Tuesday, March 19, 2024

ఉల్లంఘిస్తే జైలే..

- Advertisement -
- Advertisement -

Strict regulations on cryptocurrency transactions

క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై కఠిన నిబంధనలు
ఆర్‌బిఐ, సెబీకి అధికారాలు, ఐటి పర్యవేక్షణ
ప్రతిపాదిత బిల్లులో తీసుకొస్తున్న ప్రభుత్వం: నివేదిక

న్యూఢిల్లీ : భారతదేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్రిప్టోకరెన్సీకి చరమగీతం పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపాదిత కొత్త క్రిప్టో బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, క్రిప్టోకరెన్సీ చెల్లింపులను నిషేధించే ప్రతిపాదిత చట్టంతో నిబంధనలను ఉల్లంఘించేవారిని వారెంట్ లేకుండా అరెస్టు, అలాగే బెయిల్ లేకుండా నిర్బంధించేలా చర్యలు చేపట్టింది. క్రిప్టోకరెన్సీలపై సెప్టెంబర్‌లో చైనా తీసుకున్న చర్యలకు అనుగుణంగా కఠినంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత ప్రభుత్వం డిజిటల్ కరెన్సీలలో మైనింగ్, ఉత్పత్తి, హోల్డింగ్, అమ్మకం, లావాదేవీలపై నిషేధం విధించనుంది. ఈ నిబంధనల ఉల్లంఘిస్తే వారెంట్ లేకుండా అరెస్టు చేయడం, నాన్ బెయిలబుల్ కిందకు వస్తుంది. ఇటీవల క్రిప్టోకరెన్సీల ధరలు పెరగడంతో దేశంలో క్రిప్టో అసెట్స్‌లో పెట్టుబడిదారుల సంఖ్య పెరిగింది. పరిశ్రమ అంచనాల ప్రకారం దేశంలో 15 మిలియన్ల నుండి 20 మిలియన్ల క్రిప్టో పెట్టుబడిదారులు ఉన్నారు. మొత్తం క్రిప్టో హోల్డింగ్‌లు రూ. 45,000 కోట్లు (6 బిలియన్ డాలర్ల్లు) ఉన్నాయి. కొత్త బిల్లు ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రయత్నించే ప్రకటనలపైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

ఆర్‌బిఐ, సెబీకి క్రిప్టోపై అధికారాలు

కొత్త క్రిప్టోకరెన్సీ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే ఈ బిల్లుతో ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్), మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి అధికారాలు ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక క్లయింట్ల నుంచి క్రిప్టో ఎక్సేంజ్‌లు సేకరించిన సమాచారాన్ని, ఇన్వెస్టర్ల కెవైసి (నో యువర్ కస్టమర్) డేటాను ఆదాయం పన్ను విభాగం పరిశీలించనుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కొత్త నిబంధనల మేరకు క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌లు తప్పనిసరిగా కెవైసి డేటాను పంచుకోవాలి. దీనిలో ప్రధానంగా ఇన్వెస్టర్ల వివరాలు ఉంటాయి.

డీలిస్టింగ్ నిబంధనలను సవరించిన సెబీ

మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) లిస్టెడ్ కంపెనీలకు విలీనం, కొనుగోలు ఒప్పందాలను సులభతరం చేసే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా ఓపెన్ ఆఫర్ తర్వాత కంపెనీ ఈక్విటీ షేర్ల డీలిస్టింగ్ నిబంధనలను సవరించింది. సెబీ ప్రకారం, ప్రమోటర్లు లేదా కొనుగోలు చేసే కంపెనీలు ప్రారంభ పబ్లిక్ ప్రకటన ద్వారా కంపెనీ షేర్లను ఎక్స్ఛేంజీల నుండి తొలగించాలనే ఉద్దేశ్యాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన కంపెనీ సంస్థను డీలిస్ట్ చేయాలనుకుంటే, ఓపెన్ ఆఫర్ ధర కంటే ఎక్కువ ధరకు షేర్ల తొలగింపును ప్రకటించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News