Home ఎడిటోరియల్ విద్యా విధానమే ముద్దాయి

విద్యా విధానమే ముద్దాయి

sampadakiyam

 

బతకడం ఒక కళ, బతికించడం బృహత్కళ. మనం బతుకుతూ ఇతరులు సుఖంగా జీవించగలగడానికి తోడ్పడగలిగితే అంతకంటే జీవిత పరమార్థం మరొకటి ఉండదు. జనం జీవితమంటే భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడితే ప్రపంచ గమనమే అతలాకుతలమవుతుంది. మనిషి నిండు జీవితం జీవిస్తేనే సమాజం వర్ధిల్లుతుంది. ఆత్మహత్యలు ఎక్కువవుతున్న కొద్దీ అవి మిగతావారి లోనూ మానసిక కుంగుబాటును కలిగించి నైరాశ్య చింతనకు దారితీసి అదొక సామూహిక ధోరణిగా మారే ప్రమాదం తలెత్తుతుంది. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకారి. గురువారం నాడు ఫలితాలు వెలువడిన ఇంటర్ మీడియట్‌లో పాస్ కాలేకపోయామనే దిగులుతో రాష్ట్రంలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళనకరమైన పరిణామం. ఆత్మస్థైర్యాన్ని పుంజుకోడం, గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలగడం అనే వాటిని నేర్పడం మన విద్యలో భాగం కాలేకపోడమే ఈ ఆత్మహత్యల పరంపరకు ఒక ప్రధాన కారణమని అంగీకరించకతప్పుదు. అందుచేత మన విద్యా విధానాన్నే విద్యార్థుల ఆత్మహత్యల కేసులో మొదటి ముద్దాయిగా బోనెక్కెంచవలసి ఉన్నది. ఒక్క 2014 సంవత్సరంలోనే దేశంలో 8032 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలో 30% మంది పరీక్షలు తప్పిపోయిన వారేనని జాతీయ నేర రికార్డుల విభాగం గణాంకాలు వెల్లడించాయి. దేశంలోని అన్ని ఆదాయ వర్గాల తల్లిదండ్రులూ తమ పిల్లలు ఇంజినీరో, డాక్టరో కావాలని అటువంటి మరే సంప్రదాయ ఉన్నత వృత్తిలోనో స్థిరపడాలని కోరుకుంటున్నారని కొత్త కోర్సుల పట్ల అవగాహన ఉన్నా వాటివైపు వారిని మళ్లించడం లేదని వారి ఒత్తిడి అవధులు మీరడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న దానిని ఎంతమాత్రం కాదనలేము. విద్యార్థులు తమ సొంత ఆసక్తిని బట్టికాక తలిదండ్రుల ప్రాధాన్యాలను బట్టి చదువుకోవలసి రావడమే పరీక్షల్లో తప్పడానికి ఆత్మహత్యలకు దారి తీస్తున్నదని భావించడాన్ని తప్పుపట్టవలసి పని లేదు. ఫెయిలయిన విద్యార్థులు పాసైన సాటి వారితో పోల్చుకొని తలిదండ్రులు తిడతారనే బెంగపెట్టుకొని ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అంతేగాని వైఫల్యాలే విజయ సోపానాలనే దృష్టితో ఆత్మ విశ్వాసాన్ని పుంజుకోలేకపోతున్నారు. చచ్చి సాధించేదేమీ ఉండదనే ఇంగితాన్ని కోల్పోయి పరాజయ భావంతో క్షణిక ఆవేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇంటర్ మీడియట్ వంటి వ్యవస్థలలోని లోపాలూ ఇందుకు తోడవుతున్నాయి. దేశంలో 416 సంవత్సరాల వయసులోని పిల్లల్లో 12% మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ఒక సర్వే నిగ్గు తేల్చింది. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరిలో 17% మంది అంటే లక్షా 35 వేల మంది భారతీయులే. ప్రపంచ జనాభాలో భారత జనాభా 17.5 శాతం. 1987 నుంచి 2007 వరకు గల 20 ఏళ్లల్లో ప్రపంచంలో ఆత్మహత్యల సంఖ్య ప్రతి లక్ష మందికి 7.9 % నుంచి 10.3 శాతానికి పెరిగింది. ఇందులో దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాల్లో అధికంగా ఆత్మహత్యలు సంభవించాయి. విజయాలే తప్ప వైఫల్యాలు తమను పలకరించకూడదనే స్వీయాధిక్యతా భావం ఫ్యూడల్ సమాజ నేపథ్యం నుంచి ఎక్కువగా ఊడిపడుతుంది. అలాగే అది మగ హీరోయిజాన్ని పోషించే పురుషాధిపత్య సమాజం లక్షణం కూడా. సమాజం మరింతగా ప్రజాస్వామికమవుతున్న కొద్దీ ఈ రకమైన భావజాలం తగ్గుముఖం పట్టి ఆచరణాత్మక అవగాహన పిల్లల్లో పెరగవలసి ఉంది. అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. అంటే సమాజం ప్రజాస్వామ్యీకరణ చెందడం లేదన్న మాట. పరీక్షల్లో ఫెయిల్ కావడం కేవలం తమ చేతగానితనం వల్ల సంభవించేది కాదని అందుకు ఇతర అనేక కారణాలు ఉంటాయనే హేతు దృష్టి పిల్లల్లో కొరవడుతోంది. ఇటు తలిదండ్రులు, అటు అధ్యాపక వర్గమూ పిల్లల్లో ఈ అవగాహన కలిగించాలి. అందుకు బదులుగా వారు చదువుల్లో ముందున్నవారితో పోల్చి ఇతర పిల్లలను తక్కువగా చూడడం, తూలనాడడం చేస్తుంటారు. ఇది ఆ పిల్లల్లో మరింత కుంగుబాటుకు దారితీస్తుంది.ప్రైవేటు విద్యా వ్యాపారం మితిమించి పోయిన తర్వాత విద్యార్థులకు ఆటపాటలు, విద్యేతర నైపుణ్యాలు గరపడం వంటివి బొత్తిగా కరువయ్యాయి. నిరంతరం రుబ్బి, నూరి పోసే మార్కుల చదువుల ప్రాబల్యం దారుణంగా పెరిగిపోయింది. డొనేషన్లు, ఫీజులు, వగైరాల కింద తలిదండ్రులు అప్పుల చేసి, తాకట్లు పెట్టి అత్యధిక ధనం కుమ్మరించి చేర్పిస్తే పాస్ కాలేకపోయామనే భావన విద్యార్థులను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నది. విద్యార్థులకు సరైన కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతి నెలకొనాలి. అలాగే తగినంత తీరిక ఊపిరి పీల్చుకునే వ్యవధి కలిగించి పరీక్షలకు సిద్ధం చేసే పద్ధతి నెలకొనాలి.

Students suicide after fail in Inter exams