Home తాజా వార్తలు తీరు మారడంలేదు

తీరు మారడంలేదు

SHuttlers

మన తెలంగాణ/క్రీడా విభాగం: రెండేళ్ల క్రితం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో బలమైన శక్తిగా కనిపించిన భారత్ ప్రస్తుతం పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. గతంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో వరుస విజయాలతో ప్రకంపనలు సృష్టించిన సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, పి.వి.సింధు, హెచ్.ఎస్.ప్రణీత్, అరవింద్, సమీర్ వర్మ, సౌరవ్ వర్మ, కశ్యప్ తదితరులు ప్రస్తుతం చెత్త ఆటతో సతమతమవుతున్నారు. ఒక్క పి.వి.సింధు ప్రపంచ టైటిల్ సాధించడం మినహా ఈ ఏడాది భారత షట్లర్లు సాధించిన పెద్ద విజయాలు ఏమీ లేవంటే అతిశయోక్తి లేదు. సింధు ఈ టోర్నీలో తప్పితే మరో టైటిల్ సాధించనే లేదు. ఇక, సైనా అయితే ఈ ఏడాది అసలు బోణీనే కొట్టలేదు. ఒకప్పుడూ మహిళల బ్యాడ్మింటన్‌ను శాసించి నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా సొంతం చేసుకున్న సైనా కొంతకాలంగా పేలవమైన ఆటతో నిరాశకు గురిచేస్తోంది. కనీసం క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకు సాగలేని స్థితికి చేరుకుంది. ఈ ఏడాది అయితే ఒకటి అర టోర్నీల్లో తప్పితే క్వార్టర్ ఫైనల్ దాటలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో టోర్నీ ఏదైనా సైనా కచ్చితం ఫైనల్‌కు చేరేది. అంతేగాక చాలా టోర్నీల్లో టైటిల్స్ కూడా సొంతం చేసుకుంది. కానీ, రెండేళ్లుగా సైనా ఆట తిరోగమనంలో సాగుతోంది. పేలవమైన ఆటతో అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. చైనా, జపాన్, కొరియా, తైపీ షట్లర్లు వరుస విజయాలతో చెలరేగి పోతుండగా సైనా మాత్రం కనీసం సెమీస్‌కు కూడా చేరుకోలేక పోతోంది. ఇలాంటి పరిస్థితే సింధు కూడా ఎదుర్కొంటోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం తప్పిస్తే సింధు పెద్దగా రాణించలేదనే చెప్పాలి.
ఆ తర్వాత జరిగిన దాదాపు అన్ని టోర్నీల్లోనూ ఘోర వైఫల్యం చవిచూసింది. కనీసం క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరుకోలేక పోతోంది. రెండేళ్ల క్రితం వరకు ఫైనల్ ఫొబియాతో సతమతమైన సింధు ప్రస్తుతం సెమీఫైనల్‌కు కూడా చేరుకోవడంలో విఫలమవుతోంది. భారత అగ్రశ్రేణి షట్లర్లుగా పేరు తెచ్చుకున్న సింధు, సైనాలు పేలవమైన ప్రదర్శనను కనబరుస్తుండడంతో భారత బ్యాడ్మింటన్ ప్రశ్నార్థకంగా మారింది. గతంలో సింధు, సైనాల ఆటను చూసి చాలా మంది బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. అంతలా వీరిద్దరి ప్రభావం ఉండేది. కానీ, కొన్నేళ్లుగా ఇటు సింధు, అటు సైనాలు చెత్త ఆటతో తీరని వేదనే మిగుల్చుతున్నారు. వీరు వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా ప్రధాన కోచ్ గోపీచంద్ కానీ, వారి వ్యక్తిగత శిక్షకులు కానీ దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడం విడ్డూరంగా ఉంది. టైటిల్స్ గెలిస్తే తమ వల్లే ఇది సాధ్యమైందనే గొప్పలకు పోయే శిక్షకులు క్రీడాకారిణిలు పేలవమైన ఫామ్‌తో సతమతమయినా పట్టించుకోక పోవడం బాధాకరం.
ఇక, పురుషుల బ్యాడ్మింటన్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ముఖ్యంగా కిదాంబి శ్రీకాంత్ అత్యంత చెత్త ఆటతో పరువును తీస్తున్నాడు. గతంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తిరుగులేని శక్తిగా కొనసాగిన శ్రీకాంత్ రెండు సీజన్లుగా కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేదంటే అతని ఆట ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఒకవైపు గాయాలు, మరోవైపు పేలవమైన ఆటతో శ్రీకాంత్ కెరీర్ ప్రశ్నార్థకంగా తయారైంది.
ఇప్పటికైనా ఆట తీరును మెరుగు పరుచుకోక పోతే రానున్న రోజుల్లో మరింత దుస్థితికి చేరుకోవడం ఖాయం. ఇక, ప్రణయ్, శ్రీకాంత్, సమీర్, సౌరవ్ వర్మ తదితరుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.తెలుగుతేజం సాయి ప్రణీత్ ఒక్కడే కాస్త మెరుగైన ఆటతో ఆశలు చిగురింప చేస్తున్నారు. మిగతా షట్లర్లు కూడా తమ ఆటను మెరుగు పరుచుకుని పూర్వ స్థితికి చేరుకోవాలని ఆశిద్ధాం.

Story On Indian Badminton players