Wednesday, April 24, 2024

బడి చదువుల్లో వెనుకబడి ఎంతకాలమిలా?

- Advertisement -
- Advertisement -

Students

దాదాపు ఇరవై ఐదు శాతం పిల్లలకు వయసుకు తగిన విద్యా నైపుణ్యాలు లేవు. ఆరు సంవత్సరాల లోపు వయసు కల పిల్లలలో కేవలం 37 .4 శాతం మంది మాత్రమే కనీసం అక్షరాలను గుర్తు పట్టగలుగుతున్నారు. మూడవ తరగతి పిల్లలలో కేవలం యాభై శాతం మాత్రమే ఒకటవ తరగతి పుస్తకాన్ని చదవగలిగారు. ఇరవై ఐదు శాతం పిల్లలు మాత్రమే చిన్న చిన్న కూడికలు చేయగలుగుతున్నారు.

రెండవ తరగతి పిల్లలలో కేవలం 34 శాతం మంది మాత్రమే తమ తరగతి కన్నా తక్కువ స్థాయి పాఠ్య పుస్తకాన్ని చదవగలుగుతున్నారు.

ప్రాధమిక దశలో అక్షరాలు, అంకెలు, చిన్న చిన్న కూడికలు, గుణకారాలు వంటివి సరిగా నేర్చుకోకుండానే తర్వాత తరగతులకు వెళ్లిన పిల్లలు ఆయా తరగతులలో పాఠాలను అర్ధం చేసుకోలేక చదువులో వెనుకబడి పోవడం, దానితో చదువు మీద ఆసక్తి కోల్పోయి అనేక మంది విద్యార్థులు సగం చదువులతో ఆగిపోతున్నారు.

గతంతో పోలిస్తే ప్రాధమిక విద్యా వ్యవస్థలో చెప్పుకోదగ్గ గుణాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి. సర్వ శిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పధకం వంటి పధకాలు పిల్లలను బడికి రప్పించడంలో సఫలీకృతం అయ్యాయి. బడి ఈడు పిల్లలలో దాదాపు 98 శాతం పిల్లలు బడిలో నమోదు చేసుకుంటున్నారంటే అది సాధారణ విజయం కాదు. దాదాపు 14 లక్షల పాఠశాలలు, 77 లక్షల మంది ఉపాధ్యాయులతో కూడిన విస్తృతమైన పాఠశాల విద్యా వ్యవస్థ మనది. ప్రస్తుతం దేశంలోని దాదాపు 98 శాతం గ్రామాలకి ఒక కిలోమీటర్ దూరం లో ప్రాధమిక పాఠశాల, 92 శాతం గ్రామాలకి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాధమికోన్నత పాఠశాల ఉన్నాయి. ఒక పదిహేను సంవత్సరాల నాటి పరిస్థితితో పోలిస్తే ఇది ఎంతో చెప్పుకోదగిన విజయమే.

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా కలిగిన దేశంగా అవతరిస్తున్న ఈ సందర్భంలో సరైన చదువు, నైపుణ్యాలు లేని యువకుల సంఖ్య పెరిగిపోవడం దేశ భవిష్యత్తుకు ఎంత ప్రమాదకరమో తెలియంది కాదు. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాలలో, ఉపాధిలో తెస్తున్న మార్పులకు ఆ పరిజ్ఞానాన్ని, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు లేని యువత తోడై దేశాన్ని ఆర్ధికంగా, సామాజికంగా, సాంకేతికంగా తిరోగమనం వైపు మళ్లించే పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ప్రాధమిక స్థాయి నుండి విద్యార్థుల విద్యా ప్రమాణాల మీద దృష్టి పెట్టాల్సి ఉంది.

ప్రథం స్వచ్ఛంద సంస్థ దేశంలోని పిల్లల లెర్నింగ్ లెవెల్స్ పై ప్రతి ఏటా విడుదల చేసే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ను 2019 వ సంవత్సరానికి గాను జనవరి రెండవ వారంలో విడుదల చేసింది.24 రాష్ట్రాలలోని 26 జిల్లాలలో 1514 గ్రామాలలో నిర్వహించిన ఈ సర్వే ఈ సంవత్సరం 4 నుండి 8 సంవత్సరాల వయసు కల 36930 మంది పిల్లలపై దృష్టి పెట్టింది. గత పదిహేను సంవత్సరాలుగా ఎంతో శాస్త్రీయంగా జరిగే ఈ సర్వే లలో ప్రతి ఏటా దేశంలో విద్యా ప్రమాణాల నాణ్యత లేమి వెల్లడవుతూనే ఉంది. ఈ సంవత్సరం ఫలితాలు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు.

అధ్యయనం జరిపిన పిల్లలలో తొంభై శాతం మంది ఏదో ఒక విద్యా సంస్థలో ప్రవేశం పొంది ఉన్నారు. ఇందులో బాలికలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలోనూ, బాలురు అధికంగా ప్రైవేట్ పాఠశాలలోనూ విద్యనభ్యసిస్తున్నారు. నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలలో దాదాపు 57 శాతం బాలికలు, 50 శాతం బాలురు ప్రభుత్వ పాఠశాలలకు వెళుతుండగా మిగిలిన 43 శాతం బాలికలు, 50 శాతం బాలురు ప్రైవేట్ పాఠశాలలకు హాజరవుతున్నారు. ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల వయసు కల పిల్లలలో ఈ జెండర్ గ్యాప్ మరింత అధికంగా ఉంది. వీరిలో దాదాపు 61 శాతం అమ్మాయిలు, 52 శాతం అబ్బాయిలు ప్రభుత్వ పాఠశాలలకు హాజరవుతున్నారు.

స్థూలంగా చూస్తే సర్వే చేసిన మొత్తం పిల్లలలో దాదాపు ఇరవై ఐదు శాతం పిల్లలకు వయసుకు తగిన విద్యా నైపుణ్యాలు లేవనేది అధ్యయనంలో తేలిన అంశం. మరింత సూక్ష్మంగా చూస్తే ఆరు సంవత్సరాల లోపు వయసు కల పిల్లలలో కేవలం 37 .4 శాతం మంది మాత్ర మే కనీసం అక్షరాలను గుర్తు పట్టగలుగుతున్నారు. కేవలం ఇరవై ఐదు శాతం పిల్లలు మాత్రమే చిన్న చిన్న కూడికలు చేయగలుగుతున్నారు. రెండవ తరగతి పిల్లలలో కేవ లం 34 శాతం మంది మాత్రమే తమ తరగతి కన్నా తక్కువ స్థాయి పాఠ్య పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. మూడవ తరగతి పిల్లలలో కేవలం యాభై శాతం మాత్రమే ఒకటవ తరగతి పుస్తకాన్ని చదవగలిగారు.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఈ సర్వే నిర్వహించగా అక్కడి మూడవ తరగతి విద్యార్థులలో కేవలం 26 శాతం మంది పిల్లలు మాత్రమే ఒకటవ తరగతి పుస్తకాన్ని చదవగలిగారు. రెండవ తగరతి విద్యార్థులలో 17 శాతం మంది, ఒకటవ తరగతి విద్యార్థులలో 4 శాతం మంది మాత్రమే ఒకటవ తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నారు.

ఇందులో ఒకటి, రెండవ తరగతి చదివే పిల్లలలో దాదాపు 59 శాతం, మూడవ తరగతి పిల్లలలో 44 శాతం ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నట్లు తెలుస్తుంది. కాబట్టి విద్యా ప్రమాణాల విషయానికి వస్తే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు పెద్ద తేడా ఏమీ లేదనేది స్పష్టంగానే అర్ధమవుతుంది.

ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ప్రాధమిక దశలో ప్రమాణాలు సరిగా లేకపోవడం అనేది పిల్లల చదువుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రాధమిక దశలో అక్షరాలు, అంకెలు, చిన్న చిన్న కూడికలు, గుణకారాలు వంటివి సరిగా నేర్చుకోకుండానే తర్వాత తరగతులకు వెళ్లిన పిల్లలు ఆయా తరగతులలో పాఠాలను అర్ధం చేసుకోలేక చదువులో వెనుకబడి పోవడం, దానితో చదువు మీద ఆసక్తి కోల్పోయి అనేక మంది విద్యార్థులు సగం చదువులతో ఆగిపోవడం మనం చూస్తున్న విషయమే. ప్రథం సంస్థలాంటి అనేక సంస్థలు, అధ్యయనాలు ఈ విషయాన్ని పదే పదే రుజువు చేస్తున్నప్పటికీ మన ప్రాధమిక విద్యా వ్యవస్థని ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నాం అనేదే మనకి సమాధానం దొరకని ప్రశ్న.

నిజానికి గతంతో పోలిస్తే ప్రాధమిక విద్యా వ్యవస్థలో చెప్పుకోదగ్గ గుణాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి. సర్వ శిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పధకం వంటి పధకాలు పిల్లలను బడికి రప్పించడంలో సఫలీకృతం అయ్యాయి. బడి ఈడు పిల్లలలో దాదాపు 98 శాతం పిల్లలు బడిలో నమోదు చేసుకుంటున్నారంటే అది సాధారణ విజయం కాదు. దాదాపు 14 లక్షల పాఠశాలలు, 77 లక్షల మంది ఉపాధ్యాయులతో కూడిన విస్తృతమైన పాఠశాల విద్యా వ్యవస్థ మనది. ప్రస్తుతం దేశంలోని దాదాపు 98 శాతం గ్రామాలకి ఒక కిలోమీటర్ దూరం లో ప్రాధమిక పాఠశాల, 92 శాతం గ్రామాలకి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాధమికోన్నత పాఠశాల ఉన్నాయి.

ఒక పదిహేను సంవత్సరాల నాటి పరిస్థితితో పోలిస్తే ఇది ఎంతో చెప్పుకోదగిన విజయమే. అయితే ఆ పాఠశాలల్లో మెరుగైన వసతులను అం దించడంలో, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో మాత్రం ఇప్పటికీ విఫలమవుతూనే ఉన్నాం. పాఠశాలలలో నమోదు చేసుకున్న విద్యార్థులలో దా దాపు 29 శాతం ప్రాధమిక విద్యతోనే, 43 శాతం ప్రాధమికోన్నత విద్యతోనే చదువును ఆపేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం నమోదు చేసుకున్న విద్యార్థులలో 42 శాతం మాత్రమే ఉన్నత పాఠశాల విద్యని పూర్తి చేసుకోగలుగుతున్నారు. ఆరు నుండి పదకొండు సంవత్సరాల వయసు కల పిల్లలలో 14 లక్షల మంది పాఠశాలకు దూరంగానే ఉండిపోతున్నారు. ఒక వేళ వీరంతా పాఠశాలలో కొనసాగినట్లైతే వారందరి అవసరాలకు సరిపోయేంతగా మన వ్యవస్థ లేదని అర్ధమవుతుంది. ఇప్పటికే ప్రాధమిక పాఠశాలల్లో దాదాపు 7 లక్షల మంది టీచర్ల కొరత ఉంది. కేవలం 53 శాతం పాఠశాలలోనే బాలికలకు టాయిలెట్లు ఉన్నాయి. 74 శాతం పాఠశాలలోనే పిల్లలకు రక్షిత తాగునీరు అందుబాటులో ఉంది.

కనీస మౌలిక సదుపాయాల పరిస్థితే ఇంకా మెరుగుపర్చుకోలేని వ్యవస్థ నుండి మెరుగైన విద్యా ప్రమాణాలను ఆశించడం అత్యాశే అయినప్పటికీ అక్కడక్కడా జరుగుతున్నకొన్ని ప్రయోగాలు ఇంకా ఆశని నిలిపి ఉంచుతున్నాయి. ఉదాహరణకి ప్రథం సంస్థ ప్రయోగాత్మకంగా చేసిన టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ (స్థాయికి తగిన బోధన) కార్యక్రమం ప్రాధమిక స్థాయి విద్యార్థులలో చదవగలగడం, కనీస గణిత పరిజ్ఞానం అనే అంశాలపై దృష్టి పెట్టింది. వివిధ తరగతులకు చెందిన పిల్లలలో లెర్నింగ్ లెవెల్స్ స్థాయిని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సాధనాల ద్వారా వారి స్థాయి ని అంచనా వేసి వారి వయసు, తరగతిని బట్టి కాకుండా వారి స్థాయిని బట్టి గ్రూపులు గా చేసి బోధన చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన పావర్టీ యాక్షన్ ల్యాబ్ వంటి సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో ఈ కార్యక్రమంలో పిల్లలు సాధారణ విద్యార్షులతో పోలిస్తే ఎంతో త్వరగా తమ లెర్నింగ్ లెవెల్స్ ను మెరుగుపరుచుకున్నట్లు తెలుస్తుంది.

ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ గ్రహీతలైన అభిజీత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో ఆధ్వరంలో ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ పద్దతిలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో శాస్త్రీయంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో స్వల్పకాలిక లెర్నింగ్ క్యాంపు లలో కూడా ఈ పద్దతిలో పిల్లలు త్వరగా చదవడం, కనీస గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరుగుతుందని తెలిసింది. దీని ఆధారంగా కొన్ని రాష్ట్రాలు ఈ పద్దతిలో ప్రాధమిక స్థాయి విద్యార్థుల లెర్నింగ్ లెవెల్స్ ను మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి కానీ ఫలితాలు మాత్రం ఇంకా సాధించలేకపోతున్నామంటే ఇందులో వ్యవస్థ వైఫల్యం ఎంత ఉందో తెలుస్తుంది. మన పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోవడంలో అసలు సమస్య ఏమిటి అనేది మనకు తెలుసు. కొన్ని పరిష్కారాల మార్గాలు రుజువులతో సహా మన ముందే ఉన్నాయి.

అయినా ఎందుకు పురోగతి సాధించలేకపోతున్నాం అంటే కారణం ఒక్కటే కనిపిస్తుంది. చిత్తశుద్ధి లేమి. పాలకులు, వ్యవస్థలు ఇప్పటికైనా పూనుకోకపోతే నానాటికీ విస్తరిస్తున్న పోటీ ప్రపంచంలో మన పిల్లల భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారిపోతుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా కలిగిన దేశంగా అవతరిస్తున్న ఈ సందర్భంలో సరైన చదువు, నైపుణ్యాలు లేని యువకుల సంఖ్య పెరిగిపోవడం దేశ భవిష్యత్తుకు ఎంత ప్రమాదకరమో తెలియంది కాదు. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాలలో, ఉపాధిలో తెస్తున్న మార్పులకు ఆ పరిజ్ఞానాన్ని, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు లేని యువత తోడై దేశాన్ని ఆర్ధికంగా, సామాజికంగా, సాంకేతికంగా తిరోగమనం వైపు మళ్లించే పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ప్రాధమిక స్థాయి నుండి విద్యార్థుల విద్యా ప్రమాణాల మీద దృష్టి పెట్టాల్సి ఉంది.

Students Lagging Behind?

భారతి కోడె, 94401 03411

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News