Thursday, December 7, 2023

యశోదమ్మ స్మృతిలో

- Advertisement -
- Advertisement -

Story about Yashoda Hospital History

 

మాతృమూర్తి కీ.శే. గోరుకంటి యశోదా దేవి జ్ఞాపకాలు ప్రతి ఒక్క మహిళకు స్ఫూర్తిదాయకం. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తల్లిగా, పిల్లలకు తన ప్రేమవాత్సల్యాలను పంచిపెట్టడమే కాకుండా బాధ్యులైన పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలోనూ, సామాజిక బాధ్యతను వారు గుర్తెరిగి తమ వంతు సేవ చేయడంలోనూ వారికి దిశానిర్దేశం చేసిన ఆమె చిరస్మరణీయ మాతృమూర్తిగా నిలిచిపోతారు. తెలుగు రాష్ట్రాలలో అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ హాస్పిటల్స్ గ్రూప్ అయిన యశోద హాస్పిటల్స్ స్థాపనకు ప్రేరణగా నిలిచిన మాతృమూర్తి కీర్తిశేషులు గోరుకంటి యశోదా దేవి అమ్మదనానికే ఆదర్శం. కన్నబిడ్డలు తల్లి మీద అభిమానం, ప్రేమ, గౌరవంతో ఆమె పేరు మీద స్థాపించినదే యశోద హాస్పిటల్స్. గోరుకంటి యశోదా దేవి పేరులోనే కాదు, పలకరింపు, మాటలలో కూడా ఆప్యాయత, అభిమానం, ప్రేమ తొణికిసలాడేవి. ఆ అత్యుత్తమ మాతృమూర్తి జీవితం నేటి మహిళలకు ఒక ఆదర్శం. మార్గదర్శనం, ఆచరణీయం.

మాతృమూర్తే స్ఫూర్తి…

ఆ రోజు యశోద హాస్పిటల్స్ 2500కు పైగా పడకలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అత్యున్నత వైద్య సంస్థగా రూపుదిద్దుకోవడానికి స్ఫూర్తి ప్రదాత యశోదమ్మే. ఆమె కని, పెంచి, తీర్చిదిద్దిన ఆమె కుమారుల క్రమశిక్షణ, అంకిత భావం, కార్యదక్షత కారణంగా ఈ రోజు ప్రైవేటు వైద్య రంగంలోనే యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఒక అత్యున్నత సంస్థగా, భారతదేశంలోనే అత్యుత్తమ హాస్పిటల్స్ గ్రూప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇదంతా ఆవిడ చలవే… ఆవిడ ఆశీస్సులే… యశోదమ్మ పేరు బలమే…

కన్న బిడ్డలకు మార్గనిర్దేశకత్వం…

ఒక సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు అయినప్పటికీ పిల్లలు బాగా చదువుకోవాలన్నదే యశోదమ్మ కల. అదే ఆవిడ జీవిత లక్షం. కేవలం పిల్లల చదువుల కోసమే ఆమె జీవితంలో కష్టపడి మార్గదర్శనం చేసి, చదివించి, వారిని ఇంత ప్రయోజకులను చేశారు. నల్లగొండ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు అయిన గుమ్మడివెల్లి నుండి కేవలం పిల్లల చదువుల కోసం హన్మకొండ వచ్చారు. ఆమె భర్త కీ.శే. గోరుకంటి రామచందర్ రావు ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలలో పని చేసినా, ఆమే పిల్లలను దగ్గరుండి చదివించారు, పెంచారు, ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఒక వైపు వ్యవసాయం, మరోవైపు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఉన్నంతలో పిల్లలకు సర్దుబాటు చేస్తూ మంచి స్కూళ్లలో చదివించారు. పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోనవకుండా, క్రమశిక్షణతో పెంచి వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ రోజు యశోద హాస్పిటల్స్‌లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పదిహేను వేల కుటుంబాలకు పైగానే ఉపాధి పొందుతున్నాయి. దీనికి మార్గదర్శకత్వం కచ్చితంగా యశోదమ్మదే.

క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు…

యశోదమ్మ అనుసరించిన అతి సాధారణ జీవన శైలే ఆమె పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది, ప్రయోజకులుగా చేయడంలో తోడ్పడింది. ఉన్నదాంట్లో సర్దుకుపోయే తత్వం, వృథా ఖర్చులకు పిల్లలను దూరంగా ఉంచడం, వారిని క్రమం తప్పకుండా తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని వారికి పదేపదే బోధించేవారు. ఈ రోజు యశోద హాస్పిటల్స్ పురోగతిలో ఆమె తన పిల్లలకు నేర్పించిన క్రమశిక్షణే వారికి ఎంతగానో ఉపయోగపడింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆవిడ పిల్లలకు చిన్నతనం నుంచే నూరిపోశారు.

కష్టాలకు వెరవని ధీశాలి ఆమె…

ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, ఒక చిరుద్యోగి భార్యగా వరంగల్ లాంటి పట్టణంలో, భర్తకు దూరంగా కేవలం పిల్లల చదువుల కోసం నలుగురు పిల్లలతో జీవన యానం సాగించడం సామాన్యమైన విషయం కాదు. దీనికి ఎంతో ధైర్యం, పట్టుదల అవసరం. భర్త సంపాదనకు తోడుగా ఒంటరిగా వ్యవసాయం, పాడి చూసుకుంటూ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా పేరున్న ఒక పెద్ద కాన్వెంట్‌లలో చదివించి ఈ స్థాయికి వారు చేరుకునేలా ఆమె తన పిల్లల్ని తీర్చిదిద్దారు. పిల్లలకు వ్యక్తిత్వం, పట్టుదలను చిన్నతనం నుంచే అలవాటు చేశారు.

అంతా భగవంతుని దయ. మన ప్రయత్నం మనం చేస్తాం అంతే. దేవుడి దయ వల్ల ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి మనకు చేతనైనంత వరకు పేదలకు సాయం చేయాలని ఆమె ఎప్పుడూ పిల్లలకు చెబుతుండేవారు. తల్లి ఆశయానికి అనుగుణంగానే ఆమె కుమారులు యశోద చారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించి ఈ రోజున ఎందరో అనాథలకు అండదండగా నిలుస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తల్లికి ప్రేమాభిమానాలు ఎక్కువ. ఆమె పలకరింపే మనకు దీవెన. ఆవిడ నలుగురు పిల్లలలో ఇద్దరు ప్రపంచ స్థాయి వైద్యులు. ఒకరు ప్రముఖ ఇంజినీరు. మరొకరు చార్టెడ్ అకౌంటెంట్. ఆ కుటుంబానికి ఆమె ఒక ప్రేరణ. యశోధ హాస్పిటల్స్ గ్రూప్స్‌కు ఆమె ఒక మూలస్తంభం.

అలాగే వేలాది కుటుంబాలకు ఆమె జీవన జ్యోతి. తమ అభ్యున్నతికి మూలకారణం మా అమ్మే అని ఆ నలుగురు కొడుకులూ ఎప్పటికీ భావిస్తారు. 1989లో చిన్న క్లినిక్‌గా ప్రారంభమైన యశోద హాస్పిటల్ మూడు దశాబ్దాల కాలంలో ఒక అగ్రశ్రేణి ప్రపంచ స్థాయి వైద్య సంస్థగా ఎదగడం వెనుక ఆమె దీవెనలు, సంకల్పం, ప్రోత్సాహం పుష్కలంగా ఉన్నాయి. పిల్లల వెన్నంటే ఉండి వారిని ఆమె ఎల్లవేళలా ముందుకు నడిపించారు, ప్రోత్సహించారు, జీవితంలో నిలబెట్టారు.  ఒక సామాన్య మహిళ తన జీవిత కాలంలో సహధర్మచారిణిగా, తల్లిగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా, సంకల్పంతోనూ, శ్రమించే తత్వంతోనూ, అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ, ఓర్పు, ధైర్యం, పట్టుదలతోనూ, సామర్ధం అన్నింటికి మించి స్వయంకృషే ఆలంబనగా ఒక అత్యున్నత వైద్య సంస్థకు ప్రేరణగా నిలిచిన ఒక మాతృమూర్తిగా యశోదమ్మ ఎప్పటికీ నిలిచిపోతారు. ఎందరికో ఆదర్శమూర్తి అయిన ఆమె జీవితం ఈ తరం తల్లులందరికీ ఒక జీవిత పాఠం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

(కీ.శే. గోరుకంటి యశోదా దేవి
పరమపదించి పుష్కర కాలం
పూర్తి అయిన సందర్భంగా…)

* పన్మెత్స అశోక్ వర్మ సీనియర్ జనరల్ మేనేజర్ యశోద హాస్పిటల్స్ గ్రూప్స్, హైదరాబాద్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News