*రూ.122 కోట్లతో ఎస్‌ఆర్‌ఎస్‌పి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
*ఎస్‌ఆర్‌ఎస్‌పి మొదటి, రెండవ దశల కింద 14లక్షల ఎకరాలకు సాగునీరు
*రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
మనతెలంగాణ/హసన్‌పర్తి: రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఆయన రూ.122.91 కోట్ల అంచనా విలువలో చేపట్టనున్న శ్రీరాంసాగర్-కాకతీయ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులకు కడియం శ్రీహరి వర్థన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్‌తో కలసి శంకుస్థాపన చేశారు. హసన్‌పర్తి మండలం, భీమారం గ్రామంలోని చింతగట్టు క్యాంపు వద్ద నీటి పారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జరిగిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొదటి, రెండవ దశల కింద రూ.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దశలో భాగంగా ప్రధాన కాకతీయ కాలువ నుంచి నీరు వెళ్లే సామర్థం పెంచేందుకు గాను ఎల్‌ఎండి నుంచి దిగువ డిబిఎం 31వరకు రూ.60 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఎల్‌ఎండి నుంచి నీరు దిగువ వెళ్లే మార్గంలో చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు గాను కాలువ లైనింగ్, బండ్ ఎత్తు పెంచేందుకు మూడు ప్యాకేజీల కింద రూ.440 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు జరగనున్నాయని తెలిపారు. ఆశించిన స్థాయిలో ఎస్సారెస్పికి నీరు రావడం లేనందున కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న మూడు జలశయాలు పూర్తయితే, మేడిగడ్డ జలాశయం నుంచి ఎల్‌ఎండికి నీరు వస్తుందని తద్వారా మొదటగా లాభపడేది వరంగల్ జిల్లా రైతులేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో ఇదొక భాగమని, ఈ జనవరి 1 నుంచి వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తోందని, వ్యవసాయానికి పెట్టుబడి రూపంలో ఎకరానికి రూ.4 వేలు కూడా అందించనున్నదని శ్రీహరి తెలిపారు. మూడున్నర సంవత్సరాలలో దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తయితే కోటి ఎకరాలలో సాగునీరందించునని వర్థన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో బీడు భూములన్ని మాగాణి భూములుగా మారుతాయన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో రెం డు పంటలు పండించవచ్చునని అన్నారు. మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు, వ్యవసాయానికి పెట్టుబడి తదితర కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ దయానంద్, జిల్లా రెవెన్యూ అధికారి కె.శోభ, టిఆర్‌ఎస్ ఉమ్మడి జాల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, హసన్‌పర్తి జడ్పిటిసి సుభాష్, ఎంపిపి సుకన్య, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.