Wednesday, March 29, 2023

సింగరేణిలో సిఎం హామీలపై సమ్మె

- Advertisement -

SINGAREDNI

* జాతీయ కార్మిక సంఘాల కసరత్తులు
* ఈనెల 14న టోకెన్ సమ్మె
* సిఎం హామీలపై ప్రతిపక్షాల మండిపాటు
* ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాల ఆందోళనలు
* కారుణ్య నియమాకాలపై అధికార పార్టీ ముసాయిదా
* సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికార యూనియన్ యత్నాలు

సింగరేణిలో సిఎం కెసిఆర్ ఎన్నికల తరువాత ప్రగతి భవన్‌లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయంలో సమ్మె చేసేందుకు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఏర్పడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాయి. ఈనెల 14న సింగరేణి వ్యాప్తంగా టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చాయి. టోకెన్ సమ్మె అనంతరం సమస్యను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యూనియన్ టిబిజికెఎస్ సూచన మేరకు సింగరేణిలో ప్రధాన సమస్యల అయిన వారసత్వ ఉద్యోగాల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కారుణ్య నియామకాలపై సిఎం కెసిఆర్ ముసాయిదా విడుదల చేశారు. అంతే కాకుండా అధికార టిబిజికెఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సిఎం కెసిఆర్ సింగరేణి పర్యటన అనంతరం కారుణ్య నియామకాలు చేపడుతారని ప్రకటించారు. జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 14న టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు మరోవైపు టిబిజికెఎస్ యత్నిస్తుంది. కార్మికులకు కారుణ్య నియామకాల ఎర వేసి, విఫలం చేసేందుకు యోచిస్తోంది. అయినప్పటికి కార్మికులు నమ్మడం లేదు. ఇప్పటికే సిఎం హామీలపై ఎఐటియుసి, సిఐటియు, పలు సార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. గనుల వద్ద నిరసన కార్యక్రమాలతో పాటు సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. సింగరేణిలో కార్మికులకు సొంతింటి నిర్మాణం కోసం రూ. 10 లక్షల రుణాలు ఇస్తామని కారుణ్య నియామకాలు చేపడుతామని కార్మికులకు ఏసి సౌకర్యం కల్పిస్తామని, ఇప్పటికి అమలు చేయకపోవడంతో కార్మిక సంఘాల నాయకులతో పాటు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా విపక్ష పార్టీ నాయకులు సైతం సిఎం హామీలపై మండిపడుతున్నారు. సింగరేణి ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి 9 డివిజన్‌లలో విజయం సాధించిన టిబిజికెఎస్‌కు నాయకత్వ లోపం ఉందని ఇప్పటికి యూనియన్ పగ్గాలు ఎవరికి అప్పగించలేదని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల్లో కోట్లు కుమ్మరించిన వ్యవహారంలో కోర్టు మొట్టికాయలు వేయడంతో పాటు పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి రెండేళ్ల వరకు తగ్గించడం జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో సిఎం హామీల అమలు కోసం సమ్మె చేయకతప్పదని జాతీయ కార్మిక సంఘాలు అంటుండగా మరోవైపు అధికార టిబిజికెఎస్ యూనియన్ కార్మికులకు మళ్లీ ఎర చూపి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతుంది. ఏదిఏమైనా ఈనెల 14న టోకెన్ సమ్మె అనంతరం నిరవధిక సమ్మె జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News