Home ఎడిటోరియల్ కాంగ్రెస్‌లో భావ దారిద్య్రం

కాంగ్రెస్‌లో భావ దారిద్య్రం

Congress

 

సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తరవాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక ఇందిరా గాంధీ కుటుంబం మీద ఆధారపడే దుస్థితి తప్పుతుందన్న ఆశ పొడ సూపింది. అధ్యక్ష స్థానానికి కొత్త వారిని ఎన్నుకోవడానికి 134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, పాలనానుభవం ఉన్న పార్టీకి 75 రోజులు పట్టింది. సోనియా గాంధీ మళ్లీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. సోనియా కాంగ్రెస్ చరిత్రలోనే అందరికన్నా ఎక్కువ కాలం అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. సంస్థాగత ఎన్నికలు జరిగే దాకా ఆమె ఆ స్థానంలో కొనసాగుతారు. కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. గత యాభై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రెండు సార్లే జరిగింది.

అదీ ఇందిరా గాంధీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ అధ్యక్షులుగా లేని సందర్భంలోనే. పి.వి. నరసింహా రావు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఎ.ఐ.సి.సి. సమావేశం జరిగింది. అప్పుడు వర్కింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరిగింది. ఆ సమయంలో శరద్ పవార్, అర్జున్ సింగ్, నారాయణ్ దత్ తివారీ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించి దశాబ్దాలు గడిచింది కనక పి.వి. నరసింహా రావు ఆ ముగ్గురి చేత వెంటనే రాజీనామా చేయించి మళ్లీ వారినే వర్కింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు. కాంగ్రెస్‌లో ఎన్నికల పద్ధతి ఇలా ఉంటుంది కనక ఎ.ఐ.సి.సి. సమావేశం ఎప్పుడు జరుగుతుందో, సోనియా స్థానంలో కొత్త వారిని ఎన్నుకునే అవకాశం ఉంటుందో లేదో తెలియదు.

ఇందిరా గాంధీ కుటుంబానికి చెందిన వారు అగ్ర నాయకులు గా లేకపోతే కాంగ్రెస్ మనగలిగే పరిస్థితి కనిపించనందువల్ల మళ్లీ సోనియా గాంధీకే నాయకత్వ బాధ్యత కట్టబెట్టారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహించి రాజీనామా చేయడాన్ని మెచ్చుకున్న వారు ఉన్నారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి రాహుల్ ఏమీ చెప్పలేదు. నెల రోజుల్లోగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని మాత్రం సూచించారు. మళ్లీ సోనియాకే పగ్గాలు అప్పగించడానికి రాహుల్ సూచించిందానికన్నా నెలన్నర సమయం ఎక్కువ పట్టింది. ఈ లోగా అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.

ఇందిరా గాంధీ కుటుంబానికి చెందిన వారి మీద జనానికి నమ్మకం పోయిందనుకున్న నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలెట్ మొదలైన వారి పేర్లు అధ్యక్ష స్థానానికి ప్రస్తావనకు వచ్చాయి. అయినా అధ్యక్ష స్థానాన్ని మరో సారి సోనియాకే అప్పగించడం అంటే ఆ కుటుంబం అండ లేకపోతే కాంగ్రెస్ కొనసాగే అవకాశం లేదనే. కొంత మంది కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. ఆయన ససేమిరా అనడంతో సోనియా అంతే వాసుల మాటే నెగ్గింది. రాహుల్ కొనసాగడానికి నిరాకరించడంతో సోనియానే అధ్యక్షురాలిగా ఉండాలన్న ఒత్తిడి ఎక్కువైంది. ముందు నిరాకరించినా చివరికి ఆమెను ఒప్పించారు.

1991లో రాజీవ్ మరణం తరవాత సోనియా ఆంతరంగికుడు అహమద్ పటేల్, అశోక్ గెహ్లాట్ సోనియాను ఒప్పించడానికి విపరీతమైన ప్రయత్నం చేశారు. ‘మీ కళ్ల ముందు కాంగ్రెస్ కుప్ప కూలడాన్ని మీరు ఎలా అంగీకరిస్తారు’ అని బలవంత పెట్టారు. అయినా ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఇచ్ఛగించలేదు. పి.వి. ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టడంతో పాటు కాంగ్రెస్ అధ్యక్షులు కూడా అయ్యారు. 1998లో సోనియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఆమె విముఖంగానే కనిపించారు. సోనియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని 1998 మార్చి 14న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఆమోదించింది. అప్పటి దాకా ఆ స్థానంలో ఉన్న సీతారాం కేసరిని అవమానకరమైన రీతిలో తొలగించారు.

చాలా కాలం సోనియా విముఖంగానే ఉన్నా 1997 డిసెంబర్‌లో దిగ్విజయ సింగ్ కలిసినప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేయడానికి అంగీకరించారు. ఇందిరా గాంధీ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన పి.సి. అలెగ్జాండర్ అయితే సోనియాను ఒప్పించాలని అప్పటికి ఇంకా కాంగ్రెస్‌లో ఉన్న శరద్ పవార్‌ను కోరారు. ఆ తరవాత పవార్, ఎ.కె. ఆంటొనీ, గులాం నబీ ఆజాద్ పార్టీ పగ్గాలు చేపట్టాలని సోనియాను అభ్యర్థించారు. ఇప్పుడూ అదే చరిత్ర పునరావృతం అయింది. అహమద్ పటేల్, మన్మోహన్ సింగ్, ఆంటొనీ మొదలైన వారు సోనియాను ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. ‘పార్టీని వదిలి వెళ్తున్న వారిని చూడండి. మీరు లేకపోతే పార్టీ విచ్ఛిన్నం అవుతుంది. పార్టీని కాపాడగలిగేది మీరొక్కరే’ అని మొరపెట్టుకుంటే సోనియా సరేనన్నారు.

ఇంతకీ సోనియా గాంధీ కేవలం 20 నెలల తరవాత మళ్లీ పార్టీ నాయకత్వ బాధ్యతలు అంగీకరించడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్ పట్ల ఆమె నిబద్ధతను ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఇందిరా గాంధీ కుటుంబం ఆసరా లేకపోతే కాంగ్రెస్‌లో ఐక్యత కాపాడడం అసాధ్యం కనకే ఆమె అంగీకరించవలసి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో ఓటమి, రాహుల్ రాజీనామా తరవాత అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేశారు. ఇక ముందు వలసలను నిరోధించగలిగే శక్తి ఇందిరా గాంధీ కుటుంబానికి చెందిన వారికే ఉందన్నది వాస్తవం. 370వ అధికరణం రద్దు అంశం చర్చించడానికి వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులను, శాసన సభా పక్ష నేతలను కూడా ఆహ్వానించారు.

తన స్థానంలో కొత్త అధ్యక్షులను ఎన్నుకోవడంలో వీరందరూ కీలక పాత్ర పోషిస్తారు అని రాహుల్ ప్రకటించడం సోనియాకు బాధ్యత అప్పగించే ప్రయత్నం లో భాగమే. సోనియా మద్దతుదార్లు దానికి తగిన ఏర్పాట్లు చెకచెకా చేసేశారు. కాంగ్రెస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆ కుటుంబానికి మరో నాయకుడు కనిపించకపోవడం కాంగ్రెస్ కు అలవాటైన సంస్కృతిలో భాగమే. ఆ కుటుంబ సభ్యులే పార్టీకి నాయకత్వం వహించాలన్న దీక్షతో ఉన్న కాంగ్రెస్ నేతలకు జనాభిప్రాయంతో ఎటూ సంబంధం లేదు.
అయినా సులభం కాదు

సోనియాకు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అపారమైన అనుభవం ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఆ పార్టీని పునరుజ్జీవింప చేయడం అంత సులభం కాదు. హిందీ మాట్లాడే రాష్ట్రాలలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయింది. కాంగ్రెస్ కేవలం నాలుగు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అధికారం లేకపోతే భరించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటు లేని వ్యవహారం. వలసలకు ప్రధాన కారణం అదే. ఇతర వెనుకబడిన కులాల నాయకుడిగా ఎదిగిన గుజరాత్ శాసనసభ్యుడు అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్‌లో చేరి ఎక్కువ రోజులు కొనసాగలేక పోయారు. కర్నాటకలో డజను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడంతో కాంగ్రెస్-, జె.డి.(ఎస్) ప్రభుత్వం కుప్ప కూలింది. తెలంగాణలో 19 మంది కాంగ్రెస్ సభ్యులు శాసన సభకు ఎన్నికైతే ఇప్పటికే 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు.

గోవాలో 15 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉంటే పది మంది బిజెపిలో చేరిపోయారు. బొటా బొటి మెజారిటీతో కొనసాగుతున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కూడా కాంగ్రెస్‌కు సులభం కాదు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న చోట సైతం పార్టీని వీడిపోయే వారు పెరుగుతున్నారు. రాహుల్ రాజీనామా తరవాత కొత్త అధ్యక్షుడి నియామకం జరగడంలో విపరీతమైన జాప్యం కారణంగా పార్టీని వీడే వారి సంఖ్య పెరిగింది. రాహుల్ గాంధీ రాజీనామా తరవాత అనేక మంది సతీ సహగమనం చేసినట్టుగా రాజీనామా చేయడంతో సంక్షోభం మరింత ముదిరింది. జ్యోతిరాదిత్య సింధియా, మురళీ దేవర, కమల్ నాథ్, రాజ్ బబ్బర్, హరీశ్ రావత్, వివేక్ తంఖియా, పొన్నం ప్రభాకర్, రాజేశ్ లిలోతియా, వీరేంద్ర రాథోడ్ మొదలైన వారు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం అడుగుజాడల్లో నడిచే పార్టీ కనక వివిధ రాష్ట్రాలలో అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది.

స్వయంకృతాపరాధం
కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి మోడీ, బిజెపి బలపడడం ఒక కారణం మాత్రమే. చాలా కాలం కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. యు.పి.ఎ. రెండవ దఫా అధికారంలో ఉన్నప్పటి అవినీతి ఆరోపణలు ఇంకా జనం మదిలో అలాగే ఉన్నాయి. తమ నాయకుల మీద అవినీతి ఆరోపణలను తరచి చూడడం కాంగ్రెస్‌కు అలవాటే లేదు. 370వ అధికరణం రద్దుపై సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ఆ పార్టీకి కచ్చితమైన సిద్ధాంత ప్రాదిపదిక లేకుండా పోయిందనడానికి తార్కాణం. దాదాపు రెండేళ్ల పాటు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే అందులో కాంగ్రెస్ జాడే లేదు.

నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ధరల పెరుగుదల, ఇతర అలజడుల్లో కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేయలేకపోయింది. మోడీ అయిదేళ్ల పాలనలో కాంగ్రెస్ విమర్శలేవీ జనాన్ని ఆకట్టుకోలేదు. ‘చౌకీ దార్ చోర్ హై’ అన్న రాహుల్ నినాదం వల్ల ఫలితం లేకపోగా బెడిసికొట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో తాను ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది అని రాహుల్ వాపోవాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ నాయకులు ఎంత గిడసబారి పోయారో అర్థం అవుతోంది. కాంగ్రెస్ పతనం, ముఖ్యంగా ఉత్తరాదిన పి.వి. నరసింహా రావు హయాంలోనే మొదలైంది. క్రమంగా కాంగ్రెస్ సిద్ధాంతం ఏమిటో అంతుపట్టకుండా పోయింది. మోడీ మీద విమర్శలకైతే కొదవ లేదు కాని తాము చూపే ప్రత్యామ్నాయ మార్గం ఏమిటో కాంగ్రెస్ ఎన్నడూ చెప్పనే లేదు.

2018 డిసెంబర్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో అధికారంలోకి రాగలిగిన కాంగ్రెస్ ఆరు నెలలైనా తిరక్కుండా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తుడిచిపెట్టుకు పోయింది. పంజాబ్, కేరళ రాష్ట్రాల పార్లమెంటు ఎన్నికలలో పుంజుకున్నట్టు భ్రమ కలిగింది. కానీ అక్టోబర్‌లో హర్యానా, మహారాష్ట్ర, నవంబర్ లేదా డిసెంబర్ లో జార్ఖండ్ లో శాసనసభ ఎన్నికలలోనైనా కాంగ్రెస్ తేరుకుంటుందన్న ఆశే లేదు. కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం సామాన్యమైంది కాదు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు తెలియనిది కాదు. అయినా చక్కదిద్దడానికి నూతన ఆలోచనలు పూజ్యమని మళ్లీ సోనియాను ప్రతిష్ఠించడంతోనే రుజువు అవుతోంది. ఇందిరా గాంధీ కుటుంబానికి ఆవల నాయకులు ఎవరూ కనిపించకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద శాపం.

Story on Congress President position