Wednesday, November 30, 2022

హోలీ రంగుల కేళీ…

- Advertisement -

HOLIRE

దేశవ్యాప్తంగా అందరూ రంగుల్లో మునిగి తేలే పండుగ హోలీ.  కులమతాలకు అతీతంగా చిన్నాపెద్దా జరుపుకునే సంబురం. సంప్రదాయ దుస్తులు ధరించి, ఒకరిపై నొకరు రంగులు జల్లుకుంటూ పరవశించే పర్వదినం…

హోలీ పండుగను ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రాక్షసుడైన హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక. మంటలలో కాలకుండా, వేడిని భరించే శక్తి ఆమెకుంటుంది.. హిరణ్యకశిపుడి కొడుకైన ప్రహ్లాదుడు తండ్రి మాటని కాదని శ్రీహరిని పూజిస్తుంటాడు. కొడుకుని భయపెట్టాలని హోలిక ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టి పెద్ద కట్టెలని చుట్టూతా పేర్చి మంటపెడతాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు శ్రీహరిని తనని రక్షించమని వేడుకుంటాడు. ఆశ్చర్యకరంగా హోలిక మంటల్లో కాలిపోతుంది. ప్రహ్లాదునికి ఏ హానీ జరుగదు. అయితే చనిపోయేముందు హోలిక తనను క్షమించమని ప్రహ్లాదుని వేడుకుంటుంది. ప్రతి సంవత్సరం తన పేరిట హోలీ జరుపుకుంటారని ప్రహ్లాదుడు వరమిచ్చాడు. పండుగ ముందురోజు రాత్రి పెద్దపె ద్ద నెగళ్లను పెట్టి, మధ్యలో హోలిక రూపంలో ఉన్న ఆకారాన్ని పాతవస్తువులతో తయారుచేసి మంటపెడతారు.

పిల్లలు, పెద్దలు పాటలు పాడుకుంటూ మంట చుట్టూతా తిరుగుతారు. హోలిక రాక్షసి మరణించినందుకు మర్నాడు ఉదయం పండుగ చేసుకుంటారు. ఆ రోజు పగలంతా రంగు నీళ్ళను ఒకరిమీద ఒకరు చల్లుకుంటారు. వేప, తులసి ఆకులను, పసుపు, కుంకుమ పొడులను, వివిధ రకాల రంగులను ఉపయోగించి నీళ్లను చల్లుకుంటారు. దీని మూలంగా అనేక క్రిమికీటకాలు కూడా నశిస్తాయి. ఆరోగ్యపరంగా ఏ హాని ఉండదు. వివిధ రకాల తినుబండారాలను బంధువులకు పంచుకుంటారు. ఆ రోజున భంగ్ అనే ఒక ప్రత్యేకమైన పానీయాన్ని సేవిస్తారు. కోపతాపాలతో దూరమైన వారుకూడా పరస్పరం రంగులు చల్లుకుని మిత్రులుగా మారతారు. హోలీ రోజున పలు ప్రాంతాల్లో లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, చంద్రపూజవంటివి నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో ఫాల్గుణ శుద్ధ పూర్ణిమన చంద్రుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో ఉంటాడని ప్రతీతి. అందుచేత ఈ రోజున చంద్రపూజ, సత్యనారాయణ స్వామి పూజ చేసినవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. ఈ పండుగని వివిధ ప్రదేశాలలో వివిధ రకాలతో ఎలా చేసుకుంటారో చూద్దాం…

బార్సానాలో స్టిక్స్‌తో హోలీ
ఉత్తరప్రదేశ్‌లోని మధుర దగ్గర బార్సానా, నంద్‌గాన్ గ్రామాలలో మహిళలు జరుపుకునే హోలీ కొత్తతరహాలో ఉంటుంది. శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధని, ఆమె స్నేహితులను సరదాగా ఏడిపించిన రోజును హోలీ అని అంటారు. మహిళలు నేరారోపణలు చేస్తూ లాథూస్ (కర్రల)తో శ్రీకృష్ణుని వెంబడించినట్లుగా కథ చెబుతారు. వారు కర్రలతో వారిని వెంబడించి తరమటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ పద్ధతిని లాత్మర్ (లాత్ అంటే కర్ర)హోలీ అంటారు.

మధుర, బృందావన్‌లో ..
ఈ పండుగను హోలీకి 40 రోజుల ముందుగా వచ్చే వసంతి పంచమి రోజు మధుర, బృందావన్‌లలో జరుపుకుంటారు. గోప బాలకులతో, గోపికలతో కలిసి కృష్ణుడు వసంతోత్సవం జరిపినట్లుగా పురాణ గాథలు ఉన్నాయి. మథురలో ఈనాటికీ వసంతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు.

ముంబై ః స్లమ్ చిల్డ్రన్స్‌తో కమ్యూనిటీ హోలీ
ముంబైలోని మురికి ఏరియా ఉన్న ధార్వాయ్‌లో హోలీ వేడుకలు జరుగుతాయి. ధార్వాయ్‌లోని దాదాపు 80% మంది పాల్గొంటారు.
చెట్లకు కొబ్బరికాయలు, పూలమాలలు కట్టి హోలీ జరుపుకుంటారు. కామదహనం చేస్తారు. ఎక్కువగా పిల్లలు, మహిళలు పాల్గొంటారు.

ఢిల్లీ ః సంగీత హోలి
ఢిల్లీలో హోలీ సంబరాలు పహార్‌గంజ్ దగ్గర జరుగుతాయి. అక్కడ హోలీ రోజున ఎవరు వీధులలో కనిపించినా షాపుల వాళ్లు, పిల్లలు వచ్చి రంగులు పూస్తారు. అక్కడ ‘హోలీ మూ ఫెస్టివల్’ గా జరుపుకుంటారు. దానికోసం టిక్కెట్లు కొని ఆ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.( గతంలో దీనిని హోలీ కౌ ఫెస్టివల్ అనేవారు.)ఈ పండుగని 40 మంది భారతీయ, అంతర్జాతీయ ప్రదర్శకులు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేవారికి పర్యావరణానికి హాని జరుగకుండా ఉండేలా ఆర్గానిక్, హెర్బల్ రంగులు అందుబాటులో ఉండేట్లు చూస్తారు. రోడ్డుమీద ఏ ప్రమాదాలు జరుగకుండా చూస్తారు. భంగ్‌లస్సీ, కలర్లు జల్లడానికి స్ప్రింక్‌లర్స్ ని అందిస్తారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి హోలీ సంబరాల్లో పాల్గొంటారు. దేశ ప్రధాని కూడా అధికార నివాసంలో చిన్నారులతో కలిసి ఉతాహంగా వేడుకలో పాల్గొంటారు.

జైపూర్ ః హోలి అండ్ ఎలిఫెంట్స్
జైపూర్‌లో హోలీ పండుగ సందర్భంగా ఎలిఫెంట్ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఎలిఫెంట్ పెరేడ్స్, ఏనుగులకి అందంగా అలంకరించే పోటీలు నిర్వహిస్తారు. ఏనుగుల కవాతులు, వాటి మధ్య యుద్ధాన్ని పోటీగా పెడతారు.

దక్షిణ భారతదేశంలో హోలి ః
దక్షిణ భారతంలో హోలీ పండుగు అంత ఉత్సాహంగా జరుగవనే చెప్పుకోవాలి. ఉత్తర భారతదేశంలో జరుపుకున్నంతగా దక్షిణ భారతదేశంలో హోలీ వేడుకలు మనకు కనపించవు. దక్షిణంలో ఎక్కువగా ఆలయాలలో చేసే కార్యక్రమాలు, వివిధ మతాల పూజాది కార్యక్రమాలపై ప్రజలు దృష్టి కేంద్రీకరిస్తారు. కర్నాటకలో హంపిలో ప్రత్యేకంగా ఈ పండుగును వేడుకగా చేసుకుంటారు. హంపిలోని ప్రజలందరూ ఈ వేడుకను పగటిపూట చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ విదేశీ యాత్రీకుల రాకపోకల వల్ల వారందరూ ఉత్సాహంగా పాల్గొని మనకి పండగ వాతావరణం కనిపిస్తుంది. అందరూ డ్రమ్స్‌వాయిస్తూ, సంగీతాలు పెట్టుకుని, ఆనందంగా నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటారు. ప్రవాస భారతీయులు…ఆఫ్రికా, ఉత్తర అమెరికా, యూరప్, దక్షిణ ఆసియాకుదగ్గర ఉన్న ప్రాంతాల్లో హోలీ ఘనంగా జరుపుకుంటారు. వినోదాల సంబరాలను పంచిపెడుతుంది

ఒరిస్సాలో…ఇక్కడ రాధాకృష్ణులకు బదులు పూరీలో ఉన్న జగన్నాథుడి విగ్రహాలను పూజిస్తారు.

కాశ్మీర్‌లో…పౌరులు, భారత రక్షక దళ అధికారులు, పాకిస్తాన్ రక్షణ దళాలు కూడా హోలీ జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగు పొడిని, రంగు నీళ్లను విసురుకుంటూ ఆనందంగా నృత్యం చేస్తారు.

ఇంటిలోనే సహజంగా రంగులను తయారుచేసుకోవటం ఎలా?
వివిధ రంగుల పూలని ఎండబెట్టి పొడిగా గాని, పేస్ట్‌లా గాని చేసి రంగులుగా ఉపయోగిస్తున్నారు. గులాబి రేకులను పేస్ట్‌లా చేసి నీళ్లలో కలిపి వాడుతున్నారు. గ్రీన్ కలర్ కోసం హెన్నా పౌడర్‌ని యూజ్ చేస్తున్నారు. ఆరెంజ్ రంగుకోసం గంధపు పొడిని, ఆకుకూరలని కూడా పేస్ట్‌గా చేసి కొంతమంది సహజంగా రంగులు తయారు చేసుకొంటున్నారు. దీనిమూలంగా చర్మానికి ఏ విధమైన హాని కలుగదు. దానిమ్మ కాయ తొక్కలని, టమాటాలను ఉడకబెట్టి వాటి రసాన్ని కొద్దిగా నీటిలో కలిపితే కూడా ఆ నీటికి మంచి ఎరుపు రంగు వస్తుంది. అలాగే బీట్‌రూట్ దుంపలని కూడా ఉపయోగించుకుంటున్నారు. మిడ్‌నైట్ బ్లూ ఫ్లవర్స్‌తో బ్లూ కలర్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఎరుపు, పసుపు బంతిపూలతో ప్రకృతి సిద్ధమైన రంగులని తయారు చేస్తున్నారు.

హోలీని ఆనందించటానికి చిట్కాలు ః
హోలీని ఆనందించేముందు ఒంటికి కొబ్బరినూనెని రాసుకోవాలి. దీనిమూలంగా చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మమే కాదు జుట్టు కూడా పాడవకుండా కాపాడుతుంది. పిల్లల అయితే తలకి టోపీ పెడితే మంచిది. ఈత కొట్టేడప్పుడు ఉపయోగించే టోపీ అయితే మరీ మంచిది. కళ్ళకి సన్‌గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది. కంట్లో ఏదైనా కలర్ పడితే వెంటనే నీళ్ళతో కడుక్కోవాలి.
పిల్లలకి ఏదైనా రంగు నీళ్లుపడి చర్మం కమిలితే వెంటనే కలబంద జెల్ రాస్తే మంచిది. కలబంద రసాన్ని ఐస్‌క్యూబ్ లాగా ఫ్రిడ్జ్‌లో పెట్టి వాటిని కూడా యూజ్ చేయవచ్చు.ఇలా ఎండదెబ్బ తగిలినా కూడా కలబంద జెల్ బాగా ఉపయోగపడుతుంది. ఒంటిమీద ఏమైనా మచ్చలు ఉన్నా కలబంద మర్దనాతో తొలగిపోతాయి. ఆస్మాతో బాధపడేవారు ఎవరైనా ఉంటే రంగుల పొడిని ఉపయోగించకుండా ఉంటే మంచిది. అలాగే ఎలర్జీతో బాధపడే వారు కూడా రంగులకి దూరంగా ఉంటే మంచిది.పిల్లలు హోలి ఆడాక వారు స్వీట్లు తింటారు. అప్పుడు వారిని స్పూన్స్ ఉపయోగించి తినమని చెప్పాలి. వారి చేతివేళ్ల గోళ్లకి, చేతులకి రంగులు ఉంటాయి కదా. రంగులో రసాయనాలు అవి ఉంటే హానికారకాలవుతాయి. మీరు హోలీని సంతోషంగా, రంగురంగులుగా సురక్షితంగా జరుపుకోవాలి.
(మార్చి 2, హోలీ పండుగ సందర్భంగా)

Related Articles

- Advertisement -

Latest Articles