని ఆర్డినెన్సు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి పదహారేళ్లు దాటిన ఏ వయస్సు స్త్రీలపైనైనా అఘాయిత్యం చేస్తే దానికి పాత శిక్షల వ్యవహారమేనా అని ఒక ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. ప్రధానమంత్రి ఈ విషయమై నోరిప్పి ఇంకా కొంత మాట్లాడటం జరిగింది. ఆడపిల్లల్ని కాపాడేందుకు మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులు మగపిల్లలకు సామాజిక బాధ్యత నేర్పాలనీ, దీని వల్ల ఆడపిల్లల్ని ఈ దారుణాల నుండి కాపాడుకోవచ్చనీ మరొక విలువైన మాట ఏమిటంటే ఈ అరాచకాలకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలను నిర్మించి సమాజ వైఖరిలో సమూల మైన మార్పును తీసుకురావాలని మోడీ చెప్పడం.

చట్టాలు చేస్తూ దిన దినం శాసనాలు మారుస్తున్నా పితృస్వామ్య ఆధిపత్య భావజాలంతో మతులూ గతులూ తప్పుతున్న మృగాళ్ళలో మార్పును తేలేమనీ.. అది కేవలం సామాజిక ఉద్యమం, సమూలమైన మార్పు అనే విరుగుడు మంత్రం వల్లనే సాధ్యమనీ ప్రధాని మాత్రమే కాదు ప్రజలందరికీ అవగతమైన వాస్తవం. ఒకవైపు హిందూ సామ్రాజ్యవాద ఆధిపత్యం, మరోవైపు రాజకీయ దివాళాకోరుతనం, మధ్యలో ఎన్నో దగాకోరుతనాలు, దళారీల ప్రమేయాలు, చట్టం ఎప్పుడూ కండబలం, అర్ధబలం ఉన్నోని చుట్టంగానే విధేయత కనబరుస్తున్నది. ఇప్పుడు దేశం నిండా ‘సన్యాసుల’ లైంగిక నేరాల డేరాలే హవా చేస్తున్నాయి. ఇతర దేశస్థులు మనమేదో గాడ్స్‌ల్యాండ్ అని నమ్ముతూ చేతులెత్తి మొక్కేవాళ్ళు.

మనకు సన్యాసులూ (బాబాలూ) వద్దూ, మోక్షాలూ వద్దు. రుషి అంటే ఒక లక్ష్యాన్ని సాధించే కృషి చేసేవాడనీ, తపస్వి అంటే కఠోర దీక్ష చేసి కోరినది పొందేవాడని అర్ధం. అయితే మన దౌర్భగ్యానికి నేరాలుఘోరాలు హత్యాకాండలూ దోపిడీలకు కొమ్ముగాసే సన్యాసులు దాపురించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ మంచి పిలుపు. కానీ ఇది మాత్రమే సరిపోదు. ఆడపిల్లలకు పిండ దశనుండే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఒకవేళ పుడితే కాపాడడమెట్లా చదివించి, గట్టెంక్కించడమెట్లా? ‘బేటీ బడావో బేటీ లడావో’ అని ఆ నినాదానికి పొడిగింపునిచ్చి చిత్తశుద్దితో విధానాలు కూర్చాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వాలు గ్రహించాలి. చట్టాలైనా, విధానాలైనా, శాసనాలైనా ఎంత పకడ్బందీగా రూపొందించినా వాటి అమలుకు సంబంధించిన యాంత్రాంగాలను బలోపేతం చేయడం ముఖ్యమైన పని.

అనిశెట్టి రజిత

9849482462