Home ఆఫ్ బీట్ సమాజసేవలో విద్యార్థులకు స్ఫూర్తి…

సమాజసేవలో విద్యార్థులకు స్ఫూర్తి…

 students in the community service

ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎనలేనిది.
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
భగవంతుడి తర్వాత గురువుకంతటి ప్రాధాన్యం ఇచ్చారు. గురువంటే కేవలం పాఠాలు చెప్పి వెళ్లటం కాదు. విద్యార్థిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే మహోన్నతుడు గురువు. చదువుతోపాటు సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, అవయవదాన అవగాహన చేస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోన్న రామకృష్ణారావుతో నేడు టీచర్స్ డే సందర్భంగా ‘సకుటుంబం’ మాటామంతీ…

మొక్కలు నాటాలనే ఆలోచన ఎలా వచ్చింది….
నేను పుట్టి పెరిగింది మొత్తం పల్లెటూరు వాతావరణం కాబట్టి చిన్నతనం నుంచి పర్యావణంపై ఎక్కువ ప్రేమ ఉండేది. మా నాన్న టీచర్‌గా ఉన్న సమయంలో ఇంట్లో చాలా వరకు ప్రకృతి గురించి చెప్పేవారు.
మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
మాది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల. నాన్న వెంకటేశ్వరరావు రిటైర్డ్ టీచర్, అమ్మ వసంత గృహిణి, ఒక చెల్లెలు, నా భార్య గృహిణి, పిల్లలు చదువుతున్నారు. నేను చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మధ్యతరగతి కుటుంబం మాది. చిన్నప్పటి నుంచి పర్యావరణం పట్ల నాన్న చూపిన శ్రద్ధ నాలో బలంగా నాటుకుపోయింది. అదే పెద్దయ్యాక నేనూ ఏదైనా చెయ్యాలనే తపన కలిగించింది. చేసే ప్రతి పనికీ కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉంది.
ఉపాధ్యాయ రంగంలోకి ఎప్పుడు వచ్చారు…..
కేవలం డబ్బులకోసం అని కాకుండా పదిమందికి సేవ చేయాలనే ఆలోచన ఉండేది. అందుకని టీచర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. బిఇడి పూర్తిచేసి 1998లో మొయినాబాద్ మండలంలోని తోల్‌కట్ట గ్రామంలో స్కూల్ అసిస్టెంట్‌గా చేరాను. తరువాత గడిసింగాపూర్, దర్గ, పరిగి, కుల్కచర్ల, కమ్మెట ప్రభుత్వ పాఠశాలలకు బదిలీపై వెళ్లాను. ప్రస్తుతం శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాను.
నా సొంత ఖర్చులతో టీచర్లను నియమించా….
నా మొదటి పోస్టింగ్ వచ్చిన సమయంలో తోట్కట్ట ప్రభుత్వ పాఠశాలలో నేను ఒక్కడినే టీచర్‌ని. అప్పుడు రూ.1200 జీతం వచ్చేది. దాంతో నేను ఒక ప్రైవేట్ టీచర్‌ని నియమించి నా జీతం తనకు ఇచ్చేవాడిని. సాయంత్రం స్కూల్ అయిపోయిన తరువాత హైదరాబాద్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేసి ఇంట్లో డబ్బులు ఇచ్చేవాడిని. తరువాత 2005లో కమ్మెట గ్రామంలోని పాఠశాలలో పనిచేశాను. అక్కడ ఇద్దరమే ఉపాధ్యాయులం. దాంతో నేను ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పని చేయవలసివచ్చింది. నిధులు లేవు, సౌకర్యాలు లేవు. వీటిని తీర్చాలంటే డబ్బు కావాలి ఎలా..? గ్రామస్తుల భాగస్వామ్యంతో పాటు నా పాత స్నేహితులు అందరం కలిసి ప్రైవేట్ టీచర్లను ఏర్పాటు చేశాం. వారికి జీతం ఇవ్వడానికి మాకు కనీసం రూ.7 లక్షల వరకు ఖర్చు అయ్యేది. మా స్కూల్‌తో పాటు చుట్టుపక్కల 5 పాఠశాలల్లో టీచర్లను ఏర్పాటు చేశాం. అంతే కాకుండా పిల్లలకు కరాటే, యోగా వంటివి నేర్పిస్తుంటాం. వీటికి మొత్తం కలిసి దాదాపు రూ. 9 లక్షల వరకు ఖర్చు అవుతోంది.
నా రెండు నెలల జీతం విద్యార్థుల కోసం ఉపయోగిస్తాను …..
చుట్టుపక్కల 25 పాఠశాలల్లో ఉచితంగా నోట్‌బుక్స్, పరీక్ష సమయాల్లో ప్యాడ్‌లు, పెన్నులు, జామెంట్రీ బాక్స్‌లు, షూ, బట్టలు నా సొంత డబ్బులతో పంచుతుంటాను. చాలా వరకు ప్రైమరీ పాఠశాలల్లో ఇస్తుంటాను. ప్రతి సంవత్సరం 10 మంది విద్యార్థులకు నా ముగ్గురు స్నేహితులతో కలిసి వారికి అవసరమైన బస్‌పాస్‌ల నుంచి అన్ని సదుపాయాల ఖర్చు మేమే భరిస్తుంటాం.
ఆరు లక్షల మొక్కలు నాటించడమే లక్షం….
1999లో మొట్టమొదటిసారిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. తోల్కట్ట స్కూల్‌లో రూ.500 ఖర్చు చేసి లంగర్‌హౌస్ నుంచి 25 అశోక చెట్లు తీసుకువచ్చి పాఠశాలలో నాటాను. అప్పటి నుంచి ప్రారంభమై నేటికీ యజ్ఞంలా కొనసాగుతుంది. ఒకప్పుడు చేవెళ్ల ప్రాంతంలో మొక్కలు కావాలంటే కనీసం నర్సరీ కూడా ఉండేది కాదు. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రెంజ్ ఆఫీసర్ అయిన జ్ఞానేశ్వర్ సార్‌ని కలిసాను. 2005 06 వ సంవత్సరంలో నేను కమ్మెట గ్రామంలో ఇన్‌చార్జ్ హెడ్‌మాస్టర్‌గా పని చేస్తుండేవాడిని. అప్పుడు అక్కడి చుట్టుపక్కల రైతులకు మొక్కలు నాటడానికి చాలా ఇబ్బందులు ఉండేవి. దాంతో సార్ సహాయంతో కమ్మెట గ్రామంలో నర్సరీని ఏర్పాటుచేశాను. అప్పట్లో అది రంగారెడ్డిజిల్లాలో మూడవ పెద్ద నర్సరీగా పేరు తెచ్చుకుంది. దాంతో ప్రతి ఒక్క రైతు వారి పంటపొలాల్లో ఈ మొక్కలను నాటారు. వాటికి రక్షణగా ట్రీగాడ్‌ని ఏర్పాటుచేశాం. 20 11లో పర్యావరణం పరిరక్షించే కార్యక్రమాల్లో నేను పాల్గొనే సమయంలో కొంతమంది టీచర్ల సహాయంతో చాలా గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉండే కాలేజీ, స్కూల్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాం.
కరెంట్ లేని గ్రామాలకు సోలార్ వెలుగులు……
ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కలిసి ఏర్పాటుచేసిన ‘స్ట్రీట్ కాజ్’ (street cause) అనే సంస్థ సహకారంతో చేవెళ్ల, శంకర్‌పల్లి చుట్టుపక్కల గ్రామాల్లో 2000 నుంచి 3000 వరకు సోలార్ లైట్స్‌ని ఏర్పాటు చేయించాను. వారితో పాటు ఇంకొందరి సహాయంతో 8 గ్రామాల్లో విద్యుత్ సదుపాయం లేని ఊర్లల్లో , ఇంకా కొన్ని గ్రామాల్లో దాదాపు రూ.17 లక్షల వ్యయంతో సోలార్ లైట్‌లు ఏర్పాటు చేశాం. అంతే కాకుండా పలు చోట్ల ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వార్డులో, పాత కస్తుర్బా బిల్డింగ్‌లో దోమ తెరలు ఏర్పాటు చేశాం. Delloitte అనే కంపెనీ సహాయంతో అంతారం గ్రామంలో రూ. 1,25,000 వ్యయంతో వాటర్ ప్లాంట్‌ని నిర్మించాం. హైదరాబాద్ యూత్ అసెంబ్లీలో సంస్థ వారి తరుఫున గ్రామాల్లో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేశాం. రైతులకు కలుపుమొక్కలు రాకుండా షీటులను అందించాం. అంతే కాకుండా వీరి సహాయంతో శ్రీశైలంనల్లమల, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో కనీసం కరెంటు సదుపాయం లేని ప్రాంతాల్లో వీధి లైట్లును ఏర్పాటు చేశాం. కరెంటు సహాయం లేకుండా సోలార్‌తో వెలిగే లైట్లను అక్కడ ఏర్పాటు చేశాం. ఆదివాసులు ఉండే 8 గ్రామాల్లో విద్యుత్ సదుపాయం కల్పించాం.
గ్రామాల్లో వైద్య శిబిరాలు ….
ఈ శిబిరాలను 2005లో ప్రారంభించాం. 220 వరకు క్యాంపులు నిర్వహించాం. నేను నా స్నేహితుల సహాయంతో, స్వచ్ఛంద సంస్థల ద్వారా వినికిడి లోపం ఉన్న పేద పిల్లలకు యంత్రాలు ఇప్పించడం, దంత, నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు కూడా జరిపించాం. ఇప్పటి వరకు 25 మంది బీద పిల్లలకు ఆపరేషన్లు చేయించాం. ఉచితంగా కళ్ళ అద్దాలు కూడా పంపిణీ చేశాం.
రక్తదాన శిబిరాలు ….
కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే మేము సేకరించిన రక్తాన్ని అందిస్తుంటాం. 2008లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఇప్పటి వరకు 50కి పైగా రక్తదాన శిబిరాలు పెట్టాను. నా దగ్గర 5000 మంది రక్త దాతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మేము సేకరించిన బ్లడ్‌ని గాంధీ, నీలోఫర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఇస్తుంటాం. అత్యవసర పేషెంట్‌లకు ఈ రక్తాన్నీ అందిస్తుంటాం. నేను చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం హోం శాఖ మంత్రి చేతులమీదగా అవార్డు కూడా అందజేసింది.
బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్‌లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం ఇద్దరం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో డా॥ ధర్మారెడ్డి చేస్తుంటాడు. తెలంగాణలో నేను చేవెళ్లలో నిర్వహిస్తున్నాను. ఇప్పటి వరకు 35గ్రామాల్లో నిర్వహించాను. దానికి అయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటున్నాను. చాలా గ్రామాల్లో ఉండే వారికి వారి బ్లడ్ గ్రూప్ తెలియదు. అలాంటి వారు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్లి చెక్ చేయించుకుంటే రు.100/ వరకు ఖర్చు అవుతుంది. 2011లో నా స్నేహితుడు రాజశేఖర్ సహాయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఇప్పటి వరకు ఉచితంగా 35,000 మందికి ఈ సేవలు అందించాను.
పశు వైద్య శిబిరాలు… రైతు సదస్సులు…
డా॥ పుల్లయ్య, డా॥ రామన్న రిటైర్డ్ సైంటిస్ట్, స్నేహితుడు ప్రభాకర్‌ల సహాయంతో ఇప్పటి వరకు పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. రైతులకు వ్యవసాయం చేయడంలో కొన్ని సూచనలు ఇస్తున్నాం. వాటికి మందులు కూడా అందిస్తుంటాం. మరో15 మంది సిబ్బందితో రైతు కమిటీలు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు వేల సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించాం.
నేత్రదానంపై అవగాహన…
నేత్రదానంలో ఎర్రోనిగూడ, ఇక్కరెడ్డిగూడ తెలంగాణలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి చనిపోయిన తర్వాత వారి అవయాలను దానం చేసే కార్యక్రమానికి నేను ఎక్కువ శాతం పాల్గొంటుంటాను. నేత్రదానం అనేది చాలా పెద్ద కార్యక్రమం. దానిలో నేను పాల్గొని ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తుంటాను. ఈ నేత్ర దానం బంజారాహిల్స్‌లోని ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఇస్తుంటాం.
విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమాలు..
నేను చదువు చెబుతున్న స్కూల్లో చాలావరకు విద్యార్థులకు సేవా కార్యక్రమాలపై, గ్రామాల్లో ఉండే పరిస్థితులపై అవగాహన కల్పిస్తుంటాం. ప్రతి సంవత్సరం మేము పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనే ఒక వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాం. ఇది నేను 2006లో కమ్మెట స్కూల్లో ఉన్న సమయంలో ప్రారంభించాను. అప్పుడు ఆ వర్క్‌షాప్‌కి వచ్చిన వారికి భోజనం ఖర్చు నా సొంతంగా ఇచ్చేవాడిని. ఇప్పుడు ఖతార్‌లో శ్రీహరి రెడ్డి అనే నా స్నేహితుడు, నేను కలిసి 4 సంవత్సరాలుగా తెలంగాణలో 350 వర్క్‌షాప్‌లను నిర్వహించాం. ప్రతి మండలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఈ వర్క్‌షాప్‌ను చేస్తుంటాం. ఒక వర్క్‌షాప్‌లో ఒక్కొక్క మండలం నుంచి 10 గ్రామాలలోని విద్యార్థులు పాల్గొంటారు. దీనికి లక్షల్లో ఖర్చు అవుతుంది. దానికి నా స్నేహితుడు, అక్కడి తెలంగాణ వారు కొందరు సహాయం చేస్తుంటారు.
ప్రభుత్వ పాఠశాలలకు మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు….
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సమస్య ఉంది. బాలల, మహిళల వసతి గృహాల్లో నీటి సమస్య లేకుండా చేయాలనుకుంటున్నాను. అందుకోసం నా స్నేహితుడు డ్యానియల్, ఎన్‌జీవో సహాయంతో బోరు వేయాలని అనుకుంటున్నాను. ఒక్క బోరుకి వచ్చి రూ.80,000 వరకు ఖర్చు అవుతుంది. కొన్ని రోజుల్లోనే ఈ కార్యక్రమం మొదలుపెడతాం.
అవార్డులు……
* 2011లో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణవేత్త పురస్కారం అవార్డు.
* 2012లో వృక్షమిత్ర అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
* 2014లో రైతు బంధు అవార్డు, రక్త బంధు అవార్డు
* 2015 లో అవుట్ స్టాండింగ్ సోషల్ లీడర్‌షిప్ అవార్డు
* 2016 లో సేవా భారతి, గ్రీన్ ఇండియా పర్యావరణ పురస్కారం
* 2017లో అవుట్ స్టాండింగ్ సోషల్ లీడర్‌షిప్ అవార్డు.
* 2018లో రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి పురస్కారం, హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి నుంచి జూన్ 14న అవార్డును అందుకున్నాను.

కాసోజు విష్ణు…