Home ఎడిటోరియల్ చెరువులకు జీవకళ

చెరువులకు జీవకళ

Telangana CM KCR will visit Vijayawada Tomorrow

నాడు అశోకుడు చెట్లు నాటిస్తే నేడు కెసిఆర్ చెరువులు నింపిస్తున్నారు అని చరిత్రలో భావితరాలు చదువుకుంటారనటంలో అతిశయోక్తి లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆధారం చెరువు. ఊరి చెరువు నిండితే ఊరంతా సంబురమే. తెలంగాణకు తరిగిపోని సంపద ఈ గొలుసుకట్టు చెరువులు, వ్యవసాయం కుల వృత్తుల మనుగడకు ఈ చెరువులే ఆధారంగా నిలుస్తున్నాయి. సమైక్య పాలనలో చెరువులు కళ తప్పినాయి, నీరు పారాల్సిన చెరువులు చెత్తాచెదారం, గుర్రపు డెక్కతో నిండాయి. చెరువు కట్టలు సర్కారీ తుమ్మలతో నిండిపోయాయి. చెరువుల విలువ తెలియని అప్పటి పాలకులు వాటిని గాలికొదిలేయడం, అభివృద్ధిపరచకపోవడంతో గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమై కులవృత్తులు కుంటుబడినాయి.
రాష్ట్రం ఏర్పాటు అనంతరం నూతనంగా కొలువైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పుణరుద్ధరణకై మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ విజయవంతం చేశారు నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు. చెరువుల పూటికతీసి పూర్వవైభవం తీసుకొచ్చారు. చెరువుల నీటి సామర్ధ్యాన్ని పెంచుతూ, చెరువుకు ప్రాణం పోశారు. ఇదో గొప్ప ఆలోచన చెరువులకు జీవం పోయడం అంటే గ్రామీణ వ్యవస్థకు జీవం పోయడమే.
చెరువులకు నిరంతర జలకళ తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలు రూపొందించారు. చెరువులో నిరంతరం నీరు ఉంచడం ద్వారా గ్రామీణ వ్యవస్థకు జీవం ఇస్తూ, వ్యవసాయరంగం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కెసిఆర్. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ముమ్మరంగా సాగుతుంది. ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తికి సిద్ధంగా ఉన్నాయి. ప్రాజెక్టుల ద్వారా కాలువలకు, తద్వారా పంటలకు నీరందనుంది. ఐతే ఈ కాలువల ద్వారా నీరు అందని భూములకు కూడా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం.
ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయాలనే చరిత్రాత్మక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి కెసిఆర్. ఇదో అద్భుత ఆలోచన. చెరువు నిరంతరం జీవకళతో శోభిల్లితే పల్లెలు సస్యశ్యామలమై, వ్యవసాయం లాభసాటి అవుతుంది. రాష్టంలోని సుమారు 44928 చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేయనున్నారు. తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు అధికం. ఒక చెరువు నిండిందంటే దాని మత్తడి ద్వారా దాని గొలుసు ద్వారా క్రిందనే ఉన్న మరో చెరువుకు నీరు చేరుతుంది. ఇలా చాలా చెరువులకు నీరు చేరుతుంది. ప్రాజెక్ట్‌లతో నీరు అందని పొలాలకు ఈ చెరువుల అనుసంధానం ద్వారా నీరందుతుంది.
ప్రాజెక్ట్ గుండా గొలుసుకట్టు చెరువులకు నీరందించాలంటే భూసేకరణ అవసరం. రైతు తన పంటకు నీరొస్తుందంటే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ అలా జరగని పక్షంలో పైప్‌లైన్ల ద్వారా ఒక చెరువునుండి మరో చెరువుకు నీరును తరలించేందుకు ప్రణాళికలు రచిస్తుంది తెలంగాణ సర్కార్.
ఏడాది మొత్తం చెరువులు నిండుకుండలుగా ఉండటం గ్రామాలలో సిరులు పండించనుందనడంలో సందేహం లేదు. చెరువు నిండాలంటే వర్షాలే ఆధారం కానీ ఈ చెరువుల అనుసంధానంతో అరకొర వర్షాలు పడ్డా వాటిని నింపుకునే అవకాశం కలిగి పచ్చని పొలాలు పులకరించనున్నాయి. ఎగువ భాగంలో ఉన్న గొలుసుకట్టు చెరువును నింపడం ద్వారా దాని గొలుసుగా ఉన్న చివరి చెరువు వరకు నీరు చేరుతుంది. తద్వారా 365 రోజుల పాటు నిరంతరం చెరువులలో నీరు ఉంటుంది.
ఈ అనుసంధానంపై ఇప్పటికే మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెరువుల అనుసంధానం కోసం రైతులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అనుసంధానం అనంతం చెరువు బాధ్యతలను రైతులకు అప్పజెప్పనున్నట్టు తెలుస్తుంది. ఇది శుభపరిణామం నీటి విలువ తెలిసిన వాడు రైతు, నీటి కోసం పడిగాపులు గాసిన చోట ప్రభుత్వమే జలసిరులు అందిస్తుండటంతో రైతు సైతం తన పంట కోసం ఈ యజ్ఞంలో భాగస్వామయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుండటం శుభపరిణామం. చెరువు మూలం రైతుకెరుక, చెరువు పై పూర్తి పట్టు రైతుకు ఉంటుంది. ఎలా చేస్తే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందో రైతు నుండి సలహాలు తీసుకోవాలనుకునే ప్రభుత్వ ఆలోచన అభినందనీయం.
మిషన్ కాకతీయతో చెరువులలో నీటి నిల్వ సామర్ద్యం పెంచుకుని, నేడు ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం ద్వారా ఆ చెరువుల్లో నిరంతర జీవకళ ఉండే విధంగా కృషి చేసి ప్రజల బ్రతుకుల్లో వెలుగునింపేందుకు పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం అభినందనీయం. నిరాదరణకు గురైన చెరువులకు మహర్దశ తీసుకొస్తూ, సమైక్య పాలనలో సర్కారీ తుమ్మలతో నిండిన చెరువులను బాగుచేసి నిరంతర జల భాండాగారాలుగా మార్చేందుకు చర్యలు చేపట్టడం ఒక చారిత్రక సందర్భం. మనసుంటే మార్గముంటది. ప్రజల మూలాలు వారి జీవనానికి ఏది చేస్తే లాభం జరుగుతుంది. గ్రామీణ వ్యవస్థపై పట్టు ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే ఈ చెరువుల అనుసంధానం అనే బృహత్తర యజ్ఞం జరుగుతోంది. గ్రామీణ వ్యవస్థకు నిజంగా ఇది నవశకం అని చెప్పవచ్చు. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం మరో నూతన అధ్యాయానికి తెరతీయనుందనటంలో ఎలాంటి సందేహం లేదు.