Home ఆఫ్ బీట్ వీసాకు వేళ్లే ముందు…

వీసాకు వేళ్లే ముందు…

Student Visa Interview Question & Answers Tips

విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని ప్రతి విద్యార్థి కలలు కంటాడు. అమెరికాలోని యూనివర్సిటీలో సీటు  వస్తే అభ్యర్థి ముందుగా చేయాల్సింది వీసా పొందటం. ఇదొక ప్రముఖ ఘట్టమనే చెప్పుకోవాలి.  విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్న తర్వాత విద్యార్థి ముందుగా వీసా ఇంటర్వూకి హాజరవ్వాలి. దీనికంటే ముందు ప్రతి విద్యార్థీ తన ఐ-20 ఫారాన్ని పూర్తిగా సమీక్షించుకోవాలి. పేరు సరిగ్గా ఉందా లేదా, గడువు తేదీలు, ముఖ్యమైన తేదీలు.. అంటే డేట్ ఆఫ్ జాయినింగ్, రిపోర్టింగ్, ఫీజు కట్టాల్సిన గడువు, కోర్సు కాలపరిమితి, పెండింగ్ సమాచారం మొదలైనవి జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.

ఇంటర్వ్యూ కోసం వీలైనంత శుభ్రంగా తయారై వెళ్లాలి. ఫార్మల్ దుస్తులను ధరించాలి. ప్రశాంతంగా ఉండాలి, ఇంటర్వ్యూ చేసేవారి కళ్లలోకి సూటిగా చూస్తూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. జవాబులు క్లుప్తంగా చెప్పాలి. సంభాషణకి నప్పేలా మీ హావభావాలు ఉండేలా చూసుకోవాలి.

సొంత ఆస్తులైన ఇళ్లు, అపార్ట్‌మెంట్, పొలాలు వంటివి తాకట్టులో ఉంచి, విద్యార్థి రుణం రూపంలో ఆర్థిక సహాయానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతి బ్యాంకుకూ ఆస్తుల తనఖాకు సంబంధించి నిర్ణీత పద్ధతులుంటాయనే విషయాన్ని తెలుసుకోవాలి. బ్యాంకులు పూర్తి మొత్తాన్ని లేదా పాక్షిక మొత్తాన్నే రుణంగా మంజూరు చేయవచ్చు. ఎందుకంటే ఆస్తులకు ప్రతి ఏడాదీ విలువ తగ్గుతుంటుందని (డిప్రిసియేషన్) చార్టర్డ్ ఇంజినీరు/ చార్టర్డ్ ఎకౌంటెంట్ చేసే మదింపు ప్రకారమే బ్యాంకు మేనేజరు రుణం మంజూరుపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ పూర్తి చేసాక, వీసా కోసం ఇంటర్వ్యూ షెడ్యూలు చేసుకోవడం మరో ముఖ్యమైన కార్యక్రమం. ఈ ఇంటర్వ్యూకి ప్రతి విద్యార్థ్థి అత్యంత శ్రద్ధగా సిద్ధం కావాలి. డీఎస్ 160 ఫారం నింపడం, వీసా ఫీజును నిర్ణీత బ్యాంకులో జమ చేయడం, విద్యాకాలం పూర్తయ్యే వరకు పాస్‌పోర్టు వ్యాలిడిటీ ఉండేలా చూసుకోవడం, బ్యాంకు స్టేట్‌మెంట్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ స్టేట్‌మెంట్ అన్నీ సరిచూసుకోవాలి. విద్యార్థులు ఈ ఇంటర్వ్యూను ఇంగ్లిష్‌లో షెడ్యూలు చేసుకోవాలి.

ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తించాలంటే.
1. వీసా ఇంటర్వ్యూకు ముందు తగిన ఆహారాన్ని తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. పెద్ద కాన్సలేట్లలో వేచి ఉండాల్సిన సమయం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో , ఉత్సాహంగా ఉండడం చాలా ముఖ్యం.
2. స్టూడెంట్ వీసాకి మెదటిసారిగా దరఖాస్తు చేస్తున్నపుడు వీసా దరఖాస్తు ఫీజు మాత్రమే కాకుండా SEVIS (స్టూడెంట్ ఎక్స్చేంజి అండ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ఫీజు కూడా చెల్లించాలి.
3. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన పత్రాల జాబితా సిద్ధం చేసుకోవాలి. ముందురోజు రాత్రే అన్ని పత్రాలను సరిచూసుకోవాలి. వాటిని మీదగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతాయి.
4. అన్ని దరఖాస్తులనూ, డీఎస్ ఫారాలనూ జాగ్రత్తగా నింపాలి. రాతప్రతులన్నీ చదవగలిగేలా ఉండేటట్లు చూసుకోవాలి. పుట్టినతేదీ వంటి ముఖ్యమైన సమాచారాలను సరిచూసుకోవాలి.
5. ఇంటర్వ్యూ కోసం సాధన చేసేటపుడు బిగ్గరగా మాట్లాడుతూ సాధన చేయాలి. మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, మిత్రులతో కలిసి ప్రశ్నావళిలోని ప్రశ్నలకు జవాబులు చెప్పడం వంటివి సాధన చేయాలి.
6. ఇంటర్వ్యూ ఆంగ్లంలోనే జరుగుతుంది. కాబట్టి మాక్ ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్‌లో జవాబులు చెప్పడం అలవాటు చేసుకోవాలి.
7. మీరు చేరబోయే కోర్సు/ ప్రోగ్రామ్ గురించి పూర్తి సమాచారం సేకరించుకుని ఉంచుకోవాలి. మీ కెరియర్ ప్రణాళికలపై అది ఎలా ప్రభావం చూపుతుందో వివరించగలగాలి. విద్యార్థి తగిన కారణాలు చూపి, కౌన్సలర్ ఆఫీసర్‌ను ఒప్పించాలి.
8. ఇంటర్వూ విజయవంతం కావాలంటే నిజాయితీగా జవాబులు చెప్పడం అవసరం. ఎక్కువ మంది విద్యార్థులను ఇంటర్వూలకు ఏర్పాటు చేయవలసి ఉన్నందున ఆఫీసర్లకు సమయం చాలా తక్కువగా ఉంటుంది.
9. అమెరికాకి వెళ్లే ప్రధాన ఉద్దేశం చదువు కోసమే కానీ, ఉద్యోగం కోసం కాదు. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి ఎలా వద్దామనుకుంటున్నారో అధికారులకు వివరించాలి.
10. బ్యాంకు స్టేట్‌మెంట్లు, లెటర్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, అవార్డులు, సర్టిఫికెట్ల వంటి అనుబంధ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
11. అమెరికాలో ఎందుకు చదవాలనుకుంటున్నారు? ఈ విశ్వవిద్యాలయానికే ఎందుకు దరఖాస్తు చేస్తున్నారు? గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక మీ ప్రణాళికలు ఏమిటి? మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నది ఎవరు? వంటి మౌలికమైన ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి.
12. సంబంధిత పత్రాలన్నింటినీ ఒక క్రమంలో ఒక ఫోల్డరులో పెట్టుకుని ఉంచుకోవడం వల్ల, అవసరమైన పత్రాన్ని అడిగిన వెంటనే తడబాటూ, కంగారూ లేకుండా తీసి ఇవ్వడానికి వీలుంటుంది.
13. ఇంటర్వ్యూ కోసం వీలైనంత శుభ్రంగా తయారై వెళ్లాలి. ఫార్మల్ దుస్తులను ధరించాలి. ప్రశాంతంగా ఉండాలి, ఇంటర్వ్యూ చేసేవారి కళ్లలోకి సూటిగా చూస్తూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. జవాబులు క్లుప్తంగా చెప్పాలి. సంభాషణకి నప్పేలా మీ హావభావాలు ఉండేలా చూసుకోవాలి.
14. ఫొటోలు అమెరికా ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలా 2X2 సైజులో ఉండేలా జాగ్రత్త వహించాలి.

చేయకూడనివి :
1. ఆహారం, పానీయాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంటర్వ్యూకి తీసుకెళ్లకూడదు.
2. తప్పు పత్రాలను సమర్పించాలని చూడకూడదు. అలా చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అటువంటి ఆలోచన కూడా చేయవద్దు. ఎంత చిన్న సమాచారమైనా తప్పుగా ఇవ్వవద్దు.
3. అడిగితే కానీ మాట్లాడవద్దు, అడగనిదే ఏ పత్రాలనీ ఇవ్వవద్దు.
4. అసమగ్ర, అసంపూర్తి సమాచారం ఇవ్వవద్దు. సంబంధిత పత్రాలు కూడా పూర్తిగా ఉండేటట్లు చూసుకోవాలి. దీనిలో ఏ చిన్న తేడా వచ్చినా మీకు వీసా ఇవ్వకపోవచ్చు.
5. ఎక్కువగా మాట్లాడవద్దు. అలా అని మరీ తక్కువగా మాట్లాడవద్దు. కాన్సలర్ ఆఫీసర్‌తో వాదనకి దిగవద్దు. క్లుప్తంగా, అడిగినవాటికి మాత్రమే సమాధానమివ్వండి.
6. మీ పత్రాలు ప్రెజెంటబుల్‌గా ఉండేట్లు చూసుకోవాలి. చిరిగిన, నలిగిన పత్రాలను దాఖలు చేయవద్దు.
7. జవాబులు చెప్పేటపుడు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొంచెం కంగారుగా ఉన్నా దాన్ని ప్రదర్శించకూడదు.
8. నత్తిగా మాట్లాడడం, ఒకే విషయాన్ని ఎక్కువసేపు చెప్పకూడదు. అన్ని ప్రశ్నలకూ సూటిగా, నిజాయతీగా, స్పష్టంగా సమాధానం ఇవ్వాలి.
9. ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళ్లకూడదు.
10. మీకు అమెరికాలో చాలామంది చుట్టాలున్నారని చెప్పవద్దు.
11. మీకు ప్రశ్న అర్థం కాకపోతే మరోసారి చెప్పమని అడగవచ్చు. లేదా మీకు అర్థమయ్యేలా ప్రశ్నను మార్చి అడగమని కోరవచ్చు.
12. అమెరికన్‌లా మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. అది కృత్రిమమని వాళ్లు గ్రహిస్తారు. అలాగే పూర్తి భారతీయ యాస/ దేశభక్తి నిండిన స్వరంతో మాట్లాడవద్దు. మీలా మీరు మాట్లాడితే చాలు.
13. అమెరికాలో అడుగు పెట్టాక, మీరు (ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన) ఇబ్బందులను ఎదుర్కొంటారనే అభిప్రాయాన్ని వాళ్లకి కలిగించకూడదు.

Student Visa Interview Question & Answers Tips

Telangana news