Home రాష్ట్ర వార్తలు నేరుగా నిధులు

నేరుగా నిధులు

ఇక నుంచి పంచాయతీలకు నేరుగా నిధులు 

పెద్ద పంచాయతీలకు కోటి, చిన్న వాటికి రూ.15 లక్షలు
కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలు 150కి పెంచుతాం,
తెలుగు రాష్ట్రాల కరువు నివేదికలు అందలేదు : కేంద్రమంత్రి బీరేందర్ సింగ్

panchayatహైదరాబాద్: ఇక నుండి కేంద్రం నుంచి నేరుగా పంచాయతీల కు నిధులు కేటాయిస్తామని కేంద్ర గ్రామీణాభి వృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ తెలిపారు. సంవత్సరానికి చిన్న పంచాయతీలకు రూ.15 లక్షల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.కోటి వర కు నిధులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 2.46 లక్షల పంచాయతీలకు రూ.2 లక్షల కోట్ల నిధులను కేటాయిస్తామని తెలిపారు. ఈ నిధుల ను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలుగా పంచాయతీలకు సహకరించేందుకు 10 వేల మంది బేర్‌పుట్ ఇంజినీర్లను భాగస్వాములు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయ న అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుధ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమా వేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడా రు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్, సహాయ కార్యదర్శి మహోపాత్ర తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పని దినాలు 150 రోజులకు పెంపు :

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కరువుకు సంబంధించిన నివేదిక ఇంకా కేంద్రానికి అందలేదని కేంద్ర మంత్రి బీరేందర్‌సింగ్ తెలిపారు. దేశంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో అమలవుతున్న మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని దినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని నిర్ణయించామన్నారు. మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి కరువు పరిస్థితులపై నివేదికలు రావడంతో ఆ రాష్ట్రాల్లో పని దినాలను 150 రోజులకు పెంచేందుకు నిర్ణయించామన్నారు. మహారాష్ట్ర, ఒడిశాల నుండి వచ్చిన నివేదికల ను పరిశీలిస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి నివేదికల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనే రాష్ట్రాలకు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని తెలిపారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మరిన్ని పనులు కల్పించడం ద్వారా స్థానికులకు మెరుగైన ఉపాధి కల్పించనున్నామన్నారు.

డబుల్ బెడ్ రూమ్‌పై త్వరలో నిర్ణయం :

దేశంలో ఇళ్లు లేని 2.95 కోట్ల కుటుంబాలన్నిటికీ గృహ వసతి కల్పిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందుకు వీలుగా లబ్దిదారుల ఎంపికలో దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారికే అనే షరతును సడలించినట్లు వెల్లడించారు. ఇళ్ల వైశాల్యాన్ని 20 చదరపు మీటర్ల నుండి 25 చదరపు మీటర్లకు పెంచాలని నిర్ణయించామన్నారు. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇచ్చే సహాయాన్ని దాదాపు రెట్టింపు చేసి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. నిర్మించే ఇళ్లలో కనీసం రెండు గదులు ఉండేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం అతి త్వరలో లభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. కొత్త రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వాల నుండి నివేదిక కోరామని ఆయన తెలిపారు. పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి 13,000 కిలోమీటర్ల మేర రోడ్ల కనెక్టివిటీ కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలను నివారించే లక్షంతో శ్యామా ప్రసాద్ రూర్బన్ మిషన్‌కు శ్రీకారం చుట్టామని బీరేందర్‌సింగ్ తెలిపారు. అతి త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు మొదలౌతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో కేంద్ర, రాష్ట్రాల నిధుల కేటాయింపు నిష్పత్తిలో మార్పులు చేసినట్లు చౌదరి బీరేందర్‌సింగ్ చెప్పారు. కేంద్రం వాటా 60 శాతం ఉంటుందని, రాష్ట్రాలు 40 శాతం వాటాను భరించాల్సి ఉంటుందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధులను రూ.15 వేల కోట్ల నుంచి రూ.19 కోట్లకు పెంచామన్నారు. కొండ ప్రాంత రాష్ట్రాలు జమ్ముకాశ్మీర్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలు గతంలో ఉన్నట్లే 10 శాతం నిధులను మాత్రమే భరిస్తే సరిపోతుందన్నారు.
మోడీ ఒక్కటే బాధ్యుడు కాదు బీహార్ ఎన్నికల ఫలితాలకు ప్రధాని మోడీ ఒక్కటే బాధ్యుడు కాదని మంత్రి బీరేంద్ర సింగ్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.